న్యూఢిల్లీ: లాకర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులు చేతులు కడిగేసుకుంటే సరిపోదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లాకర్ సదుపాయం నిర్వహణలో బ్యాంకులు పాటించాల్సిన నిబంధనలను ఆరు నెలల్లోగా తీసుకురావాంటూ ఆర్‌బీఐని ఆదేశించింది. జస్టిస్ ఎమ్‌ఎమ్ శాంతనా గోదార్, జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం లాకర్లకు సంబంధించి తమ ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. సామాన్యుని జీవితంలో బ్యాంకులు గణనీయమైన పాత్రను పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న క్రమంలో ప్రజలు లిక్విడ్ ఆస్తులను ఇళ్లలో ఉంచుకునేందుకు ఆసక్తిగా లేరని, అందుకే లాకర్ల వంటి సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది.
రెండు కీలతో కూడిన లాకర్ సదుపాయాల స్థానంలో ఎలక్ట్రానిక్‌గా నిర్వహించగలిగే లాకర్లకు మళ్లుతున్నామని గుర్తు చేస్తూ.. దుండగులు టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం ద్వారా.. కస్టమర్ల అంగీకారం లేకుండానే వారి లాకర్లను తెరిచే అవకాశం ఉందన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు తమకు బాధ్యత లేదనడం కుదరదని పేర్కొంది. ఇది వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడింది. కనుక లాకర్లు/ సేఫ్ డిపాజిట్ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ సమగ్రమైన నిబంధనలను ఆర్‌బీఐ తీసుకురావాలని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు ఆరు నెలల సమయాన్నిచ్చింది. లాకర్ల విషయమై కస్టమర్లకు ఏదైనా నష్టం జరిగితే బ్యాంకుల బాధ్యత ఏ మేరకు నిర్ణయించే అంశాన్ని ఆర్‌బీఐకే విడిచిపెట్టింది.
లాకర్ల విషయంలో భరోసా ఉండాల్సిందే
Published Sat, Feb 20 2021 4:20 AM | Last Updated on Sat, Feb 20 2021 4:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment