ఈ-లాకర్ మీకూ కావాలా?
బ్యాంకుల్లో లాకర్లు దొరకటమంటే మాటలు కాదు. బ్యాంకులు చాలా అంశాలను పరిశీలించాక కానీ వీటిని కేటాయించవు. అయితే ఇపుడు మామూలు లాకర్లతో పాటు ఇంటర్‌నెట్ లాకర్లూ అవసరమవుతున్నాయి. డిజిటల్ రూపంలో ఉండే పత్రాలను దాచుకోవటానికి బోలెడన్ని వెబ్‌సైట్లు, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌ల వంటివి ఉన్నా... వాటిల్లో సెక్యూరిటీ బాగానే ఉన్నా... అవన్నీ ప్రయివేటు సంస్థలు ఆఫర్ చేస్తున్నవే. అందుకే తొలిసారి మన కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా డిజిటల్ లాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్‌లాకర్.జీఓవీ.ఇన్ లేదా ఈలాకర్.జీవోవీ.ఇన్‌లోకి లాగిన్ కావటం ద్వారా ఈ లాకర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ లాకర్ తెరవటానికి కనీస నిబంధన ఏంటంటే... ఆధార్ నంబరు కలిగి ఉండటం. ఆ సైట్లో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే... ఆటోమేటిగ్గా ఒన్ టెమ్ పాస్‌వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వస్తుంది. అంటే ఆ ఆధార్ నంబరు మీదో, కాదో తెలుసుకోవటానికి ఒక రకమైన చెకింగ్ అన్న మాట. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయటం ద్వారా లాకర్ ఆరంభించవచ్చు. అక్కడే మీరు మీ దగ్గరున్న డిజిటల్ పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు.
విద్యార్హతల సర్టిఫికెట్లు, ప్రభుత్వ ఐడీ కార్డులు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, టెలిఫోన్ - వాటర్ - కరెంటు బిల్లులు, రేషన్ కార్డు, ఆస్తిపన్ను రిసీట్లు... ఇలా డిజిటల్ రూపంలో ఉండే పత్రాల్ని దీన్లో దాచుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 10 ఎంబీ స్టోరేజీ సౌకర్యం మాత్రమే కల్పిస్తోంది. దీన్ని మెల్లగా 1 జీబీకి పెంచాలన్నది ప్రభుత్వ యోచన. అయితే ప్రస్తుతం దీన్లో పీడీఎఫ్, జేపీజీ, జేపెగ్, పీఎన్‌జీ, బీఎంపీ, జీఐఎఫ్ తరహా ఫైళ్లను, అందులోనూ ఒక ఎంబీ మించని ఫైళ్లను మాత్రమే దాచుకునే అవకాశం ఉంది.
ఇంకో చక్కని ఫీచర్ ఏంటంటే... దీన్లో మీరు దాచుకున్న ఫైళ్లలో దేన్నయినా, ఎవరికైనా పంపాలనుకుంటే షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అక్కడుండే షేర్ లింకును ప్రెస్ చేయటం ద్వారా... మీరు పంపాలనుకున్న ఈ మెయిల్‌ను ఎంటర్ చేసే లింకు ప్రత్యక్షమవుతుంది. అక్కడ పంపాల్సిన మెయిల్ ఐడీని రాసి, పంపాలనుకున్న ఫైల్‌ను క్లిక్ చేస్తే సరి.