E-mail ID
-
facebook tips
ఫేస్బుక్.. ప్రస్తుతం స్కూల్ విద్యార్థుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం. ఇక యువతీ, యువకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పోస్టింగ్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. అలాగే వివాదస్పద అంశాలను పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా కష్టాలూ తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ను సురక్షితంగా వినియోగించుకోవడానికి సూచనలు.. ♦ మొబైల్ నంబర్, అడ్రస్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్బుక్ ప్రొఫైల్‌లో పెట్టకూడదు. ♦ సాధ్యమైనంత వరకు "keep me logged in' ఆప్షన్‌పై క్లిక్ చేయకపోవడం ఉత్తమం. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ♦ ఇతరుల లేదా పబ్లిక్ కంప్యూటర్ నుంచి వీలైనంత వరకు లాగిన్ కాకపోవడం మంచిది. ♦ పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. ♦ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్స్‌లో వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయకూడదు. ♦ మీ ప్రయాణ, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయకపోవడం మంచిది. ♦ పటిష్ట పాస్వర్డ్.. అంటే ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు, విరామ చిహ్నాలు ఉండే విధంగా చూసుకోవాలి. ♦ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫేస్బుక్ అకౌంట్‌ను లాగ్ అవుట్ చేయడం మరవద్దు. ♦ ఫేస్బుక్ అకౌంట్ వినియోగిస్తున్న పర్సనల్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ♦ మీరు పంపే పోస్టులు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చేరే విధంగా ‘ప్రైవసీ సెట్టింగ్స్’లో మార్పులు చేసుకోవాలి. ♦ వివాదాస్పద, అనవసర పోస్ట్‌లను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ ఫేస్బుక్ అకౌంట్‌కి సెక్యూరిటీ చాలా అవసరం. సెక్యూరిటీ సరిగా లేకుంటే ఇతరులు మీ ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు, చిత్రాలు పోస్ట్ చేసే ప్రమాదం ఉంది. ♦ నకిలీ అకౌంట్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే మీరు పోస్ట్ చేసిన అంశానికి లైక్‌లు రాలేదని బెంగ వద్దు. ♦ నచ్చిన వీడియోలను సేవ్ చేసుకోవడం కోసం ఆ వీడియోపై రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఖాళీ సమయంలో ఆ వీడియోను చూడొచ్చు. ♦ క్రోమ్ బ్రౌజర్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా ప్లేస్టోర్ నుంచి ఫేస్బుక్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే విరామం లేకుండా ఆన్‌లో ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ♦ చాటింగ్ వద్దనుకుంటే డిజేబుల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ♦ మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయాలనుకుంటే facebook app > messagesలోకి వెళ్లి మ్యూట్ చేయదలచిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. వాటిలో మ్యూట్ నోటిఫికేషన్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ♦ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్రెండ్స్‌కి మెసేజ్ పంపిన ప్రతిసారి లొకేషన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ లొకేషన్‌ను "Turn off"‘ చేయాలంటే ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మెసెంజర్ లొకేషన్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయడం ద్వారా మెసేజ్ లొకేషన్ టర్న్ ఆఫ్ అవుతుంది. ♦ ఫేస్బుక్ యాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు క్రియేట్ చేయాలంటే.. ముందుగా మెసేజ్ ఐకాన్‌పై క్లిక్ చేసి గ్రూప్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన వ్యక్తులను గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్‌చేసి సెండ్ చేయాలి. ♦ ఫేస్బుక్లో ఏదైనా కామెంట్‌ను కాపీ చేయాలంటే ఆ కామెంట్‌పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచితే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని "copy comment'’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఆ కామెంట్ కాపీ అవుతుంది. ♦ ఫేస్బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటే మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగినై ఆ తర్వాత వేరొక ట్యాబ్‌లో www.facebook.com/help/delete_ account సాయంతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల తర్వాత అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. -
అశ్లీలంలో ఐడీల గుట్టు!
* ‘స్టఫ్ మై స్టాకింగ్స్’ పుస్తకం ఆధారంగా మెయిల్ ఐడీల సృష్టి * నిఘా వర్గాలకు చిక్కకుండా రూపొందించిన ఐఎం ఉగ్రవాదులు * పుస్తకం వివరాలను ఎట్టకేలకు గుర్తించిన దర్యాప్తు అధికారులు సాక్షి, సిటీబ్యూరో: దిల్సుఖ్నగర్ లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు సమాచారమార్పిడికి వినియోగించిన ఐడీలను అశ్లీల సాహిత్య పుస్తకం ఆధారంగానే సృష్టించినట్లు తేలింది. దాదాపు ఏడాదికి పైగా ఈ పుస్తకం పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఎట్టకేలకు అది ‘స్టఫ్ మై స్టాకింగ్’గా గుర్తించాయి. పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించాడు. ఈ బాధ్యతల్ని తన సోదరుడు యాసీన్ భత్కల్‌కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్‌లను రంగంలోకి దింపాడు. సమాచారమార్పిడికి ఫోన్లపై ఆధారపడితే తేలిగ్గా నిఘా వర్గాలకు దొరికే ప్రమాదం ఉందని వాటికి పూర్తి దూరంగా ఉన్నారు. కేవలం ఈ-మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని రియాజ్ సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తన మెయిల్ ఐడీ నుంచి మిగతా వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మెట్లో ఉన్న ఓ పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉన్న నేపథ్యంలో ఎవరి ఐడీ ఏమిటి? అనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. ఎక్కువగా సంప్రదింపులు జరిపిన వారు ఎక్కువ ఐడీలు, తక్కువగా జరిగిన వారు తక్కువ ఐడీలు సృష్టించుకున్నారు. 2013లో యాసీన్ భత్కల్ సహా మిగిలిన ఉగ్రవాదులు అరెస్టయినప్పుడు ఓ పుస్తకం ఆధారంగా ఐడీలు సృష్టించినట్టు బయటపడింది. అయితే అది ఏ పుస్తకం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అనేక కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఆ పుస్తకం ఇంటర్నెట్లో లభిస్తున్న ‘స్టఫ్ మై స్టాకింగ్స్’గా గుర్తించాయి. ఎవరు, ఏ ఐడీలు వాడారంటే..? .... రియాజ్ భత్కల్ (సూత్రధారి): lovesam361@yahoo.com, patarasingh@yahoo.com, coolallz@yahoo.com, dumzum@paltalk.com. యాసీన్ భత్కల్ (కీలక పాత్రధారి): halwa.wala@yahoo.com, jankarko@yahoo.com, a.haddad29@yahoo.co, hbhaddur@yahoo.com, khalid.k@Nimbuzz.com హడ్డీ (సహాయ సహకారాలు అందించాడు): khalid.k@Nimbuzz, spentthose11@yahoo.com, tashan99@paltalk.com, spentthose@nimbuzz.com మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టాడు): laho0@yahoo.com వఖాస్ (107 బస్టాప్ వద్ద బాంబు పెట్టాడు): Ubhot4u@yahoo.com వీరు వాడిన ఇతర ఐడీలు: Jamesusually10, menothing1, davidthapa77, menothing1 (ఇవన్నీ నింబస్‌లో), kul.chitra@yahoo.com, muthumamu80@yahoo.com, jankarko@yahoo.com -
ఈ-లాకర్ మీకూ కావాలా?
బ్యాంకుల్లో లాకర్లు దొరకటమంటే మాటలు కాదు. బ్యాంకులు చాలా అంశాలను పరిశీలించాక కానీ వీటిని కేటాయించవు. అయితే ఇపుడు మామూలు లాకర్లతో పాటు ఇంటర్నెట్ లాకర్లూ అవసరమవుతున్నాయి. డిజిటల్ రూపంలో ఉండే పత్రాలను దాచుకోవటానికి బోలెడన్ని వెబ్సైట్లు, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌ల వంటివి ఉన్నా... వాటిల్లో సెక్యూరిటీ బాగానే ఉన్నా... అవన్నీ ప్రయివేటు సంస్థలు ఆఫర్ చేస్తున్నవే. అందుకే తొలిసారి మన కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా డిజిటల్ లాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్లాకర్.జీఓవీ.ఇన్ లేదా ఈలాకర్.జీవోవీ.ఇన్‌లోకి లాగిన్ కావటం ద్వారా ఈ లాకర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ లాకర్ తెరవటానికి కనీస నిబంధన ఏంటంటే... ఆధార్ నంబరు కలిగి ఉండటం. ఆ సైట్లో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే... ఆటోమేటిగ్గా ఒన్ టెమ్ పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వస్తుంది. అంటే ఆ ఆధార్ నంబరు మీదో, కాదో తెలుసుకోవటానికి ఒక రకమైన చెకింగ్ అన్న మాట. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయటం ద్వారా లాకర్ ఆరంభించవచ్చు. అక్కడే మీరు మీ దగ్గరున్న డిజిటల్ పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. విద్యార్హతల సర్టిఫికెట్లు, ప్రభుత్వ ఐడీ కార్డులు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, టెలిఫోన్ - వాటర్ - కరెంటు బిల్లులు, రేషన్ కార్డు, ఆస్తిపన్ను రిసీట్లు... ఇలా డిజిటల్ రూపంలో ఉండే పత్రాల్ని దీన్లో దాచుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 10 ఎంబీ స్టోరేజీ సౌకర్యం మాత్రమే కల్పిస్తోంది. దీన్ని మెల్లగా 1 జీబీకి పెంచాలన్నది ప్రభుత్వ యోచన. అయితే ప్రస్తుతం దీన్లో పీడీఎఫ్, జేపీజీ, జేపెగ్, పీఎన్జీ, బీఎంపీ, జీఐఎఫ్ తరహా ఫైళ్లను, అందులోనూ ఒక ఎంబీ మించని ఫైళ్లను మాత్రమే దాచుకునే అవకాశం ఉంది. ఇంకో చక్కని ఫీచర్ ఏంటంటే... దీన్లో మీరు దాచుకున్న ఫైళ్లలో దేన్నయినా, ఎవరికైనా పంపాలనుకుంటే షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అక్కడుండే షేర్ లింకును ప్రెస్ చేయటం ద్వారా... మీరు పంపాలనుకున్న ఈ మెయిల్‌ను ఎంటర్ చేసే లింకు ప్రత్యక్షమవుతుంది. అక్కడ పంపాల్సిన మెయిల్ ఐడీని రాసి, పంపాలనుకున్న ఫైల్‌ను క్లిక్ చేస్తే సరి.