- మునగపాక ఎస్‌బీఐలో ఘటన
- లాకర్లలో ఆభరణాలు, నగదు సురక్షితం
- క్లూస్ టీమ్ వివరాల సేకరణ
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మునగపాక : స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న ప్రచారంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆభరణాలు గాని నగదుకాని చోరీ జరగలేదని ప్రకటించారు. వివరాలివి...
మునగపాక మెయిన్ రోడ్డు పక్కనే ఎస్‌బీఐ బ్రాంచి ఉంది. ఈ నెల 28న రాత్రి 7 గంటల సమయంలో బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యంతోపాటు సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 29న వినాయక చవితి సెలవు కావడంతో తెరవలేదు. 30న ఉదయం 9.15 గంటలకు బీఎంతో పాటు అకౌంటెంట్ ఉమామణి మెయిన్‌గేటు తెరిచి లోపలికి వెళ్లారు. లోపల ఉన్న సర్వర్‌ను ఆన్‌చేసి వస్తుండగా లాకర్లు ఉన్న గది తెరిచి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా బీఎం ఆందోళనకు గురయ్యారు.
అకౌంటెంట్‌ను పిలిచి ముందురోజు లాకర్ గదికి తాళాలు వేయడం మరిచారా అని వాకబు చేశారు. ఆమె తాళాలు వేశామని చెప్పడంతో చోరీ జరిగిందని భావించి హుటాహుటీన స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తన సిబ్బందితో బ్యాంక్‌కు చేరుకున్నారు. లాకర్ గది తాళాలు తీసి కింద పడేసిన విషయాన్ని గమనించి దొంగలు ప్రవేశించారని నిర్ధారించారు. పోలీసుల సమక్షంలో బ్యాంక్ సిబ్బంది అన్ని లాకర్లు తెరిచి చూడగా నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించుకున్నారు.
సీసీ పుటేజ్ ఆధారంగా వివరాలు...
ఎస్‌బీఐలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు దక్షిణ దిశలో ఉన్న కిటికీని గునపాంతో పెకిలించి లోపలికుప్రవేశించారు. క్యాషియర్ రూమ్‌లో ఉన్న ఆలారం కనెక్షన్ తొలగించారు. అనంతరం లాకర్లు ఉన్న గది గేటుకున్న తాళం కప్పలను గునపంతో పెకిలించివేశారు. అదే సమయంలో ఓ దుండగుడు సీపీ కెమెరాను విరగ్గొట్టాడు. దీంతో ఆ తరువాతం ఏం జరిగిందన్న విషయం సీసీ పుటేజీలో కానరాలేదు.
అనుభవం ఉన్న దొంగలపనే...
ఇది చోరీల్లో అనుభవం ఉన్న వ్యక్తుల పనేనని క్లూస్‌టీమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనగేష్ తెలిపారు. ఎటువంటి అనవాళ్లు తెలియకుండా ఇద్దరు వ్యక్తులు ముఖాలకు గుడ్డలు కప్పుకొని, కాళ్ల కు సాక్సులు ధరించి బ్యాంకులోకి ప్రవేశిం చినట్టు గుర్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇద్దరి వయస్సు 32 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చన్నారు. 27న అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటలకు దొంగలు బ్యాంకులో చోరీకి యత్నించారని సీసీ పుటేజీలో గుర్తించామన్నారు.
ఖాతాదారులు ఆందోళన వద్దు..
బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు శనివారం బ్యాంక్‌కు చేరుకున్నారు. తమ ఆభరణాలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, నగదు, ఆభరణాలు లాకర్లలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ భూషణం నాయుడు మునగపాక ఎస్‌బీఐకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి యత్నించిన వ్యక్తులను వదిలేదిలేదన్నారు.
పోలీస్ సైరన్ వల్లే దొంగల పరారీ...
దొంగలు బ్యాంకులో చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వాహనం సైరన్ మోగించుకుంటూ వెళ్లడం వల్లే దొంగలు భయపడి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.