సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టాలనే కుట్రకు గతేడాదే బీజం పడినట్లు తేలింది. దీనికోసం ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిపించిన సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉన్న మరో ఖాతాను వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఖాతాదారులు పరారీలో ఉండటంతో వీరి సహకారంతోనే సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
వేర్వేరు సమయాల్లో తెరిచిన ఖాతాలు
మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టడానికి పథకం వేసిన సైబర్ నేరగాళ్లు రెండు నెలల క్రితమే రంగంలోకి దిగారు. అత్తాపూర్, సిద్ధిఅంబర్ బజార్‌లో ఉన్న బ్రాంచ్‌ల్లో రెండు ఖాతాలు తెరిపించారు. గత నెల 23న నాగోల్‌లోని శాన్విక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో, ఈ నెల 11న షానవాజ్ బేగం పేరుతో కరెంట్, సేవింగ్ ఖాతాలు తెరిచారు. హుస్సేనిఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్న వినోద్‌కుమార్‌కు ఈ బ్యాంక్‌లో 2020 జూన్ నుంచి కరెంట్ ఖాతా ఉంది. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాలోని రూ.12.4 కోట్లు మళ్లించడానికి వినియోగించుకున్నారు.
షానవాజ్ బేగం ఖాతా తెరిచే సమయంలో గోల్కొండ చిరునామా ఇచ్చినప్పటికీ... ఆమెను ముంబైకి చెందిన మహిళగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమెను నగరానికి పంపడం ద్వారానే శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌తో ఖాతా తెరిపించడంతోపాటు వినోద్‌కుమార్ ద్వారా హిందుస్తాన్ ట్రేడర్స్ ఖాతా వాడుకునేలా ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉండటం అనుమానాలకు ఊతమిస్తోంది. సర్వర్ హ్యాకింగ్‌కు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ ద్వారా యాక్సెస్ చేశారు.
వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అవి అమెరికా సంస్థ ద్వారా జనరేట్ అయినట్లు తేలింది. వాటి మూలాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ను కొల్లగొట్టడంలోనూ ఇదే పంథా అనుసరించారు. ఈ నేపథ్యంలో నైజీరియన్ల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment