సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెనిఫిషియరీ ఖాతాగా జోడించిన నాలుగో ఖాతా నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లే ఈ పని చేశారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. బ్యాంకుకు మాల్‌వేర్ పంపడం ద్వారా సర్వర్‌ను యాక్సెస్ చేశారా? లేక సర్వర్‌లోకి ప్రవేశించిడం ద్వారా లావాదేవీలు జరిపారా? అనే దానిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు.
దీనికోసం గురువారం బంజారాహిల్స్‌లోని సంస్థ సర్వర్ కార్యాలయానికి వెళ్లారు. బ్యాంక్ అధికారులు, సర్వర్ నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పోలీసులకు సహకారం అందిస్తోంది. హ్యాకింగ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడగా, వీటిలో కొన్ని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్‌నెట్ సెంటర్‌వీ ఉన్నాయి. దీంతో దాని నిర్వాహకుడిని విచారించారు. తాను ఫ్రీ వైఫై సేవలు అందిస్తుంటానని, అది 24 గంటలూ ఆన్‌లోనే ఉంటుందని చెప్పాడు. దీంతో నిర్ణీత సమయంలో ఆ వైఫైని ఎవరెవరు వాడుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
షానాజ్ బేగం ఫోన్ స్విచ్ఛాఫ్
బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్ అయిన కరెంట్ అకౌంట్లకు సంబంధించి హిందుస్తాన్ ట్రేడర్స్ నిర్వాహకుడు వినోద్‌కుమార్, ఫార్మాహౌస్‌కు చెందిన సంపత్‌కుమార్‌లను పోలీసులు గురువారమూ విచారించారు. వీళ్ల ఫోన్లను పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ నేరంలో పాత్రపై స్పష్టత లేదని అధికారులు చెప్తున్నారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచిన షానాజ్ బేగం కీలక అనుమానితురాలిగా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడానికి ముందే బ్యాంక్ అధికారులు ఈమెకు ఫోన్ చేశారు.
అప్పటి నుంచి ఆమె తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పుణేలో ఎక్కువ కాలం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమె అక్కడి నుంచి హైదరాబాద్‌కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క రూ.12.93 కోట్లు బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు వారి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు.
దర్యాప్తులో పురోగతి: సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
మహేష్ బ్యాంక్ కేసు దర్యాప్తులో పురోగతి ఉంది. ఇప్పటివరకు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. ఆ ఖాతాలు ఎవరు తెరిచారు? ఎవరు తెరిపించారు? అనే వివరాలు సేకరించాం. హ్యాకింగ్ ఉత్తరాది నుంచి జరిగిందా? విదేశాల నుంచి జరిగిందా? అనేది ఆరా తీస్తున్నాం. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ అందించే సంస్థలు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment