సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి సూత్రధారిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయాలంటూ ఇతగాడు డార్క్ నెట్ ద్వారా నైజీరియన్లకు ఎర వేశాడని, వాళ్లు మరికొందరికీ విషయం చెప్పి తమతో కలుపుకున్నారని తేలింది.
ఈ నేపథ్యంలోనే 128 బ్యాంకు ఖాతాల సమీకరణ జరిగిందని లక్కీ చెప్పాడు. మహేశ్ బ్యాంక్ స్కామ్ మొత్తం తన ద్వారానే జరిగితే ఎక్కువ గిట్టుబాటు అవుతుందని భావించానని, అయితే నైజీరియన్ హ్యాకర్ల ‘దండోరా’ వల్ల వాటాలు పెరిగిపోయాయన్నారు. ఇతడి సమాచారంతో సేవింగ్స్ ఖాతా తెరిచి ఈ నేరానికి సహకరించిన గోల్కొండ వాసి షానాజ్ బేగంను ముంబైలో పట్టుకున్నారు.
లోపం గుర్తించాకే ఖాతాలు..
మహేశ్ బ్యాంకు విషయంపై నైజీరియన్లు డార్క్ నెట్ ద్వారానే లక్కీతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయగలమన్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన మరికొందరు నైజీరియన్లనూ ఎంగేజ్ చేశారు. అంతటితో ఆగకుండా డార్క్ నెట్‌లోని అనేక క్రిమినల్ గ్రూపుల్లో తాము త్వరలో మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయబోతున్నామని, దాని ఖాతాదారులను తీసుకొచ్చే వాళ్లకు ‘లాభం’ ఉంటుందని ప్రకటించారు. దీంతో చాలామంది డార్క్‌నెట్ యూజర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగారు.
కర్నూలుకు చెందిన వారి ద్వారా కేపీహెచ్‌బీలో ఫార్మా హౌస్ సంస్థను నిర్వహిస్తున్న సంపత్ కుమార్‌ను లక్కీ సంప్రదించగా.. మరో గ్యాంగ్ చెన్నైకి చెందిన వారి ద్వారా నాగోల్‌లోని శాన్విక ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు నవీన్‌కు టచ్‌లోకి వచ్చారు. వీరితో ఖాతాలు ఓపెన్ చేయించడంతోపాటు ఎవరికి వారుగా డబ్బు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. ఇలా బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి 4 ఖాతాలకు వచ్చిన డబ్బు 128 ఖాతాలకు బదిలీ అయింది.
బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు..
128 మందిని ఎంపిక చేసుకున్న లక్కీ, ఇతరులు వాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి వారు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రధాన హ్యాకర్లకు సంపత్‌కుమార్, షానాజ్ బేగం ఖాతాల వివరాలను లక్కీ అందించాడు. చెన్నై గ్యాంగ్ నవీన్ ఖాతా వివరాలిచ్చింది. ఇలానే వినోద్‌కుమార్ ఖాతా వివరాలను మరో ముఠా ఇచ్చింది. అలా ఏ ముఠాకు ఆ ముఠా చెస్ట్ ఖాతా నుంచి డబ్బును వీటిలో జమ చేయించుకున్నాడు. ఆపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఖాతాల్లోకి బదిలీ చేశారు. లక్కీ సహా ఇతర ముఠా నాయకులందరూ హ్యాకర్లకు చెల్లించాల్సిన వాటాను బిట్ కాయిన్ల రూపంలో పంపేశారు.
ముగ్గురు నైజీరియన్లతో ఒప్పందం
లక్కీకి అనేక సైబర్ నేరాలతో సంబంధం ఉంది. ఇంటర్‌నెట్‌లో ఉన్న డార్క్‌నెట్ పైనా పట్టుంది. గతంలో అనేకసార్లు వివిధ డేటాలను అందులో కొన్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో డార్క్‌నెట్‌లో ఉండే గ్రూపుల్లో ఓ సవాల్ విసిరాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇలా ఇతడికి ముగ్గురు నైజీరియన్లతో పరిచయమైంది.
సర్వర్‌ను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని, కొట్టేసే మొత్తంలో కమీషన్ ఇస్తే పని చేసి పెడతామని వాళ్లు చెప్పారు. ఆపై ఓ ప్రత్యేక కీలాగర్స్‌ను రూపొందించి అనేక బ్యాంకులకు ఈ–మెయిల్ రూపంలో పంపారు. మహేశ్ బ్యాంక్ కంప్యూటర్లలోకి అది తేలిగ్గా ప్రవేశించడం, వాటిలో నిక్షిప్తం కావడంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపం నైజీరియన్లకు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment