Mahesh Cooperative Urban Bank
-
మహేష్ బ్యాంక్ కేసులో ‘ఖరీదైన దర్యాప్తు’
సాక్షి హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న సైబర్ నేరం రెండు రకాలుగా రికార్డు సృష్టించింది. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.12,48,21,735 కాజేశారు. దీని దర్యాప్తు కోసం నగర పోలీసు విభాగం రూ.58 లక్షలు ఖర్చు చేసింది. ఇంత మొత్తం నగదుతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం, ఓ కేసు దర్యాప్తు కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం కూడా నగర కమిషనరేట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసును సవాల్‌గా తీసుకున్నామని, సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాలకు చెందిన 100 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు నెలల పాటు శ్రమించి, ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఆయన రివార్డులు అందించారు. ఆ మూడు ఖాతాలు సిద్ధం చేసినా... సైబర్ నేరగాళ్లు షానాజ్ బేగంతో పాటు శాన్విక ఎంటర్ప్రైజెస్, హిందుస్తాన్ ట్రేడర్స్, ఫార్మాహౌస్ ఖాతాలతో పాటు కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్ ప్రైజెస్, ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థల ఖాతాలు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆఖరి మూడు ఖాతాల్లోకి నగదు పడలేదు. రెండు సంస్థల నిర్వాహకులను గుర్తించి, కొందరిని పట్టుకున్నారు. జగద్గిరిగుట్ట చిరునామాతో ఉన్న ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థ బోగస్‌గా తేలింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమాదంలో ఉంది ఈ నేరం చేయడానికి ప్రధాన హ్యాకర్లు వినియోగించిన ఐపీ అడ్రస్‌లు అమెరికా, కెనడా, లండన్, రోమేనియాలవిగా కనిపిస్తోంది. అ యితే వాళ్లు ఫ్రాక్సీ సర్వర్లు వాడటంతో ఇవి ఎంత వరకు వాస్తమే ఇప్పుడే చెప్పలేం. ఈ హ్యాకర్లే గతేడాది నగరంలోని తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి రూ.1.98 కోట్లు కాజేసిందీ వీళ్లేనని అనుమానిస్తున్నాం. ఇతర నగరాలు, దేశాల్లోనూ ఇ లాంటి నేరాలు జరిగాయి... భవిష్యత్తులో మ రిన్ని జరిగే ప్రమాదమూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్ర మాదంలో ఉన్నట్లు గుర్తించాలి. బ్యాంకుల సైబర్ సెక్యూరిటీ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సూచలను చేసినా వాటి అమలు పర్యవేక్షణ జరగట్లేదు. త్వరలోనే రిజ ర్వ్ బ్యాంక్ ద్వారా బ్యాంకుల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తాం. – సీవీ ఆనంద్, నగర కొత్వాల్ (చదవండి: విమానంలో చిక్కిన చైన్ స్నాచర్) -
జారుకుందామని జారిపడ్డాడు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసు దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఒక నైజీరియన్ దాడి చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం అదుపులో ఉన్న మరో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌లోని మూడో అంతస్తు బాల్కనీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు. దీంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పోలీసు అధికారులు గత నెల 22, 23 తేదీల్లో చోటు చేసుకున్న మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్‌పై.. అధికారుల ఫిర్యాదు మేరకు 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేయడం మినహా అరెస్టుల విషయంలో కీలక పురోగతి సాధించలేకపోయారు. నగదు బదిలీ అయిన ఖాతాదారులను, సూత్రధారులకు సహకరించిన వారిని మాత్రమే పట్టుకోగలిగారు. సూత్రధారులను పట్టుకోలేకపోవడం, తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు విభాగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. కీలకపాత్ర పోషించిన నైజీరియన్లు.. ఈ కేసులో ఆద్యంతం నైజీరియన్లు కీలకపాత్ర పోషించారు. సూత్రధారులు–పాత్రధారులు–ఖాతాదారుల మధ్య వీరే మధ్యవర్తిత్వం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెంగళూరులో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌లతో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ, ముంబైల్లోనూ కొందరు నైజీరియన్లను అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం ఢిల్లీలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందం మరికొందరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. వీరిలో కొందరిని ఇప్పటికే నగరానికి పంపగా.. ఓ వ్యక్తిని మాత్రం తాము బస చేసిన తెలంగాణ భవన్‌లోని రూమ్ నం. 401లో ఉంచింది. కీలకం కావడంతో తప్పించుకోవాలని... ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కిన ఇతడు అత్యంత కీలక నిందితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతడిని శుక్రవారం ఢిల్లీలోని కోర్టులో హాజరుపరచడంతో పాటు అనుచరులను పట్టుకోవాలని ప్రత్యేక బృందం భావించింది. అయితే శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నిందితుడు అక్కడ నుంచి ఎలాగో బాల్కనీలోకి వెళ్లి వాటర్ పైపుల ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే కింద ఉన్న పోలీసులు గుర్తించి అరవడంతో కంగారుపడ్డ నిందితుడు పట్టుతప్పి అక్కడున్న చెట్టు కొమ్మకు తగులుతూ కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని పోలీసులు..పక్కనే ఏపీ భవన్లో అందుబాటులో ఉన్న 108 వాహనం మొరాయించడంతో ఆటోలో రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు వ్యక్తి నైజీరియన్ కాదని, ఢిల్లీ (ఘజియాబాద్)కే చెందినవాడని చెప్తున్న పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. -
డార్క్ నెట్లో దండోరా వేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి సూత్రధారిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయాలంటూ ఇతగాడు డార్క్ నెట్ ద్వారా నైజీరియన్లకు ఎర వేశాడని, వాళ్లు మరికొందరికీ విషయం చెప్పి తమతో కలుపుకున్నారని తేలింది. ఈ నేపథ్యంలోనే 128 బ్యాంకు ఖాతాల సమీకరణ జరిగిందని లక్కీ చెప్పాడు. మహేశ్ బ్యాంక్ స్కామ్ మొత్తం తన ద్వారానే జరిగితే ఎక్కువ గిట్టుబాటు అవుతుందని భావించానని, అయితే నైజీరియన్ హ్యాకర్ల ‘దండోరా’ వల్ల వాటాలు పెరిగిపోయాయన్నారు. ఇతడి సమాచారంతో సేవింగ్స్ ఖాతా తెరిచి ఈ నేరానికి సహకరించిన గోల్కొండ వాసి షానాజ్ బేగంను ముంబైలో పట్టుకున్నారు. లోపం గుర్తించాకే ఖాతాలు.. మహేశ్ బ్యాంకు విషయంపై నైజీరియన్లు డార్క్ నెట్ ద్వారానే లక్కీతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయగలమన్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన మరికొందరు నైజీరియన్లనూ ఎంగేజ్ చేశారు. అంతటితో ఆగకుండా డార్క్ నెట్‌లోని అనేక క్రిమినల్ గ్రూపుల్లో తాము త్వరలో మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయబోతున్నామని, దాని ఖాతాదారులను తీసుకొచ్చే వాళ్లకు ‘లాభం’ ఉంటుందని ప్రకటించారు. దీంతో చాలామంది డార్క్‌నెట్ యూజర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగారు. కర్నూలుకు చెందిన వారి ద్వారా కేపీహెచ్బీలో ఫార్మా హౌస్ సంస్థను నిర్వహిస్తున్న సంపత్ కుమార్‌ను లక్కీ సంప్రదించగా.. మరో గ్యాంగ్ చెన్నైకి చెందిన వారి ద్వారా నాగోల్‌లోని శాన్విక ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు నవీన్‌కు టచ్‌లోకి వచ్చారు. వీరితో ఖాతాలు ఓపెన్ చేయించడంతోపాటు ఎవరికి వారుగా డబ్బు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. ఇలా బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి 4 ఖాతాలకు వచ్చిన డబ్బు 128 ఖాతాలకు బదిలీ అయింది. బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు.. 128 మందిని ఎంపిక చేసుకున్న లక్కీ, ఇతరులు వాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి వారు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రధాన హ్యాకర్లకు సంపత్‌కుమార్, షానాజ్ బేగం ఖాతాల వివరాలను లక్కీ అందించాడు. చెన్నై గ్యాంగ్ నవీన్ ఖాతా వివరాలిచ్చింది. ఇలానే వినోద్‌కుమార్ ఖాతా వివరాలను మరో ముఠా ఇచ్చింది. అలా ఏ ముఠాకు ఆ ముఠా చెస్ట్ ఖాతా నుంచి డబ్బును వీటిలో జమ చేయించుకున్నాడు. ఆపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఖాతాల్లోకి బదిలీ చేశారు. లక్కీ సహా ఇతర ముఠా నాయకులందరూ హ్యాకర్లకు చెల్లించాల్సిన వాటాను బిట్ కాయిన్ల రూపంలో పంపేశారు. ముగ్గురు నైజీరియన్లతో ఒప్పందం లక్కీకి అనేక సైబర్ నేరాలతో సంబంధం ఉంది. ఇంటర్నెట్లో ఉన్న డార్క్‌నెట్ పైనా పట్టుంది. గతంలో అనేకసార్లు వివిధ డేటాలను అందులో కొన్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో డార్క్‌నెట్‌లో ఉండే గ్రూపుల్లో ఓ సవాల్ విసిరాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇలా ఇతడికి ముగ్గురు నైజీరియన్లతో పరిచయమైంది. సర్వర్‌ను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని, కొట్టేసే మొత్తంలో కమీషన్ ఇస్తే పని చేసి పెడతామని వాళ్లు చెప్పారు. ఆపై ఓ ప్రత్యేక కీలాగర్స్‌ను రూపొందించి అనేక బ్యాంకులకు ఈ–మెయిల్ రూపంలో పంపారు. మహేశ్ బ్యాంక్ కంప్యూటర్లలోకి అది తేలిగ్గా ప్రవేశించడం, వాటిలో నిక్షిప్తం కావడంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపం నైజీరియన్లకు తెలిసింది. -
మహేశ్ బ్యాంకులో రూ.3కోట్ల కుంభకోణం
గోల్డ్లోన్ల పేరిట బ్యాంకు సిబ్బంది చేతివాటం, కేసు నమోదు ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మంలోని మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కుంభకోణం వెలుగుచూసింది. బినామీ ఖాతాలను తెరచి బంగారం రుణం పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిన ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందే కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ కుంభకోణంపై గత 15 రోజులుగా బ్యాంకు సిబ్బంది అంతర్గత విచారణ జరుపుతున్నారు. బంగారం డిపాజిట్ చేయకుండానే 21 మంది పేరిట బినామీ ఖాతాలను తెరచి దాదాపు రూ.3 కోట్ల వరకు సిబ్బంది స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉందని గతంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. బ్యాంకు కొత్త మేనే జర్గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘మహేశ్’ మాయ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. బంగారంలోన్ పేరిట బ్యాంకులో దాదాపు రూ.3 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితమే ఇది వెలుగులోకి రాగా, సంస్థాగత విచారణ నేపథ్యంలో బయటపడలేదు. ఆన్లైన్లో బినామీ అకౌంట్లను తెరచి, రుణం పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ సూత్రధారులని తెలుస్తోంది. వీరిద్దరినీ ఇప్పటికే సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, సాక్షాత్తూ బ్యాంకు ఎండీ ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణంపై కొత్తగా బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చాలా ఏళ్లుగా ఇదే తంతు మహేశ్ బ్యాంకులో డిపాజిట్‌దారుల సొమ్మును గత రెండు, మూడేళ్లుగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వీటి వెనుక పెద్ద స్థాయి వ్యక్తులే ఉండడంతో ఎలాంటి చర్యలూ ఉండడం లేదని, తూతూమంత్రపు విచారణ జరుపుతున్నారని బ్యాంకు వర్గాలే అంటున్నాయి. మరోవైపు తాజా కుంభకోణం విషయానికి వస్తే .... బ్యాంకు నిర్వహణలోని లోపాలను ఆసరాగా చేసుకున్న ఖమ్మం బ్రాంచి సిబ్బంది బంగారం రుణం పేరుతో కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఆన్లైన్లో బినామీ అకౌంట్లను తెరిచి బంగారం డిపాజిట్ చేయకుండానే రుణం తీసుకున్నారు. ఈ విధంగా 21 మంది పేర్లతో దాదాపు రూ.3 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు యాజమాన్యం గత 15 రోజులుగా సంస్థాగత విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేసింది. వీరిద్దరిని విచారించేందుకు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చారు. గత కొన్ని రోజులుగా బ్యాంకు వద్ద హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ గార్డులే కాపలా కాస్తుండడం గమనార్హం. అయితే, సస్పెండ్ చేసిన ఇద్దరిలో ఒకరి వద్ద నుంచి ఆస్తులను బ్యాంకు రాయించుకున్నట్టు సమాచారం. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, మరో ఉద్యోగి కూడా తప్పు చేశాడని విచారణలో తేలినా ఆయన బ్యాంకుకు తిరిగి ఆ మొత్తాన్ని కట్టేందుకు ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కుంభకోణం విషయమై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్టు సీఐ రెహమాన్ తెలిపారు. బ్యాంకు కొత్త మేనేజర్ కనకరాజు ఫిర్యాదు మేరకు జి.అరుణ్‌కుమార్, కె.శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. బినామీల పేరుతో దాదాపు రూ.1.62 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ విలేకరులకు తెలి పారు. అయితే, దాదాపు రూ.3కోట్ల నిధులు దుర్వినియోగం కాగా, కేవలం రూ.1.62 కోట్లకే కేసు నమోదు చేయడం గమనార్హం. గత రెండు, మూడేళ్లుగా జరుగుతున్న ఈ తతంగంలో పెద్ద చేపలే పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్స్థాయిలోని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల చేత సిఫారసు చేయించి ఈ ఇద్దరు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కానీ, పోలీసులు బ్యాంకు లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, బ్యాంకుకు సంబంధించిన పెద్ద తలకాయలే పట్టుబడతాయని బ్యాంకు వర్గాలంటున్నాయి.