‘మహేశ్’ మాయ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. బంగారంలోన్ పేరిట బ్యాంకులో దాదాపు రూ.3 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితమే ఇది వెలుగులోకి రాగా, సంస్థాగత విచారణ నేపథ్యంలో బయటపడలేదు. ఆన్‌లైన్‌లో బినామీ అకౌంట్‌లను తెరచి, రుణం పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ సూత్రధారులని తెలుస్తోంది. వీరిద్దరినీ ఇప్పటికే సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, సాక్షాత్తూ బ్యాంకు ఎండీ ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణంపై కొత్తగా బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
చాలా ఏళ్లుగా ఇదే తంతు
మహేశ్ బ్యాంకులో డిపాజిట్‌దారుల సొమ్మును గత రెండు, మూడేళ్లుగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వీటి వెనుక పెద్ద స్థాయి వ్యక్తులే ఉండడంతో ఎలాంటి చర్యలూ ఉండడం లేదని, తూతూమంత్రపు విచారణ జరుపుతున్నారని బ్యాంకు వర్గాలే అంటున్నాయి. మరోవైపు తాజా కుంభకోణం విషయానికి వస్తే .... బ్యాంకు నిర్వహణలోని లోపాలను ఆసరాగా చేసుకున్న ఖమ్మం బ్రాంచి సిబ్బంది బంగారం రుణం పేరుతో కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఆన్‌లైన్‌లో బినామీ అకౌంట్‌లను తెరిచి బంగారం డిపాజిట్ చేయకుండానే రుణం తీసుకున్నారు.
ఈ విధంగా 21 మంది పేర్లతో దాదాపు రూ.3 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు యాజమాన్యం గత 15 రోజులుగా సంస్థాగత విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేసింది. వీరిద్దరిని విచారించేందుకు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చారు. గత కొన్ని రోజులుగా బ్యాంకు వద్ద హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ గార్డులే కాపలా కాస్తుండడం గమనార్హం. అయితే, సస్పెండ్ చేసిన ఇద్దరిలో ఒకరి వద్ద నుంచి ఆస్తులను బ్యాంకు రాయించుకున్నట్టు సమాచారం. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, మరో ఉద్యోగి కూడా తప్పు చేశాడని విచారణలో తేలినా ఆయన బ్యాంకుకు తిరిగి ఆ మొత్తాన్ని కట్టేందుకు ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ కుంభకోణం విషయమై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్టు సీఐ రెహమాన్ తెలిపారు. బ్యాంకు కొత్త మేనేజర్ కనకరాజు ఫిర్యాదు మేరకు జి.అరుణ్‌కుమార్, కె.శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. బినామీల పేరుతో దాదాపు రూ.1.62 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ విలేకరులకు తెలి పారు. అయితే, దాదాపు రూ.3కోట్ల నిధులు దుర్వినియోగం కాగా, కేవలం రూ.1.62 కోట్లకే కేసు నమోదు చేయడం గమనార్హం.
గత రెండు, మూడేళ్లుగా జరుగుతున్న ఈ తతంగంలో పెద్ద చేపలే పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌స్థాయిలోని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల చేత సిఫారసు చేయించి ఈ ఇద్దరు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కానీ, పోలీసులు బ్యాంకు లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, బ్యాంకుకు సంబంధించిన పెద్ద తలకాయలే పట్టుబడతాయని బ్యాంకు వర్గాలంటున్నాయి.