అదితి గోల్డ్ లోన్ సంస్థ(ఫైల్)
విజయవాడ: అదితి గోల్డ్ లోన్ సంస్థ నిర్వాహకులు తక్కువ వడ్డీకే రుణం అంటూ ప్రచారం గుప్పించారు. ఆపై తమ వద్ద ప్రజలు కుదువ పెట్టిన బంగారంతో పరారయ్యారు. తమ సంస్థలో వ్యాపార భాగస్వామ్యం ఇస్తామంటూ కూడా పలువురిని మోసగించారు. ఈ కంపెనీ నిర్వాహకుల మోసాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ మహర్షి విజయవాడ భవానీపురంలోని స్వాతి సెంటర్‌లోని ఓ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని ఈ ఏడాది జూన్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థను ఏర్పాటు చేశారు. 75 పైసల వడ్డీకే బంగారంపై రుణం ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు.
కొద్ది రోజుల్లోనే వందలాది మంది ఈ సంస్థను ఆశ్రయించారు. వేరే ఇతర ఫైనాన్స్ సంస్థల్లో, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన వారు సైతం ఈ సంస్థకు బంగారాన్ని మార్చారు. వడ్డీ తక్కువ కావడంతో ఎక్కువ మొత్తంలో బంగారం తాకట్టు పెట్టిన వారు అధికంగా ఉన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం భవానీపురానికి చెందిన ఓ గృహిణి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థలో అరకిలో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఆగస్టులో 200 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సెప్టెంబర్ చివరి వారంలో సంస్థ బోర్డ్ తిప్పేయడంతో బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేయడం మినహా బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం పలువురు బాధితులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ సంస్థ ద్వారా మోసం పోయిన బాధితులు వందల్లో ఉంటారని సమాచారం.
వ్యాపార భాగస్వామ్యం పేరుతో..
వ్యాపార భాగస్వామ్యం ఇస్తామని ఇదే సంస్థ నిర్వాహకులు జిల్లాలో పలువురిని మోసం చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వాహకుడి నుంచి రూ.5 లక్షలు, మరో గోల్డ్ టెస్టింగ్ షాపు యజమాని నుంచి రూ.5 లక్షలు తీసుకుని ఉడాయించారు. నకిలీ ఐఎస్‌ఓ, జీఎస్‌టీ, మైక్రో ఫైనాన్స్ సర్టిఫికెట్‌లను చూపించి అదితి గోల్డ్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భవానీపురం సీఐ మురళీకృష్ణను వివరణ కోరగా గోల్డ్ లోన్ సంస్థపై ఫిర్యాదులు అందాయని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
చదవండి: ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది!
Comments
Please login to add a commentAdd a comment