సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రైతుల రుణమాఫీ అమలుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 4,56,286 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని అధికారులు లెక్కతేల్చారు. దీనికి రూ.2,682 కోట్లు అవసరం కానున్నాయి. పంటరుణాలు, బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన వ్యవసాయ రుణాలను కుటుంబానికి రూ.లక్ష కంటే ఎక్కువ కాకుండా పరిమితం చేస్తూ రుణమాఫీని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బ్యాంకర్లు తయారు చేసిన జాబితాపై బుధవారం నుంచి గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.
ఈ తనిఖీలు పూర్తయిన వెంటనే తుది జాబితా తయారుచేసి రుణమాఫీని వర్తింపజేస్తామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని మండల స్థాయి వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరో వారం లోపు జిల్లా రైతాంగానికి రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.
నేడు తనిఖీ
జిల్లాలో రుణమాఫీ ప్రక్రియను ఐదు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన కలెక్టర్ ఈ మేరకు కొన్ని దఫాలను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందో, ఎంత మొత్తం మాఫీ చేయాల్సి వస్తుందనే అంశాలపై బ్యాంకర్ల నుంచి ఆయన జాబితా తెప్పించారు. మొదటి దశలో పంటరుణాలు, రెండో దశలో బంగారం రుణాల వివరాలను తెప్పించిన కలెక్టర్ మూడో దశలో ఈ మొత్తాన్ని కలిపి ఓ జాబితా రూపొందించారు.
ఈ జాబితాపై ఇప్పటికే మండలస్థాయి బ్యాంకర్ల సమావేశాలు పూర్తికాగా, బుధవారం నాలుగోదశలో భాగంగా గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ చేస్తారు. దీనిలో భాగంగా లబ్ధిదారులుగా గుర్తించిన రైతు కుటుంబాలకు వ్యవసాయ రుణాల కింద ఉన్న మొత్తం రుణం ఎంత? ఎన్ని బ్యాంకుల్లో ఉంది? అనే అంశాలను గుర్తిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షకు మించకుండా (ఎన్ని బ్యాంకుల్లో ఉన్నా) రుణమాఫీని వర్తింపజేస్తారు. ఒక బ్యాంకులో లక్ష రుణం తీసుకుని, మరో బ్యాంకులో ఇంకా అదనంగా తీసుకుంటే ఆ రుణానికి మాఫీ వర్తించదని అధికారులు చెపుతున్నారు.
నాలుగోదశలో ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ఐదో దశలో తుది జాబితా తయారుచేసి రుణమాఫీ మొత్తాన్ని నేరుగా బ్యాంకర్లకు చెల్లించనున్నారు. రుణమాఫీ పొందుతున్న రైతుల వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు వారి వివరాలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో సామాజిక తనిఖీ పూర్తవుతుందని, ఆ తర్వాత తుదిజాబితా తయారుచేసి వారం రోజుల్లోపు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలంబరితి మంగళవారం ‘సాక్షి’తో చెప్పారు.
వ్యవసాయ రుణమాఫీ కసరత్తు పూర్తి
Published Wed, Sep 3 2014 5:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement