పంట రుణానికి పట్టణానికా?
అవన్నీ వ్యాపారం కోసం తీసుకున్నవే
ఇలాంటి బంగారం రుణాల మాఫీకి నో
తెలంగాణ సర్కారు మరో మెలిక
పట్టాదారు పాస్ పుస్తకాలతో తీసుకున్న వారికే రుణ మాఫీ
బ్యాంకుల కసరత్తు పూర్తి... నేటి నుంచి సామాజిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పట్టణాలు, నగరాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ పరిధిలోకి తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలను పెట్టి తీసుకున్న రుణాలకు మాత్రం మాఫీని వర్తింపజేయనుంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం కూడా ఇచ్చారు. పట్టణాలు, నగరాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారు వాస్తవంగా వ్యవసాయం కోసం ఆ రుణాలు తీసుకుని ఉండరని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. రైతులు తమ భూమి పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి పంట రుణాలు తీసుకుంటే సరేనని... బంగారం తాకట్టు పెట్టడానికి అంతదూరం రావడంలో అర్థం లేదని అధికారుల వాదన. రైతులు దగ్గర్లోని బ్యాంకుల్లోనే రుణాలు తీసుకుంటారని... కానీ కొందరు ఇతర అవసరాల కోసం వడ్డీ తక్కువగా ఉండే పంట రుణాల పేరిట పట్టణాలు, నగరాల్లో రుణాలు తీసుకుంటారని చెబుతున్నారు. అసలు పట్టణాలు, నగరాల్లోని బ్యాంకుల్లో పంట రుణాల పేరిట తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ నుంచి తప్పించాలని ఉన్నతాధికారుల సమావేశంలో అభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ పరిధిలో ఉంచాలని కొందరు అధికారులు సూచించడంతో... కేవలం బంగారం తాకట్టు పంట రుణాలకు మాత్రం మాఫీ వర్తింపజేయవద్దని తీర్మానించారు. మరోవైపు.... రైతులు రుణాలు చెల్లిస్తే వారికి తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలని... రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. దీంతో రైతు రుణాలు ఎన్‌పీఏలుగా మారకుండా ఉండడానికి వీలుగా బ్యాంకర్లు స్వయంగా రైతులను పిలిపించి.. రుణాలు రెన్యువల్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతోపాటు, వాణిజ్య బ్యాంకులు రైతు రుణాలు రెన్యువల్ చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
6న వీడియో కాన్ఫరెన్స్..
రుణమాఫీ ప్రక్రియపై శనివారం ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. శనివారం నాటికి రుణ మాఫీకి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున... మొదటి దశలో ఏ మేరకు నిధులు సర్దుబాటు చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. ఆ వీడియో కాన్ఫరెన్స్‌కు ముందు నాగిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం కానుంది. బ్యాంకులు ఇదివరకే తమ కసరత్తు పూర్తి చేశాయని, గురువారం నుంచి సామాజిక తనిఖీ కార్యక్రమాలు మొదలవుతాయని అధికారవర్గాలు తెలిపాయి.