ఖమ్మం వ్యవసాయం: రుణమాఫీ ప్రక్రియ సక్రమంగా కొనసాగకపోవడంతో జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. ఆగస్టు 13వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల అధికారులు, ప్రభుత్వశాఖలు లక్ష లోపు (అసలు+వడ్డీ) పంట రుణాలు పొందిన రైతుల జాబితాలను తయారు చేశాయి. రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వివరాలను దశల వారీగా పరిశీలించి రుణమాఫీ అర్హుల జాబితాలను రూపొందించారు.
ఈ జాబితా ప్రకారం జిల్లాలో 3,80,009 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ప్రకటించారు. వీరు జిల్లాలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.1711.39 కోట్లు పంట రుణాలు తీసుకున్నారని తేల్చారు. ఆ రుణాలను మాఫీ చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ఆధారంగా ప్రభుత్వం పంట రుణాల మొత్తంలో నాల్గో వంతు రూ.427.85 కోట్లను మాఫీ చేస్తూ సెప్టెంబర్ 27వ తేదీన జిల్లాకు మంజూరు చేసింది. మరోసారి అర్హుల జాబితాలను పరిశీలించి ఆయా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకుల అధికారుల బృందం రుణమాఫీ అర్హుల జాబితా ఆధారంగా సంబంధిత రైతుల రికార్డులను పరిశీలించారు. రెవెన్యూశాఖ ఇచ్చిన పహణీల ఆధారంగా బ్యాంకులు పంట రుణాలు ఇచ్చాయి. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు మరోమారు రికార్డులను పరిశీలించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాలు ఇచ్చారని, పహణీల్లో సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని 1,15,894 మంది రైతులకు చెందిన రూ.93.23 కోట్ల రుణాలను పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వ శాఖల తప్పిదంతోనే...
రుణాలు ఇచ్చేటప్పుడు రెవెన్యూశాఖ పట్టాదార్‌పాస్ పుస్తకం, పహణీ నకళ్లు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. వాటి ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణమాఫీ సమయంలో ఆ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక తప్పులు బయటపడ్డాయి. సర్వేనంబర్లు తప్పుగా ఉండటం, పహణీల్లోని సర్వేనంబర్లతో రెవెన్యూ రికార్డుల్లోని నంబర్లు సరిపోలకపోవడం..తదితర సమస్యలతో పలువురు రైతుల రుణమాఫీని పెండింగ్‌లో పెట్టారు.
ఈ వ్యవహారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా చోటుచేసుకుంది. బయ్యారం మండలంలోని బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 2,800 మందికి పైగా పంట రుణాలు ఇచ్చారు. వారిలో కేవలం 583 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. దాదాపు 2,300 మందికి పైగా రైతుల రుణాలను పెండింగ్‌లో పెట్టి, పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వచ్చింది. రికార్డులను సక్రమంగా పరిశీలించి అర్హులైన రైతులందరి రుణాలను మాఫీ చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ విధంగా జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, భద్రాచలం, చండ్రుగొండ, గార్ల, గుండాల, జూలూరుపాడు, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, సింగరేణి, ముల్కలపల్లి తదితర మండలాల్లో రైతుల రుణమాఫీలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నా స్థానిక అధికారుల్లో మాత్రం పెద్దగా చలనం లేదు. కొందరు రైతులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి నాడు రుణాలు మంజూరు చేసిన అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. ఇవన్నీ ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారాయి.
సరి‘హద్దు’ రైతులకు కొత్త చిక్కులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. జిల్లాలో నివాసముంటూ భూములు సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు, ఏపీలో ఉంటూ జిల్లాలో భూములు కలిగివున్న వారి రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఇలా సత్తుపల్లి, పెనుబల్లి, అశ్వారావుపేట, కల్లూరు, ఎర్రుపాలెం, మధిర, ముదిగొండ, బొనకల్లు తదితర మండలాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వేలాది మంది అర్హులైన రైతులు దాదాపు రూ.15 కోట్ల రుణామాఫీ పొందదగిన వారు ఈ పథకానికి వర్తించకుండా పోతున్నారని అధికారులే చెబుతున్నారు. దీనిపై సంబంధిత రైతులు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట్రంలోని సంబంధిత జిల్లాల అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
తొలి పరిశీలనలో మాఫీ టోపీ
Published Thu, Nov 20 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement