సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. సమాచార హక్కు చట్టం సైతం తమకు వర్తించదని చెబుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వ్యవస్థ అంతా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతిలో కేంద్రీకృతమై ఉంది. ఆలయ ఈఓకు సీసీగా ఉంటున్న సదరు వ్యక్తి కమిషనరేట్ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినా దేవాదాయ శాఖ మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
దేవస్థానంలో పనిచేస్తూ రెండుసార్లు సస్పెండైన ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈవోగా ఆజాద్ ఉన్న సమయంలో హుండీ డబ్బులు చోరీ చేసిన వ్యవహారంలో సదరు ఉద్యోగిని తొలగించారు. అయితే అతను కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడు. తరువాత రమేష్‌బాబు ఈవోగా ఉన్న సమయంలో మరోసారి హుండీ డబ్బులు చోరీ చేస్తుండగా స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి తనకు రావాల్సిన బెనిఫిట్స్, సస్పెన్షన్ సమయంలో రావాల్సిన సగం జీతం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సుమారు రూ.5 లక్షల వరకు అతనికి వచ్చే బెనిఫిట్స్‌ను దండుకుని, ఉద్యోగంలోకి తీసుకున్నట్లు సమాచారం. అతను దేవస్థానం పనుల బదులు అధికారుల ఇళ్లల్లో పనులు చేస్తున్నాడని ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. సదరు ఉద్యోగిని తిరిగి చేర్చుకోవద్దని దేవస్థానం ఉద్యోగుల యూనియన్ లేఖ సైతం ఇచ్చింది.
ఓ ఉద్యోగి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద అతని భార్యకు ఉద్యోగం ఇచ్చారు. కొన్నేళ్ల పాటు విధులు నిర్వహించిన ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నాలుగేళ్లపాటు విధులకు హాజరు కాలేదు. వస్త్రాల విభాగంలో ఆమె పనిచేసిన సమయంలో రూ.4లక్షల మేర లెక్క తేడా రావడంతో.. ఆమెతోనే డబ్బులు కట్టించారు. మరోసారి లడ్డూల కౌంటర్‌లో పనిచేసినప్పుడు రూ.1.5 లక్షల మొత్తం తేడా రావడంతో మళ్లీ డబ్బులు కట్టించారు. ఆ తర్వాత ఆమె విధులకు రాలేదు. అనంతరం ఆమె ఉద్యోగంలో చేరేందుకు రావడంతో మొదట చేర్చుకోలేదు. కాగా ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్, భర్త పింఛన్ కింద వచ్చే డబ్బులను ఈవో సీసీ దండుకుని ఉద్యోగంలో చేర్చుకున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఆమెను గత శ్రీరామనవమికి ముందు 20 రోజుల పాటు శాశ్వత పూజల విభాగంలో పనులు చేయించారు. విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం సదరు ఉద్యోగినిని పక్కన పెట్టి ఫైల్ పెండింగ్‌లో ఉంచారు.
గత శ్రీరామనవమి సమయంలో అధికారుల ఆదేశాల మేరకు స్టోర్ ఇన్‌చార్జ్ భారీగా లడ్డూలు చేయించాడు. కోవిడ్ నేపథ్యంలో లడ్డూలు మిగిలిపోయి నష్టం వచ్చింది. దీంతో ఈ నష్టం బాపతు రూ.1.5 లక్షలను స్టోర్ ఇన్‌చార్జ్‌తో కట్టించారు. అయితే అధికారుల ఆదేశాలు లేకుండా స్టోర్ ఇన్‌చార్జ్ ఒక్కడే లడ్డూలు ఎలా చేయిస్తాడనే విషయమై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ఏపీకి చెందిన ఓ పోలీసు అధికారికి లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి దర్శనం చేయించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే విషయం తెలుస్తుందని పలువురు చెబుతున్నారు. ఇక శానిటరీ వర్కర్ల పేరిట నకిలీ పేర్లతో జీతాలు డ్రా చేసినట్లు సైతం పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా రామాలయంలో అధికారులు, సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై దేవస్థానం ఈవో శివాజీని వివరణ కోరగా... తొలగించిన ఉద్యోగులు మళ్లీ చేరడానికి వస్తే ఆపేశానని తెలిపారు. దేవస్థానానికి ఆర్టీఐ వర్తించే విషయమై అంతగా అవగాహన లేదని, ఏపీ పోలీస్ అధికారిని హనుమంతుడి ఆలయం వరకు మాత్రమే పంపామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment