Mahesh Co - operative Urban Bank
-
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెనిఫిషియరీ ఖాతాగా జోడించిన నాలుగో ఖాతా నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లే ఈ పని చేశారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. బ్యాంకుకు మాల్వేర్ పంపడం ద్వారా సర్వర్‌ను యాక్సెస్ చేశారా? లేక సర్వర్లోకి ప్రవేశించిడం ద్వారా లావాదేవీలు జరిపారా? అనే దానిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికోసం గురువారం బంజారాహిల్స్‌లోని సంస్థ సర్వర్ కార్యాలయానికి వెళ్లారు. బ్యాంక్ అధికారులు, సర్వర్ నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పోలీసులకు సహకారం అందిస్తోంది. హ్యాకింగ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడగా, వీటిలో కొన్ని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్వీ ఉన్నాయి. దీంతో దాని నిర్వాహకుడిని విచారించారు. తాను ఫ్రీ వైఫై సేవలు అందిస్తుంటానని, అది 24 గంటలూ ఆన్‌లోనే ఉంటుందని చెప్పాడు. దీంతో నిర్ణీత సమయంలో ఆ వైఫైని ఎవరెవరు వాడుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. షానాజ్ బేగం ఫోన్ స్విచ్ఛాఫ్ బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్ అయిన కరెంట్ అకౌంట్లకు సంబంధించి హిందుస్తాన్ ట్రేడర్స్ నిర్వాహకుడు వినోద్‌కుమార్, ఫార్మాహౌస్‌కు చెందిన సంపత్‌కుమార్‌లను పోలీసులు గురువారమూ విచారించారు. వీళ్ల ఫోన్లను పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ నేరంలో పాత్రపై స్పష్టత లేదని అధికారులు చెప్తున్నారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో ఈ నెల 11న సేవింగ్ ఖాతా తెరిచిన షానాజ్ బేగం కీలక అనుమానితురాలిగా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడానికి ముందే బ్యాంక్ అధికారులు ఈమెకు ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఆమె తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పుణేలో ఎక్కువ కాలం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమె అక్కడి నుంచి హైదరాబాద్‌కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క రూ.12.93 కోట్లు బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు వారి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు. దర్యాప్తులో పురోగతి: సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ మహేష్ బ్యాంక్ కేసు దర్యాప్తులో పురోగతి ఉంది. ఇప్పటివరకు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. ఆ ఖాతాలు ఎవరు తెరిచారు? ఎవరు తెరిపించారు? అనే వివరాలు సేకరించాం. హ్యాకింగ్ ఉత్తరాది నుంచి జరిగిందా? విదేశాల నుంచి జరిగిందా? అనేది ఆరా తీస్తున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందించే సంస్థలు పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. -
సీసీ కెమెరాలో ముసుగు దొంగ
=పోలీసులకు లభించిన ఒకే ఒక్క క్లూ =కొలిక్కి వస్తున్న బ్యాంకు దోపిడీ కేసు =రంగంలోకి సీఐడీ అధికారులు.. సీసీ కెమెరా ఫుటేజీ స్వాధీనం = పోయింది 15 కేజీల బంగారం.. 300 మంది వినియోగదారులది సాక్షి, సిటీబ్యూరో: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దోపిడీ కేసు కొలిక్కి వస్తోంది. కేసు మిస్టరీని ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం ఉదయం సీఐడీ అదనపు ఎస్పీ పాపయ్య, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి బ్యాంకు అధికారులను మరోమారు ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరా బంధించిన అగంతకుడి పుటేజీని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో బ్యాంకు షెట్టర్ లేపి, ముఖానికి ముసుగు వేసుకున్న అగంతకుడు బ్యాగ్ పట్టుకుని లోనికి ప్రవేశించిన దృశ్యం నమోదైంది. అతడు లోనికి వచ్చిన వేంటనే సీసీ కెమెరాల ఫ్లగ్ ఊడదీసి అవి పనిచేయకుండా చేశాడు. దీంతో కెమెరా అగంతకుడి కదలికలను కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే నమోదు చేసింది. అయితే, వాచ్మెన్ ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. బ్యాంకు సిబ్బంది హస్తం లేకుండా ఈ చోరీ జరిగేందుకు ఆస్కారం లేనందున ముసుగు వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉంది. వాచ్మెన్ రాములు ముఖానికి ముసుగు వేసి చేతిలో బ్యాగ్ పెట్టి పోలీసులు సీసీ కెమెరాలో చిత్రించారు. దోపిడీ జరిగిన రోజున అగంతకుడి దృశ్యాలు, పోలీసులు తీసిన దృశ్యాలతో పోల్చి చూస్తున్నారు. మరోపక్క కుషాయిగూడ పరిధిలో మారు తాళం చెవులు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు. చోరీకి పాల్పడింది కొత్తవారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో కుదువబెట్టిన సుమారు 300 మంది వినియోగదారులకు చెందిన 15 కిలోల బంగారం చోరీకి గురైందని బ్యాంకు అధికారులు నిర్ధారించారు. డీవీఆర్ సహాయంతో పుటేజీలోని అగంతకుడిని మరింత స్పష్టంగా గుర్తించేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన వద్దు: జనరల్ మేనేజర్ శర్మ ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి వ్యక్తిగత లాకర్లు, బ్యాంకుకు చెందిన నగదు సురక్షితంగానే ఉందని మహే ష్ బ్యాంకు జనరల్ మేనేజర్ వి.ఎస్.శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు అధికారులపై కేసు బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వల్లే తాను కుదవ పెట్టిన బంగారం చోరీకి గురైందని అరోపిస్తూ సైనిక్‌పురికి చెందిన వ్యాపారి ఎస్.వెంకట నాగమహేశ్ శనివారం రాత్రి కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మహేశ్ బ్యాంకు అధికారులపై 420, 406 కింద కేసులు నమోదు చేశారు.