సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు రూ.12.93 కోట్లను తొలుత నాలుగు ఖాతాల్లోకి మళ్లించారు. వీటిలో ఒకటి సేవింగ్ అకౌంట్ కాగా... మిగిలినవి కరెంట్ ఖాతాలు. బ్యాంక్ నుంచి సొమ్ము తమ కరెంట్ ఖాతాల్లో పడటంతో ఇద్దరు వ్యాపారులు కొంత మొత్తాన్ని దారి మళ్లించి అప్పులు తీర్చుకున్నారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ కోణం తాజాగా బయటపడింది. దీనివల్ల దర్యాప్తు కూడా కొంత ఆలస్యమైనట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న వాటిలో నాగోల్‌లోని శాన్విక ఎంటర్‌ప్రైజెస్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఫార్మా హౌస్ ఖాతాలు కూడా ఉన్నాయి.
గత నెల 22 తెల్లవారుజాము నుంచి 23 సాయంత్రం వరకు బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్న కేటుగాళ్లు చెస్ట్ ఖాతా నుంచి వీటితోపాటు మరో రెండు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ నాలుగు ఖాతాల్లో పడిన మొత్తాలను దేశవ్యాప్తంగా 129 ఖాతాల్లోకి మళ్లించారు. ఈలోపు శాన్విక, ఫార్మాహౌస్‌ల నిర్వాహకులకు తమ ఖాతాల్లో భారీ మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు సందేశాలు వచ్చాయి. తొలుత ఆ డబ్బుపై టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ అవసరాలకు వాడుకున్నారు. నవీన్ (శాన్విక ఎంటర్‌ప్రైజెస్) రూ.10 లక్షలు, సంపత్‌కుమార్ (ఫార్మాహౌస్) రూ.5 లక్షలు తమ వారి ఖాతాల్లోకి మళ్లించారు.
స్నేహితుడిని గాంధీనగర్‌కు పంపి...
ఈ సందేశాలు వస్తున్న సమయంలో నవీన్ తన స్వస్థలమైన ఓ గ్రామంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ సాధ్యం కాకపోవడంతో తన స్నేహితుడికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చెప్పి తన ఖాతాలోని నగదును వేరే ఖాతాల్లోకి మళ్లించమని చెప్పాడు. దీంతో అతడు గాంధీనగర్‌లోని ఓ నెట్ సెంటర్‌కు వెళ్లి కంప్యూటర్ ద్వారా ఆపని చేశాడు.
ఈ కారణంగానే దర్యాప్తు అధికారులకు గాంధీనగర్‌లోని ఇంటర్‌నెట్ సెంటర్ ఐపీలు వచ్చాయి. వీటి ఆధారంగా ఆ సమయంలో కంప్యూటర్ వాడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతడు విషయం మొత్తం బయటపెట్టాడు. నవీన్‌ను అదుపులోకి తీసుకోగా తన స్నేహితుడు చెప్పింది నిజమేనని అంగీ కరించాడు. సంపత్‌కుమార్ నేరుగా తన భార్య ఖాతాలోకే ఆ మొత్తం మళ్లించాడు.
అప్పులు తీర్చుకున్నామంటూ...
అనుకోకుండా తమ ఖాతాల్లోకి వచ్చిపడుతున్న భారీ మొత్తాలను సొంతానికి వాడుకున్నట్లు వ్యాపా రులు నవీన్, సంపత్‌లు విచారణలో అంగీకరిం చారు. కాస్త సమయం ఇస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో నవీన్‌పై ఎలాం టి సందేహాలు లేవని, అయితే సంపత్ మాత్రం తనకు వచ్చిన సందేశాలను డిలీట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా నగదు మళ్లించాడా? అనేది ఆరా తీస్తున్నామని ఓ అధికారి సాక్షికి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment