Mahesh bank
-
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసులో కీలక పురోగతి
-
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మహేష్ బ్యాంక్ కేసులో కీలక నిందితుడు
-
కేటుగాళ్లకే టోకరా!
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు రూ.12.93 కోట్లను తొలుత నాలుగు ఖాతాల్లోకి మళ్లించారు. వీటిలో ఒకటి సేవింగ్ అకౌంట్ కాగా... మిగిలినవి కరెంట్ ఖాతాలు. బ్యాంక్ నుంచి సొమ్ము తమ కరెంట్ ఖాతాల్లో పడటంతో ఇద్దరు వ్యాపారులు కొంత మొత్తాన్ని దారి మళ్లించి అప్పులు తీర్చుకున్నారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ కోణం తాజాగా బయటపడింది. దీనివల్ల దర్యాప్తు కూడా కొంత ఆలస్యమైనట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న వాటిలో నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఫార్మా హౌస్ ఖాతాలు కూడా ఉన్నాయి. గత నెల 22 తెల్లవారుజాము నుంచి 23 సాయంత్రం వరకు బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్న కేటుగాళ్లు చెస్ట్ ఖాతా నుంచి వీటితోపాటు మరో రెండు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ నాలుగు ఖాతాల్లో పడిన మొత్తాలను దేశవ్యాప్తంగా 129 ఖాతాల్లోకి మళ్లించారు. ఈలోపు శాన్విక, ఫార్మాహౌస్ల నిర్వాహకులకు తమ ఖాతాల్లో భారీ మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు సందేశాలు వచ్చాయి. తొలుత ఆ డబ్బుపై టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ అవసరాలకు వాడుకున్నారు. నవీన్ (శాన్విక ఎంటర్ప్రైజెస్) రూ.10 లక్షలు, సంపత్‌కుమార్ (ఫార్మాహౌస్) రూ.5 లక్షలు తమ వారి ఖాతాల్లోకి మళ్లించారు. స్నేహితుడిని గాంధీనగర్‌కు పంపి... ఈ సందేశాలు వస్తున్న సమయంలో నవీన్ తన స్వస్థలమైన ఓ గ్రామంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ సాధ్యం కాకపోవడంతో తన స్నేహితుడికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్పి తన ఖాతాలోని నగదును వేరే ఖాతాల్లోకి మళ్లించమని చెప్పాడు. దీంతో అతడు గాంధీనగర్‌లోని ఓ నెట్ సెంటర్‌కు వెళ్లి కంప్యూటర్ ద్వారా ఆపని చేశాడు. ఈ కారణంగానే దర్యాప్తు అధికారులకు గాంధీనగర్‌లోని ఇంటర్నెట్ సెంటర్ ఐపీలు వచ్చాయి. వీటి ఆధారంగా ఆ సమయంలో కంప్యూటర్ వాడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతడు విషయం మొత్తం బయటపెట్టాడు. నవీన్‌ను అదుపులోకి తీసుకోగా తన స్నేహితుడు చెప్పింది నిజమేనని అంగీ కరించాడు. సంపత్‌కుమార్ నేరుగా తన భార్య ఖాతాలోకే ఆ మొత్తం మళ్లించాడు. అప్పులు తీర్చుకున్నామంటూ... అనుకోకుండా తమ ఖాతాల్లోకి వచ్చిపడుతున్న భారీ మొత్తాలను సొంతానికి వాడుకున్నట్లు వ్యాపా రులు నవీన్, సంపత్‌లు విచారణలో అంగీకరిం చారు. కాస్త సమయం ఇస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో నవీన్‌పై ఎలాం టి సందేహాలు లేవని, అయితే సంపత్ మాత్రం తనకు వచ్చిన సందేశాలను డిలీట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా నగదు మళ్లించాడా? అనేది ఆరా తీస్తున్నామని ఓ అధికారి సాక్షికి చెప్పారు. -
ముగ్గురు ఖాతాదారులు పరార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టాలనే కుట్రకు గతేడాదే బీజం పడినట్లు తేలింది. దీనికోసం ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిపించిన సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉన్న మరో ఖాతాను వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఖాతాదారులు పరారీలో ఉండటంతో వీరి సహకారంతోనే సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వేర్వేరు సమయాల్లో తెరిచిన ఖాతాలు మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టడానికి పథకం వేసిన సైబర్ నేరగాళ్లు రెండు నెలల క్రితమే రంగంలోకి దిగారు. అత్తాపూర్, సిద్ధిఅంబర్ బజార్లో ఉన్న బ్రాంచ్‌ల్లో రెండు ఖాతాలు తెరిపించారు. గత నెల 23న నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్ పేరుతో, ఈ నెల 11న షానవాజ్ బేగం పేరుతో కరెంట్, సేవింగ్ ఖాతాలు తెరిచారు. హుస్సేనిఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్న వినోద్‌కుమార్‌కు ఈ బ్యాంక్‌లో 2020 జూన్ నుంచి కరెంట్ ఖాతా ఉంది. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాలోని రూ.12.4 కోట్లు మళ్లించడానికి వినియోగించుకున్నారు. షానవాజ్ బేగం ఖాతా తెరిచే సమయంలో గోల్కొండ చిరునామా ఇచ్చినప్పటికీ... ఆమెను ముంబైకి చెందిన మహిళగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమెను నగరానికి పంపడం ద్వారానే శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌తో ఖాతా తెరిపించడంతోపాటు వినోద్‌కుమార్ ద్వారా హిందుస్తాన్ ట్రేడర్స్ ఖాతా వాడుకునేలా ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉండటం అనుమానాలకు ఊతమిస్తోంది. సర్వర్ హ్యాకింగ్‌కు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ ద్వారా యాక్సెస్ చేశారు. వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అవి అమెరికా సంస్థ ద్వారా జనరేట్ అయినట్లు తేలింది. వాటి మూలాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ను కొల్లగొట్టడంలోనూ ఇదే పంథా అనుసరించారు. ఈ నేపథ్యంలో నైజీరియన్ల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. -
మహేశ్ బ్యాంకుకు ఆర్బీఐ జరిమానా
ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సహకార బ్యాంకులకు జరిమానా విధించినట్టు ఆర్బీఐ మంగళవారం ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది. డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ విషయంలో నిబంధనలు పాటించని కారణంగా ఈ బ్యాంకునకు రూ.1.12 కోట్ల జరిమానా పడింది. అహ్మదాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌తోపాటు ముంబైకి చెందిన ఎస్వీసీ కో–ఆపరేటివ్ బ్యాంక్, సారస్వత్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌నకు సైతం రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. చదవండి: Airtel: స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్ -
ఆర్బీఐ నిబంధనలు పాటించని మహేశ్ బ్యాంకు!
అబిడ్స్: ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా మహేశ్ బ్యాంకు యాజమాన్యం సామాన్య జనాలను ఇబ్బంది పెడుతోందని పలువురు ఆరోపించారు. ఆదివారం బేగంబజార్‌తోపాటు పలు చోట్ల ఉన్న మహేశ్‌బ్యాంకు శాఖలకు నగదు మార్పిడి కోసం వచ్చిన జనాలను సిబ్బంది పట్టించుకోలేదు. కేవలం ఖాతాదారులకు మాత్రమే తాము నగదు మార్పిడి చేస్తామని చెప్పకొచ్చారు. దీంతో గంటలతరబడి క్యూలో నిల్చున్న వారు ఇబ్బందిపడ్డారు. ఈ విషయమై బేగంబజార్ మహేష్ బ్యాంక్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడ్డ పాతబస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహేష్ బ్యాంక్‌పై ఆర్బీఐలో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మహేష్బ్యాంక్లో ఉన్న సీసీ ఫుటేజీలను చూస్తే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపుతున్న దృశ్యాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. -
హ్యాపీ కస్టమర్స్..
=మహేష్ బ్యాంకుకు చేరిన దోపిడీ బంగారం =ఆనందం వ్యక్తం చేసిన కస్టమర్లు =తాకట్టు బంగారం తీసుకెళ్లిన వైనం సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సంచలనం సృష్టించిన దోపిడీకి గురైన 14.5 కిలోల బంగారు ఆభరణాలు నెలరోజుల తర్వాత ఎట్టకేలకు మహేష్ బ్యాంకుకు చేరింది. దీంతో బ్యాంకు వినియోగదారులు (కస్టమర్లు) ఉబ్బితబ్బిబ్బయ్యారు. గతనెల 28న రాత్రి ఏఎస్‌రావునగర్‌లోని మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్‌గా విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్లోజు బ్రహ్మచారి (50) మారుతాళం చెవులతో తాకట్టు పెట్టిన బంగారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును నాలుగురోజుల్లోనే సైబరాబాద్ పోలీసులు మిస్టరీ చేధించి బ్రహ్మచారితోపాటు అతని భార్య లలిత, కుమారుడులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను కుషాయిగూడ పోలీసు ఠాణాలో భద్రపరిచారు. న్యాయపరమైన అంశాలు పూర్తిచేసుకోవడంతో సోమవారం కోర్టు అనుమతితో పోలీసుల ఆధీనంలో ఉన్న ఆభరణాలను బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు చాలామంది బ్యాంకు వచ్చి తాకట్టు పెట్టిన నగలను విడిపించుకెళ్లారు. ఈ సందర్భంగా కస్టమర్లు పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే ఈ కేసులోని నిందితులు కూడా బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. బంగారు నగలు భద్రపర్చడంలో నిర్లక్ష్యం వహించిన అటెండర్ రాములు, సీనియర్ అకౌంటెంట్ శివశంకర్లను ఇదివరకే అరెస్టు చేయగా..బ్యాంకు ఎండీ, జనరల్ మేనేజర్, మేనేజర్ పద్మజ, ఉద్యోగులు ఊర్మిల, ప్రశాంతిల నిర్లక్ష్యంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వీరి నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా తేలితే అరెస్టు చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. -
మహేష్ బ్యాంక్ దోపిడీతో అప్రమత్తం
=తాకట్టులోని బంగారం పరీక్ష =మరో బ్రహ్మచారి లేకుండా బ్యాంకుల జాగ్రత్త =ఇందుకు బయట అప్రయిజర్ వినియోగం =భద్రతా చర్యలపై కూడా దృష్టి సాక్షి, సిటీబ్యూరో: మహేష్ బ్యాంక్ దోపిడీలో పట్టుబడ్డ ఇంటి దొంగ, గోల్డ్ అప్రయిజర్ బ్రహ్మచారి మోసం వెలుగు చూడడంతో నగరంలోని ఇతర బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. దోపిడీ చేయడమేకాకుండా నకిలీ బంగారాన్ని ఒరిజినల్దిగా చూపించి తాను పనిచేస్తున్న బ్యాంకునే బ్రహ్మచారి మోసం చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ బ్యాంకులో కూడా ఇలాంటి మోసం జరిగిందా అనే అనుమానంతో ఇతర బ్యాంకుల అధికారులు అప్రమత్తమయ్యాయి. తమ బ్యాంకులో తాకట్టులో ఉన్న వినియోగదారుల బంగారు ఆభరణాల్లో నకిలీవి ఉన్నాయా ? అనేది నిర్థారించుకునే పనిలో పడ్డారు. తమ ఉద్యోగితో కాకుండా బయటి నుంచి గోల్డ్ అప్రయిజర్లను పిలిపించి వద్ద ఉన్న నగలను తనిఖీ చేయిస్తున్నారు. బ్రహ్మచారి కుమారుడు వేదవిరాట్ (21) కూడా మహేష్ బ్యాంకు దోపిడీ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఇతగాడు యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా తన తండ్రి మాదిరిగానే ఈ బ్యాంక్‌లో కూడా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించాడా? అనే కోణంలో ఆ బ్యాంకు అధికారులు తమ స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న తాకట్టు బంగారాన్ని మరొకరితో పరీక్ష చేయిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కూడా మహేష్‌బ్యాంకు తరహాలో దోపిడీకి పథకం పన్నారా అనే కోణంలో గత నెలరోజులుగా సీసీ కెమెరాల్లో నమోదైన ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బ్రహ్మచారి చేసిన మోసంతో ఇతర బ్యాంకుల్లో పనిచేస్తున్న గోల్డ్ అప్రయిజర్లపై ఆయా బ్యాంకుల అధికారులు దృష్టిపెట్టారు. తాకట్టు కోసం వచ్చే నగలను జాగ్రత్తగా పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడితే బ్రహ్మచారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూం తాళం చెవులను నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగుల వద్ద పెడుతున్నా..వారు వాటిని ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. భద్రత చర్యలు లేకపోవడం వల్లనే మహేష్ బ్యాంకు దోపిడీకి గురైందని ఇతర బ్యాంకు అధికారులు కూడా పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట సెక్యూరిటీ గార్డులను నియమించడంతో పాటు రాత్రి సమయంలో నమోదయ్యే వీడియో ఫూటేజ్ స్పష్టంగా వచ్చే కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏటీఎంలోని అలారం పనిచేస్తుందా లేదా అనేది కూడా ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని బ్యాంకుల వద్ద జనవరి 15లోగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ గడువులోపు బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోకుంటే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఇంటిదొంగ పనే.. మహేష్ బ్యాంకులో చోరీ చేసింది
అందులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసే బ్రహ్మచారి సాక్షి, హైదరాబాద్: అతనో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్.. తాకట్టుకు వచ్చిన బంగారాన్ని చోరీ చేయాలని ప్లాన్ వేశాడు.. స్ట్రాంగ్‌రూమ్ సహా బ్యాంకులో తాళాలన్నింటికీ డూప్లికేట్లు సంపాదించాడు.. ఓ రోజు రాత్రి ముసుగు వేసుకుని బ్యాంకులో చొరబడ్డాడు.. దర్జాగా తాళాలు తీసి, ఏకంగా రూ. నాలుగున్నర కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని తస్కరించాడు.. జాగిలాలు తన వాసన పట్టకుండా కారప్పొడి చల్లాడు.. ఎత్తుకుపోయిన బంగారాన్ని భార్య, కుమారుడికి ఇచ్చి పంపేసి, మరుసటిరోజు ఏమీ తెలియనట్లు విధులకూ వచ్చాడు.. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. అంతకంటే ముందే కొందరు బ్యాంకు వినియోగదారులతో కుమ్మక్కై నకిలీ బంగారాన్ని అసలుదిగా ధ్రువీకరించి.. 20 లక్షల మేరకు రుణాలు ఇప్పించాడు. వారి దగ్గరి నుంచి మూడు లక్షల వరకూ వసూలు చేశాడు.. ఇదంతా మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ (తాకట్టుకు వచ్చిన బంగారం నాణ్యతను నిర్ధారించే వ్యక్తి)గా పనిచేస్తూ.. గత నెల 28న చోరీకి పాల్పడ్డ మాచర్లోజు బ్రహ్మచారి వ్యవహారం. సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంకులో చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించి, ఆయనతో పాటు భార్య, కుమారుడిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్లోజు బ్రహ్మచారి (50) అక్కడ బంగారు నగలు తయారు చేసేవాడు. కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లోని నాగోల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడా అదే పని చేస్తూ.. ఎస్ఆర్ నగర్‌లోని మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా చేరాడు. ఆయన భార్య లలిత, కుమారుడు వేదవిరాట్. వేద విరాట్ కూడా యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, మహేష్ బ్యాంకులో వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మచారి మూడు నెలల క్రితమే పథకం పన్నాడు. చోరీ కోసం బ్యాంకు తాళాలను సంపాదించే పనిలో పడ్డాడు. అటెండర్‌కు తెలియకుండా అతని వద్ద ఏడు తాళం చెవులను తీసుకుని, మారు తాళం చెవులను తయారు చేయించాడు. తర్వాత అకౌంటెంట్లు శివశంకర్, ఊర్మిళ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూం తాళం చెవులను మైనం ముద్దపై అచ్చు తీసుకుని.. తానే స్వయంగా నకిలీ తాళం చెవులను తయారు చేశాడు. వీటన్నింటితో గత నెల 28న రాత్రి 9.54 గంటలకు చోరీకి పాల్పడ్డాడు. అయితే, స్ట్రాంగ్ రూంలోని గ్రిల్డోర్కు వేసిన ఒక తాళం చెవి లభించకపోవడంతో దాన్ని మిషన్‌తో కట్ చేశాడు. నేరుగా నగలు ఉన్న బీరువానే తెరిచి సుమారు రూ. నాలుగున్నర కోట్ల విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలను తస్కరించాడు. జాగిలాలు వాసన పసిగట్టకుండా ఘటనా స్థలంలో కారం పొడి చల్లాడు. బంగారు ఆభరణాలను మూడు బ్యాగ్‌ల్లో పెట్టి, ఆ రాత్రే భార్య, కుమారుడికి ఇచ్చి.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి పంపించాడు. ఎవరికీ అనుమానం రాకుండా బ్రహ్మచారి మరుసటి రోజు యధావిధిగా బ్యాంకుకు వచ్చాడు. నకిలీ తాళం చెవులతో రెండు రోజుల ముందు బ్యాంకు పనివేళల్లోనే రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిసింది. అయితే, ఈ చోరీకి ముందే మహేష్ బ్యాంకును బ్రహ్మచారి రూ. 20 లక్షల వరకు మోసగించాడు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 50 వేల చొప్పున సొమ్ము తీసుకుని.. నకిలీ బంగారు ఆభరణాలను అసలువిగా ధ్రువీకరించి ఆరుగురు వినియోగదారులకు రుణాలు ఇప్పించాడు. కాగా.. ఈ చోరీ సొత్తులోంచి 15 తులాల బంగారు ఆభరణాలను బ్రహ్మచారి పాట్ మార్కెట్లో విక్రయించాడు. ఆ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని, నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. పట్టించిన సీసీ కెమెరాలు: చోరీ సమయంలో సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లో ముసుగు ధరించిన వ్యక్తి మాత్రమే కనిపించాడు. బ్యాంకుకు సంబంధించిన వారికి ఇందులో హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు.. ఆ వ్యక్తి నడక, ఇతర చర్యలను గమనించారు. దాంతోపాటు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో నెల రోజుల కిందటి నుంచి నమోదైన ఫుటేజ్‌ను పరిశీలించారు.ఈ క్రమంలోనే గత నెల 18న అకౌంటెంట్ చాంబర్‌లోని డెస్క్ నుంచి, 21న మరో అకౌంటెంట్ ఊర్మిళ డెస్క్ నుంచి బ్రహ్మచారి స్ట్రాంగ్‌రూం తాళాలను తీసుకున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని తీసుకుని బ్రహ్మచారి టాయిలెట్లోకి వెళ్లి, రావడాన్ని గుర్తించారు. ఈ తాళం చెవులను బాత్రూంలోకి తీసుకె ళ్లి అక్కడ మైనం ముద్దపై అచ్చుతీసుకుని, తిరిగి డెస్క్‌ల్లో పెట్టేశాడు. ఈ మేరకు పోలీసులు బ్రహ్మచారి, భార్య లలిత, కుమారుడు వేదవిరాట్లను అరెస్టు చేశారు. కాగా, బంగారం చోరీ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. మహేష్ బ్యాంకు అటెండర్ రాములు, సీనియర్ అకౌంటెంట్ శివశంకర్‌ను అరెస్టు చేశారు. అలాగే బ్యాంకు ఎండీ, జనరల్ మేనేజర్, మేనేజర్ పద్మజ, ఉద్యోగులు ఊర్మిళ, ప్రశాంతిల నిర్లక్ష్యంపైనా ఆరా తీసి, అవసరమైతే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. -
మహేశ్ బ్యాంక్ దోపిడి అయినవారి పనేనా?
నగరంలోని ఏఎస్ రావు నగర్‌లోని మహేశ్ బ్యాంక్ దోపిడి కేసు కొత్త మలుపు తిరగనుందా అంటే అవుననే అంటున్నారు నగర పోలీసులు. గురువారం అర్థరాత్రి బ్యాంక్‌లో జరిగిన దోపిడి తీరు పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. నగలు దొంగతనం, దోపిడి సమయంలో అలారం మోగకపోడవం, దోపిడి అనంతరం సీసీ కెమెరా వైర్లు కత్తిరించడం చూస్తూంటే దోపిడీ ఇంటి దొంగల పనిగా పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ నైట్ వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గురువారం అర్థరాత్రి బ్యాంక్‌లో భారీ చోరి జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు. -
దొంగలు బాబోయ్
=మూడు దోపిడీలు.. ఆరు చోరీలు =వరసపెట్టి రెచ్చిపోతున్న నేరగాళ్లు =బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు =చేష్టలుడిగి చూస్తున్న ‘జంట పోలీసులు’ సాక్షి, సిటీబ్యూరో: ఏడు రోజులు... ఆరు ‘భారీ స్నాచింగ్స్’... ఐదు దోపిడీలు... నాలుగు చెప్పుకోదగ్గ చోరీలు... వెరసి రూ.32.55 లక్షల నగదు, 765 గ్రాముల బంగారం దుండగుల పాలైంది. జంట కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న నేరాల ముఖ చిత్రమిది. గొలుసు దొంగతనాలు, చిన్నాచితకా తస్కరణలు వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి. అన్నింటినీ మించి శుక్రవారం ‘మహేష్ బ్యాంక్’ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. రాజధానిలో పోలీసులు ఏం చేస్తున్నారు? అసలేం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? పోలీసింగ్ ఏమైంది? సగటు జీవి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతవరకు పక్కాగా అమలవుతోందనేదే సందేహాస్పదం. ప్రస్తుతం నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఉదంతాలను పరిశీలిస్తే దొంగలే... పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచడంతోపాటు అదును చూసి పంజా విసురుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల చర్యలను నిశితంగా గమనిస్తున్న దొంగలు దానికనుగుణంగా వారి ‘కార్యక్రమాలను’ మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో బ్యాంకుల వద్ద ద్విచక్ర వాహనంతో మాటు వేసి.. వినియోగదారుల నుంచి నగదు ఉన్న సంచుల్ని ఎత్తుకుపోవడం జరిగింది. దీంతో పోలీసులు బ్యాంకుల వద్ద మఫ్టీ పోలీసుల్ని మోహరించడంతో పాటు కాస్త నిఘా పెట్టారు. దీన్ని దొంగలు గుర్తించారో ఏమో..! వెంటనే పంథా మార్చి పంజా విసిరారు. నగదు బ్యాగ్‌తో వెళ్తున్న వారిని అనుసరించి అదును చూసి, అనువైన చోట తమ‘పని’ పూర్తి చేసుకున్నారు. పోలీసు గస్తీ ఏపాటితో తెలుసు కాబట్టి అద్దె ఇళ్లు కావాలంటూ వచ్చి దోపిడీలు చేసేస్తున్నారు. తాళం పడితే పగలకొట్టడం, కాస్త అమాయకంగా కనిపిస్తే దృష్టి మళ్లించడంతో అందినకాడికి దండుకుపోతున్నారు. కొనే వాళ్లకు కొదవలేదు చోరీ వాహనాలు, సొత్తును కొనుగోలు చేసే మారు వ్యాపారులకు నగరంలో కొదవలేదు. శివారు జిల్లాలకు చెందిన కొందరు జ్యువెలరీ దుకాణాలు, నగల తయారీదారులు సైతం ఈ బంగారంపై మక్కువ చూపిస్తుంటారు. బేగంబజార్, సిద్ధిఅంబర్‌బజార్, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బంగారం దుకాణాల్లో అసలు వ్యాపారానికి పోటీగా మారు వ్యాపారం నడుస్తుంటుందనేది ‘ఖాకీ’లెరిగిన సత్యం. అసలు ధరలో 50 శాతానికే బంగారం వస్తుండటంతో యథేచ్ఛగా కొనుగోళ్లకు పాల్పడుతుంటారు. ఈ తరహా వ్యాపారాలు సాగించే దుకాణదారుల జాబితాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉన్నాయి. వీరిని కట్టడి చేసి, అమ్మే అవకాశం లేకుండా చేస్తే చోరీలు తగ్గొచ్చు. పోలీసులకు మాత్రం ఇది పట్టదు. రిక‘వర్రీలు’ మరీ ఘోరం ఓ పక్క చోరులు ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన మూడేళ్ల పరిస్థితిని చూస్తే... ఏ ఒక్క ఏడాదీ రికవరీలు 60 శాతానికి చేరిన పాపాన పోలేదు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు కోల్పొతున్న సొత్తులో నాలుగో వంతు నగరవాసులదే. అయితే సిబ్బంది, మౌలిక వసతుల కొరతకు తోడు అనునిత్యం వెంటాడే బందోబస్తు, ప్రొటోకాల్ డ్యూటీల ఫలితంగా అనేక కేసులు కొన్నాళ్లకు అటకెక్కుతున్నాయి. కేజీల లెక్కన చోరీ, దోపిడీ అయిన భారీ ఉదంతం జరిగినప్పుడు పోలీసులు చూపించే శ్రద్ధ, మామూలు మధ్య తరగతి వ్యక్తి ఇంట్లో గ్రాముల్లో పోతే చూపించరు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఓ దొంగ దొరికినప్పుడు చిట్టా విప్పాల్సిందే తప్ప సాధారణ కేసులపై ప్రత్యేక దృష్టంటూ ఉండదు. కొత్తవారూ ‘చోరం’గేట్రం... పెరుగుతున్న బంగారం ధరలు, పోలీసుల ‘శక్తిసామర్థ్యాలను’ ప్రత్యక్షంగానో, మీడియా ద్వారానో చూస్తున్న అనేక మంది జల్సా రాయుళ్లూ ఈజీ మనీ కోసం చోరుల అవతారం ఎత్తుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థులు సైతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. జల్సాల కోసం విద్యార్థులు, విద్యాధికులు కూడా చోరబాట పడుతున్నారు. ఈ కారణంగానూ నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా చోరుల అవతారం ఎత్తుతున్న వారిలో ఇతర నేరాలు చేసే వారికన్నా స్నాచింగ్స్ చేసేవారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి ఎలాంటి క్రిమినల్ బేక్‌గ్రౌండ్ లేకపోయినా కేవలం విలాసాలకు అవసరమైన ఖర్చులు, సాటి విద్యార్థుల మాదిరి డాబు దర్పాల కోసం నేరబాట పడుతున్నారు. నైబర్‌హుడ్ వాచ్ ఉత్తమం ఏళ్ల క్రితం నాటి సిబ్బందితో పోలీసు వ్యవస్థ ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడకుండా విదేశాల్లో మంచి ఫలితాలనిచ్చిన నైబర్‌హుడ్ వాచ్ వంటివి ఇక్కడ కూడా అమలులోకి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతోందనే అంశంపై కన్నేసి ఉంచి అవసరమైన సందర్భాల్లో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం నేరగాళ్లకు పట్టుకునే ప్రయత్నం చేయడమనే సూత్రాలతో కూడిన నైబర్‌హుడ్ వాచ్ ఇక్కడా అభివృద్ధి చేయాలని పోలీసువిభాగాన్ని కోరుతున్నారు. వారంలో రికార్డులకెక్కిన సొత్తు సంబంధ నేరాల్లో కొన్ని... దోపిడీలు... 21.11.13 మల్కాజ్గిరి ఠాణా పరిధిలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి 13 తులాల బంగారం, రూ.30 వేల నగదు దోపిడీ కుషాయిగూడ ఠాణా పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి 10 తులాల బంగారం దోపిడీ 24.11.13 రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విజయలక్ష్మి అనే మహిళపై దాడి చేసి 2.5 తులాల బంగారం దోపిడీ 26.11.13 మీర్పేట్ ఠాణా పరిధిలో కృష్ణవేణి అనే మహిళ ఇంటికి అద్దె ఇల్లు కావాలని వచ్చి దాడి చేసి 3 తులాల బంగారం దోపిడీ 28.11.13 కార్ఖానా ఠాణా పరిధిలో పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనిల్‌కుమార్, పూనంవర్మలపై దాడి చేసి రూ.5.25 లక్షల దోపిడీ చోరీలు... 24.11.13 జీడిమెట్ల ఠాణా పరిధిలో ఐదేళ్ల చిన్నారి వైష్ణవిని అపహరించి గ్రాము చెవిపోగులు చోరీ చందానగర్ ఠాణా పరిధిలో భెల్ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో 14 తులాల బంగారం చోరీ నాచారం పరిధిలో మితిన్కుమార్ ఇంట్లో 7 తులాల బంగారం, రూ.35 వేలు చోరీ 28.11.13 వనస్థలిపురం పరిధిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి బ్యాంకునకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో 20 తులాల బంగారం చోరీ దృష్టి మళ్లించి చేసిన నేరాలు, స్నాచింగ్స్ 22.11.13 పంజగుట్ట ఠాణా పరిధిలో సిరాజుద్దీన్ దృష్టి మళ్లించి రూ.2 లక్షలు స్వాహా ఇదే పరిధిలో ఉమామహేశ్వరరావు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు రూ.6 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్ 23.11.13 మహంకాళి పరిధిలో అక్బర్, జావేద్‌ల నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు రూ.4 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్ 25.11.13 సోమాజిగూడలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు జగదీష్ నుంచి రూ.9.45 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్ బంజారాహిల్స్ పరిధిలో శేఖర్ నుంచి ఇదే పంథాలో రూ.5.5 లక్షలున్న బ్యాగ్ అపహరణ 28.11.13 ఎల్బీనగర్ ఠాణా పరిధిలో రంగనాయకమ్మ దృష్టి మరల్చి 7 తులాల బంగారం అపహరణ -
మహేశ్ బ్యాంక్‌లో భారీ చోరీ
రూ. 5 కోట్లు విలువచేసే 16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు అంతా ఖాతాదారులు కుదువబెట్టిన బంగారమే ఏఎస్ రావు నగర్లో ఘటన రూ. 24 లక్షల నగదు ఉన్న బీరువా తెరిచేందుకు విఫలయత్నం ఇంటి దొంగల పనేనని అనుమానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేశ్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకు స్ట్రాంగ్ రూంలోని బీరువాలో ఉన్న సుమారు రూ. 5 కోట్ల విలువైన 16 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్టు అనధికారికంగా తెలుస్తోంది. రూ. 24 లక్షల నగదు కలిగిన బీరువాలను తెరిచేందుకు కూడా వారు విఫలయత్నం చేశారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. ఏఎస్ రావునగర్‌లోని గణేష్ ఛాంబర్లోని మొదటి అంతస్తులో మహేష్ బ్యాంకు ఉంది. గురువారం సాయంత్రం 6.30కి సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పనిమనిషి విజయలక్ష్మి ఊడ్చేందుకు రాగా.. అప్పటికే తాళాలు తెరిచి ఉండడంతో మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజ్గిరి డీసీపీ గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్, క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. వినియోగదారులు బ్యాంకులో కుదువబెట్టిన బంగారు ఆభరణాలే చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. ఈ చోరీలో ఇద్దరు లేక ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల వైర్లను దుండగులు కట్ చేసినట్టు గుర్తించారు. కాగా, ఎంత బంగారం పోయిందనే విషయంపై 15 గంటలు గడిచినా బ్యాంకు అధికారులు నోరు విప్పడంలేదు. అనధికార వర్గాల ప్రకారం 16 కిలోల బంగారం చోరీ అయిఉండొచ్చని సమాచారం. మారు తాళం చెవుల సాయంతో దుండగులు చోరీకి పాల్పడటాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనే అయిఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కీ నిర్వహించాకే చోరీ చేశారని పోలీసులు చెపుతున్నారు. ఇందులో సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో వాచ్‌మేన్, మరో ముగ్గురు దోపిడీ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు.