ఇంటిదొంగ పనే.. మహేష్ బ్యాంకులో చోరీ చేసింది | Police break through Mahesh Bank robbery case | Sakshi
Sakshi News home page

ఇంటిదొంగ పనే.. మహేష్ బ్యాంకులో చోరీ చేసింది

Published Wed, Dec 4 2013 1:06 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

ఇంటిదొంగ పనే.. మహేష్ బ్యాంకులో చోరీ చేసింది - Sakshi

ఇంటిదొంగ పనే.. మహేష్ బ్యాంకులో చోరీ చేసింది

 అందులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసే బ్రహ్మచారి
 సాక్షి, హైదరాబాద్: అతనో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్.. తాకట్టుకు వచ్చిన బంగారాన్ని చోరీ చేయాలని ప్లాన్ వేశాడు.. స్ట్రాంగ్‌రూమ్ సహా బ్యాంకులో తాళాలన్నింటికీ డూప్లికేట్లు సంపాదించాడు.. ఓ రోజు రాత్రి ముసుగు వేసుకుని బ్యాంకులో చొరబడ్డాడు.. దర్జాగా తాళాలు తీసి, ఏకంగా రూ. నాలుగున్నర కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని తస్కరించాడు.. జాగిలాలు తన వాసన పట్టకుండా కారప్పొడి చల్లాడు.. ఎత్తుకుపోయిన బంగారాన్ని భార్య, కుమారుడికి ఇచ్చి పంపేసి, మరుసటిరోజు ఏమీ తెలియనట్లు విధులకూ వచ్చాడు.. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. అంతకంటే ముందే కొందరు బ్యాంకు వినియోగదారులతో కుమ్మక్కై నకిలీ బంగారాన్ని అసలుదిగా ధ్రువీకరించి.. 20 లక్షల మేరకు రుణాలు ఇప్పించాడు. వారి దగ్గరి నుంచి మూడు లక్షల వరకూ వసూలు చేశాడు.. ఇదంతా మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ (తాకట్టుకు వచ్చిన బంగారం నాణ్యతను నిర్ధారించే వ్యక్తి)గా పనిచేస్తూ.. గత నెల 28న చోరీకి పాల్పడ్డ మాచర్లోజు బ్రహ్మచారి వ్యవహారం. సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంకులో చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించి, ఆయనతో పాటు భార్య, కుమారుడిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు.
 
  వరంగల్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్లోజు బ్రహ్మచారి (50) అక్కడ బంగారు నగలు తయారు చేసేవాడు. కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లోని నాగోల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడా అదే పని చేస్తూ.. ఎస్‌ఆర్ నగర్‌లోని మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా చేరాడు. ఆయన భార్య లలిత, కుమారుడు వేదవిరాట్. వేద విరాట్ కూడా యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, మహేష్ బ్యాంకులో వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మచారి మూడు నెలల క్రితమే పథకం పన్నాడు. చోరీ కోసం బ్యాంకు తాళాలను సంపాదించే పనిలో పడ్డాడు. అటెండర్‌కు తెలియకుండా అతని వద్ద ఏడు తాళం చెవులను తీసుకుని, మారు తాళం చెవులను తయారు చేయించాడు. తర్వాత అకౌంటెంట్లు శివశంకర్, ఊర్మిళ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూం తాళం చెవులను మైనం ముద్దపై అచ్చు తీసుకుని.. తానే స్వయంగా నకిలీ తాళం చెవులను తయారు చేశాడు. వీటన్నింటితో గత నెల 28న రాత్రి 9.54 గంటలకు చోరీకి పాల్పడ్డాడు. అయితే, స్ట్రాంగ్ రూంలోని గ్రిల్‌డోర్‌కు వేసిన ఒక తాళం చెవి లభించకపోవడంతో దాన్ని మిషన్‌తో కట్ చేశాడు. నేరుగా నగలు ఉన్న బీరువానే తెరిచి సుమారు రూ. నాలుగున్నర కోట్ల విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలను తస్కరించాడు. జాగిలాలు వాసన పసిగట్టకుండా ఘటనా స్థలంలో కారం పొడి చల్లాడు. బంగారు ఆభరణాలను మూడు బ్యాగ్‌ల్లో పెట్టి, ఆ రాత్రే భార్య, కుమారుడికి ఇచ్చి.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి పంపించాడు.
 
 ఎవరికీ అనుమానం రాకుండా బ్రహ్మచారి మరుసటి రోజు యధావిధిగా బ్యాంకుకు వచ్చాడు. నకిలీ తాళం చెవులతో రెండు రోజుల ముందు బ్యాంకు పనివేళల్లోనే రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిసింది. అయితే, ఈ చోరీకి ముందే మహేష్ బ్యాంకును బ్రహ్మచారి రూ. 20 లక్షల వరకు మోసగించాడు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 50 వేల చొప్పున సొమ్ము తీసుకుని.. నకిలీ బంగారు ఆభరణాలను అసలువిగా ధ్రువీకరించి ఆరుగురు వినియోగదారులకు రుణాలు ఇప్పించాడు. కాగా.. ఈ చోరీ సొత్తులోంచి 15 తులాల బంగారు ఆభరణాలను బ్రహ్మచారి పాట్ మార్కెట్‌లో విక్రయించాడు. ఆ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని, నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
 
 పట్టించిన సీసీ కెమెరాలు: చోరీ సమయంలో సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లో ముసుగు ధరించిన వ్యక్తి మాత్రమే కనిపించాడు. బ్యాంకుకు సంబంధించిన వారికి ఇందులో హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు.. ఆ వ్యక్తి నడక, ఇతర చర్యలను గమనించారు. దాంతోపాటు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో నెల రోజుల కిందటి నుంచి నమోదైన ఫుటేజ్‌ను పరిశీలించారు.ఈ క్రమంలోనే గత నెల 18న అకౌంటెంట్ చాంబర్‌లోని డెస్క్ నుంచి, 21న మరో అకౌంటెంట్ ఊర్మిళ డెస్క్ నుంచి బ్రహ్మచారి స్ట్రాంగ్‌రూం తాళాలను తీసుకున్న దృశ్యాలు కనిపించాయి.
 
 వాటిని తీసుకుని బ్రహ్మచారి టాయిలెట్‌లోకి వెళ్లి, రావడాన్ని గుర్తించారు. ఈ తాళం చెవులను బాత్‌రూంలోకి తీసుకె ళ్లి అక్కడ మైనం ముద్దపై అచ్చుతీసుకుని, తిరిగి డెస్క్‌ల్లో పెట్టేశాడు. ఈ మేరకు పోలీసులు బ్రహ్మచారి, భార్య లలిత, కుమారుడు వేదవిరాట్‌లను అరెస్టు చేశారు. కాగా, బంగారం చోరీ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. మహేష్ బ్యాంకు అటెండర్ రాములు, సీనియర్ అకౌంటెంట్ శివశంకర్‌ను అరెస్టు చేశారు. అలాగే బ్యాంకు ఎండీ, జనరల్ మేనేజర్, మేనేజర్ పద్మజ, ఉద్యోగులు ఊర్మిళ, ప్రశాంతిల నిర్లక్ష్యంపైనా ఆరా తీసి, అవసరమైతే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement