మహేశ్ బ్యాంక్‌లో భారీ చోరీ
రూ. 5 కోట్లు విలువచేసే 16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
అంతా ఖాతాదారులు కుదువబెట్టిన బంగారమే
ఏఎస్ రావు నగర్‌లో ఘటన
రూ. 24 లక్షల నగదు ఉన్న బీరువా తెరిచేందుకు విఫలయత్నం
ఇంటి దొంగల పనేనని అనుమానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేశ్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకు స్ట్రాంగ్ రూంలోని బీరువాలో ఉన్న సుమారు రూ. 5 కోట్ల విలువైన 16 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్టు అనధికారికంగా తెలుస్తోంది. రూ. 24 లక్షల నగదు కలిగిన బీరువాలను తెరిచేందుకు కూడా వారు విఫలయత్నం చేశారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, మల్కాజ్‌గిరి డీసీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. ఏఎస్ రావునగర్‌లోని గణేష్ ఛాంబర్‌లోని మొదటి అంతస్తులో మహేష్ బ్యాంకు ఉంది. గురువారం సాయంత్రం 6.30కి సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పనిమనిషి విజయలక్ష్మి ఊడ్చేందుకు రాగా.. అప్పటికే తాళాలు తెరిచి ఉండడంతో మేనేజర్‌కు తెలియజేసింది.
ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజ్‌గిరి డీసీపీ గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్, క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. వినియోగదారులు బ్యాంకులో కుదువబెట్టిన బంగారు ఆభరణాలే చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. ఈ చోరీలో ఇద్దరు లేక ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల వైర్లను దుండగులు కట్ చేసినట్టు గుర్తించారు. కాగా, ఎంత బంగారం పోయిందనే విషయంపై 15 గంటలు గడిచినా బ్యాంకు అధికారులు నోరు విప్పడంలేదు. అనధికార వర్గాల ప్రకారం 16 కిలోల బంగారం చోరీ అయిఉండొచ్చని సమాచారం. మారు తాళం చెవుల సాయంతో దుండగులు చోరీకి పాల్పడటాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనే అయిఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కీ నిర్వహించాకే చోరీ చేశారని పోలీసులు చెపుతున్నారు. ఇందులో సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసుల అదుపులో వాచ్‌మేన్, మరో ముగ్గురు
దోపిడీ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు.