navadeep singh
-
చింతమనేని దాడి చేయలేదట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు తనపై ఉన్న కేసులు ఎత్తి వేయించుకున్న సంగతి తాజాగా వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసు కూడా తప్పుడు కేసుగా తీసేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు కీలకమైన కేసులను తప్పుడు కేసులుగా చూపించి ఎత్తివేశారు. ఈ విషయాలన్నీ పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు చింతమనేని పరారీలో ఉండటంతో అతనిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులను ఎత్తివేయించినట్లు సమాచారం. 2015 జూలై ఎనిమిదిన అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక ర్యాంపు వద్ద తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. చింతమనేనినే వెనకేసుకు వచ్చారు. అయితే కనీసం ఫిర్యాదుదారునికి సమాచారం కూడా ఇవ్వకుండా కేసును తప్పుడు కేసు కింద చూపి ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొలగించారు. డీఎస్పీ కేసును తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు బాధితునికి కూడా నోటీసులు పంపుతుంది. ఈ ప్రక్రియ చేయకుండా కేసులను ఎత్తివేశారు. ఎన్నికల ముందు పెదవేగి మండలం లక్ష్మీపురంలో అక్రమంగా మట్టి తోలడాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత మేడికొండ కృష్ణారావు కేసును, దళిత మహిళను దూషించిన కేసును, గుండుగొలను వద్ద ఏఎస్ఐపై దాడి చేసిన కేసును, ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యంగా ప్రవేశించి నిందితులను తీసుకువెళ్లిన కేసులను కూడా తప్పుడు కేసులుగా రిఫర్ చేశారు. ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్‌పై 49 కేసులు నమోదు కాగా, అందులో 23 కేసులు రిఫర్ చేసి తీసివేశారు. ఈ కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తొలగించడం విశేషం. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి: ఎస్పీ చింతమనేని అరాచకాలకు బలి అయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ కోరారు. శనివారం కూడా పలువురు బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలలో తమ భూములను చింతమనేని, అతని అనుచరులు అక్రమించుకున్నారంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు చింతమనేని కేసులో సాక్షులు ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎస్పీ స్పందించారు. చింతమనేనిపై ఫిర్యాదు చేసిన జోసఫ్‌ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతోందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చింతమనేనిపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పేర్కొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న చింతమనేని బాధితులు
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి గురైన బాధితులు చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తమపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చింతమనేనిపై ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న చింతమనేని ఆచూకి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా ఎస్పీ నవదీప్‌సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోవడంతో చింతమనేనికి సహకరించిన కొందరు పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. -
‘వేలిముద్రల మార్పిడి’ ముఠా అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆపరేషన్ ద్వారా వేలిముద్రలను మార్చుతూ.. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి అక్రమంగా వ్యక్తులను విదేశాలకు పంపుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు వ్యక్తులతో పాటు నకిలీ పాస్‌పోర్టులు, సర్జికల్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా రాంబాబు 2010లో కువైట్ వెళ్లాడు. అక్కడ అక్రమంగా స్పిరిట్ తయారు చేస్తూ పట్టుబడడంతో 2015లో అతడిని ఇండియాకు పంపారు. కువైట్‌లో ఉండగా శ్రీలంక దేశానికి చెందిన జాకీర్ హుస్సేన్, అక్బర్ ఆలీ, వైఎస్సార్ జిల్లాకు చెందిన మహ్మద్ బాషా, ఖాదర్ బాషా, ముజుఫర్ పరిచయం అయ్యారు. వీరి ద్వారా రాంబాబు ఇంటివద్దే తన పది వేళ్లకు ఆపరేషన్ చేయించుకుని వేలిముద్రలు మార్పించుకున్నాడు. భీమవరానికి చెందిన మేరీ రాజ్యలక్ష్మి, భగ్గేశ్వరం గ్రామానికి చెందిన పీఎంపీ వీరా త్రిమూర్తులుతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి దొంగ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసే నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కొండెం రాజారెడ్డి పరిచయం అయ్యాడు. వీరంతా కలసి జార్ఖండ్, బిహార్, తమిళనాడు, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, ఢిల్లీ, రాజంపేట తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 70 మంది వ్యక్తులకు వేలిముద్రల మార్పిడి చేశారు. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి వీరిలో కొందరిని అక్రమంగా విదేశాలకు పంపారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ సొమ్ములు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. కీలక నిందితులు బొక్కా రాంబాబు, కొండెం రాజారెడ్డి, ముజుఫర్, పీఎంపీ వీరా త్రిమూర్తులు, శ్రీలంకకు చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్ అలియాస్ మహ్మద్ ఫరూక్‌లను పాలకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్
అతి కొద్ది కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హాట్ బ్యూటి అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఎన్‌హెచ్ 10' సినిమాతో నిర్మాతగా మారిన అనుష్క, అదే సినిమాలో నటనతో కూడా ఆకట్టుకుంది. అదే ఊపులో ఒకేసారి మూడు సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది అనుష్క శర్మ. ఈ సినిమాలు, నా కోసం నేను నిర్మించుకుంటున్నా అంటున్న అనుష్క ఇప్పటికే రెండు సినిమాల కథా కథనాలు కూడా రెడీ అయ్యాయని, మరో సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూడు చిత్రాల్లో, ఎన్ హెచ్ 10 సినిమాకు దర్శకత్వం వహించిన నవదీప్ సింగ్ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, మిగతా రెండు సినిమాల ద్వారా అన్షయ్ లాల్, అక్షంత్ వర్మలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. -
మహేశ్ బ్యాంక్‌లో భారీ చోరీ
రూ. 5 కోట్లు విలువచేసే 16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు అంతా ఖాతాదారులు కుదువబెట్టిన బంగారమే ఏఎస్ రావు నగర్లో ఘటన రూ. 24 లక్షల నగదు ఉన్న బీరువా తెరిచేందుకు విఫలయత్నం ఇంటి దొంగల పనేనని అనుమానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేశ్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకు స్ట్రాంగ్ రూంలోని బీరువాలో ఉన్న సుమారు రూ. 5 కోట్ల విలువైన 16 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్టు అనధికారికంగా తెలుస్తోంది. రూ. 24 లక్షల నగదు కలిగిన బీరువాలను తెరిచేందుకు కూడా వారు విఫలయత్నం చేశారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. ఏఎస్ రావునగర్‌లోని గణేష్ ఛాంబర్లోని మొదటి అంతస్తులో మహేష్ బ్యాంకు ఉంది. గురువారం సాయంత్రం 6.30కి సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పనిమనిషి విజయలక్ష్మి ఊడ్చేందుకు రాగా.. అప్పటికే తాళాలు తెరిచి ఉండడంతో మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజ్గిరి డీసీపీ గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్, క్రైమ్ అదనపు డీసీపీ జానకీ షర్మిల, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. వినియోగదారులు బ్యాంకులో కుదువబెట్టిన బంగారు ఆభరణాలే చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. ఈ చోరీలో ఇద్దరు లేక ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులోని సీసీ కెమెరాల వైర్లను దుండగులు కట్ చేసినట్టు గుర్తించారు. కాగా, ఎంత బంగారం పోయిందనే విషయంపై 15 గంటలు గడిచినా బ్యాంకు అధికారులు నోరు విప్పడంలేదు. అనధికార వర్గాల ప్రకారం 16 కిలోల బంగారం చోరీ అయిఉండొచ్చని సమాచారం. మారు తాళం చెవుల సాయంతో దుండగులు చోరీకి పాల్పడటాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనే అయిఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కీ నిర్వహించాకే చోరీ చేశారని పోలీసులు చెపుతున్నారు. ఇందులో సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో వాచ్‌మేన్, మరో ముగ్గురు దోపిడీ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు. -
ఎస్పీ బదిలీ తాత్కాలికంగా నిలుపుదల
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు ఎస్పీ ఎస్.శ్యాంసుందర్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తన బదిలీ నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలు ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డి సోమవారం క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన క్యాట్.. రాష్ట్రంలో 44 మంది ఐపీఎస్ అధికారుల బదిలీకి చేసుకున్న ప్రాతిపదికను తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారంలోగా ఆ వివరాలను అందించాలని, అప్పటివరకు బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలో 44 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. క్యాట్ అడిగిన వివరాలను బుధవారంలోగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అందించే వివరాలతో క్యాట్ సంతృప్తి చెందకపోతే.. నిబంధనలకు విరుద్ధంగా చేసిన బదిలీలు ఆగిపోయే అవకాశం ఉంది. తీర్పు వెలువరించే వరకూ బదిలీలను నిలుపుదల చేయాలన్న క్యాట్ ఆదేశాలతో.. ఎస్పీ శ్యాంసుందర్, ఏఎస్పీ నవదీప్‌సింగ్ బదిలీలు తాత్కాలికంగా ఆగిపోయాయి. వీరిద్దరి బదిలీకి ప్రభుత్వం చెప్పే కారణాలతో క్యాట్ సంతృప్తి చెందితే.. వారిద్దరూ కొత్తగా నియమించిన స్థానాల్లో విధులను చేపట్టాల్సి ఉంటుంది.