సాక్షి ప్రతినిధి, అనంతపురం:
కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు ఎస్పీ ఎస్.శ్యాంసుందర్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తన బదిలీ నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలు ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డి సోమవారం క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన క్యాట్.. రాష్ట్రంలో 44 మంది ఐపీఎస్ అధికారుల బదిలీకి చేసుకున్న ప్రాతిపదికను తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారంలోగా ఆ వివరాలను అందించాలని, అప్పటివరకు బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలో 44 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
క్యాట్ అడిగిన వివరాలను బుధవారంలోగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అందించే వివరాలతో క్యాట్ సంతృప్తి చెందకపోతే.. నిబంధనలకు విరుద్ధంగా చేసిన బదిలీలు ఆగిపోయే అవకాశం ఉంది. తీర్పు వెలువరించే వరకూ బదిలీలను నిలుపుదల చేయాలన్న క్యాట్ ఆదేశాలతో.. ఎస్పీ శ్యాంసుందర్, ఏఎస్పీ నవదీప్‌సింగ్ బదిలీలు తాత్కాలికంగా ఆగిపోయాయి. వీరిద్దరి బదిలీకి ప్రభుత్వం చెప్పే కారణాలతో క్యాట్ సంతృప్తి చెందితే.. వారిద్దరూ కొత్తగా నియమించిన స్థానాల్లో విధులను చేపట్టాల్సి ఉంటుంది.
ఎస్పీ బదిలీ తాత్కాలికంగా నిలుపుదల
Published Tue, Oct 29 2013 4:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement