
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.
వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.
తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది.