సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు తనపై ఉన్న కేసులు ఎత్తి వేయించుకున్న సంగతి తాజాగా వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసు కూడా తప్పుడు కేసుగా తీసేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు కీలకమైన కేసులను తప్పుడు కేసులుగా చూపించి ఎత్తివేశారు. ఈ విషయాలన్నీ పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు చింతమనేని పరారీలో ఉండటంతో అతనిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులను ఎత్తివేయించినట్లు సమాచారం.
2015 జూలై ఎనిమిదిన అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక ర్యాంపు వద్ద తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. చింతమనేనినే వెనకేసుకు వచ్చారు. అయితే కనీసం ఫిర్యాదుదారునికి సమాచారం కూడా ఇవ్వకుండా కేసును తప్పుడు కేసు కింద చూపి ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొలగించారు. డీఎస్పీ కేసును తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు బాధితునికి కూడా నోటీసులు పంపుతుంది.
ఈ ప్రక్రియ చేయకుండా కేసులను ఎత్తివేశారు. ఎన్నికల ముందు పెదవేగి మండలం లక్ష్మీపురంలో అక్రమంగా మట్టి తోలడాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత మేడికొండ కృష్ణారావు కేసును, దళిత మహిళను దూషించిన కేసును, గుండుగొలను వద్ద ఏఎస్‌ఐపై దాడి చేసిన కేసును, ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో దౌర్జన్యంగా ప్రవేశించి నిందితులను తీసుకువెళ్లిన కేసులను కూడా తప్పుడు కేసులుగా రిఫర్ చేశారు. ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్‌పై 49 కేసులు నమోదు కాగా, అందులో 23 కేసులు రిఫర్ చేసి తీసివేశారు. ఈ కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తొలగించడం విశేషం.
బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి: ఎస్పీ
చింతమనేని అరాచకాలకు బలి అయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ కోరారు. శనివారం కూడా పలువురు బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలలో తమ భూములను చింతమనేని, అతని అనుచరులు అక్రమించుకున్నారంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మరోవైపు చింతమనేని కేసులో సాక్షులు ఓ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎస్పీ స్పందించారు. చింతమనేనిపై ఫిర్యాదు చేసిన జోసఫ్‌ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతోందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చింతమనేనిపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment