మహేశ్ బ్యాంక్ దోపిడి అయినవారి పనేనా?
నగరంలోని ఏఎస్ రావు నగర్లోని మహేశ్ బ్యాంక్ దోపిడి కేసు కొత్త మలుపు తిరగనుందా అంటే అవుననే అంటున్నారు నగర పోలీసులు. గురువారం అర్థరాత్రి బ్యాంక్లో జరిగిన దోపిడి తీరు పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. నగలు దొంగతనం, దోపిడి సమయంలో అలారం మోగకపోడవం, దోపిడి అనంతరం సీసీ కెమెరా వైర్లు కత్తిరించడం చూస్తూంటే దోపిడీ ఇంటి దొంగల పనిగా పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ నైట్ వాచ్మెన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గురువారం అర్థరాత్రి బ్యాంక్లో భారీ చోరి జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. దోపిడీ జరిగిన తీరును గమనిస్తే.. కేవలం మారు తాళం చెవులతోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇవి తయారు చేయాలంటే ఒక్క వాచ్‌మేన్‌కే సాధ్యమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వాచ్‌మేన్ రాములుతో పాటు మారు తాళాలు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీకి గురైన బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడంలేదు.