=తాకట్టులోని బంగారం పరీక్ష
=మరో బ్రహ్మచారి లేకుండా బ్యాంకుల జాగ్రత్త
=ఇందుకు బయట అప్రయిజర్ వినియోగం
=భద్రతా చర్యలపై కూడా దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: మహేష్ బ్యాంక్ దోపిడీలో పట్టుబడ్డ ఇంటి దొంగ, గోల్డ్ అప్రయిజర్ బ్రహ్మచారి మోసం వెలుగు చూడడంతో నగరంలోని ఇతర బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. దోపిడీ చేయడమేకాకుండా నకిలీ బంగారాన్ని ఒరిజినల్‌దిగా చూపించి తాను పనిచేస్తున్న బ్యాంకునే బ్రహ్మచారి మోసం చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ బ్యాంకులో కూడా ఇలాంటి మోసం జరిగిందా అనే అనుమానంతో ఇతర బ్యాంకుల అధికారులు అప్రమత్తమయ్యాయి. తమ బ్యాంకులో తాకట్టులో ఉన్న వినియోగదారుల బంగారు ఆభరణాల్లో నకిలీవి ఉన్నాయా ? అనేది నిర్థారించుకునే పనిలో పడ్డారు. తమ ఉద్యోగితో కాకుండా బయటి నుంచి గోల్డ్ అప్రయిజర్లను పిలిపించి వద్ద ఉన్న నగలను తనిఖీ చేయిస్తున్నారు.
బ్రహ్మచారి కుమారుడు వేదవిరాట్ (21) కూడా మహేష్ బ్యాంకు దోపిడీ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఇతగాడు యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా తన తండ్రి మాదిరిగానే ఈ బ్యాంక్‌లో కూడా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించాడా? అనే కోణంలో ఆ బ్యాంకు అధికారులు తమ స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న తాకట్టు బంగారాన్ని మరొకరితో పరీక్ష చేయిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కూడా మహేష్‌బ్యాంకు తరహాలో దోపిడీకి పథకం పన్నారా అనే కోణంలో గత నెలరోజులుగా సీసీ కెమెరాల్లో నమోదైన ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
బ్రహ్మచారి చేసిన మోసంతో ఇతర బ్యాంకుల్లో పనిచేస్తున్న గోల్డ్ అప్రయిజర్లపై ఆయా బ్యాంకుల అధికారులు దృష్టిపెట్టారు. తాకట్టు కోసం వచ్చే నగలను జాగ్రత్తగా పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడితే బ్రహ్మచారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూం తాళం చెవులను నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగుల వద్ద పెడుతున్నా..వారు వాటిని ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. భద్రత చర్యలు లేకపోవడం వల్లనే మహేష్ బ్యాంకు దోపిడీకి గురైందని ఇతర బ్యాంకు అధికారులు కూడా పసిగట్టారు.
ఈ నేపథ్యంలోనే రాత్రి పూట సెక్యూరిటీ గార్డులను నియమించడంతో పాటు రాత్రి సమయంలో నమోదయ్యే వీడియో ఫూటేజ్ స్పష్టంగా వచ్చే కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏటీఎంలోని అలారం పనిచేస్తుందా లేదా అనేది కూడా ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని బ్యాంకుల వద్ద జనవరి 15లోగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ గడువులోపు బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోకుంటే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మహేష్ బ్యాంక్ దోపిడీతో అప్రమత్తం
Published Mon, Dec 9 2013 4:01 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement