=మూడు దోపిడీలు.. ఆరు చోరీలు
=వరసపెట్టి రెచ్చిపోతున్న నేరగాళ్లు
=బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
=చేష్టలుడిగి చూస్తున్న ‘జంట పోలీసులు’
సాక్షి, సిటీబ్యూరో: ఏడు రోజులు... ఆరు ‘భారీ స్నాచింగ్స్’... ఐదు దోపిడీలు... నాలుగు చెప్పుకోదగ్గ చోరీలు... వెరసి రూ.32.55 లక్షల నగదు, 765 గ్రాముల బంగారం దుండగుల పాలైంది. జంట కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న నేరాల ముఖ చిత్రమిది. గొలుసు దొంగతనాలు, చిన్నాచితకా తస్కరణలు వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి. అన్నింటినీ మించి శుక్రవారం ‘మహేష్ బ్యాంక్’ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. రాజధానిలో పోలీసులు ఏం చేస్తున్నారు? అసలేం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? పోలీసింగ్ ఏమైంది? సగటు జీవి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం అందరికీ తెలిసిన విషయమే.
ఇది ఎంతవరకు పక్కాగా అమలవుతోందనేదే సందేహాస్పదం. ప్రస్తుతం నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఉదంతాలను పరిశీలిస్తే దొంగలే... పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచడంతోపాటు అదును చూసి పంజా విసురుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల చర్యలను నిశితంగా గమనిస్తున్న దొంగలు దానికనుగుణంగా వారి ‘కార్యక్రమాలను’ మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో బ్యాంకుల వద్ద ద్విచక్ర వాహనంతో మాటు వేసి.. వినియోగదారుల నుంచి నగదు ఉన్న సంచుల్ని ఎత్తుకుపోవడం జరిగింది.
దీంతో పోలీసులు బ్యాంకుల వద్ద మఫ్టీ పోలీసుల్ని మోహరించడంతో పాటు కాస్త నిఘా పెట్టారు. దీన్ని దొంగలు గుర్తించారో ఏమో..! వెంటనే పంథా మార్చి పంజా విసిరారు. నగదు బ్యాగ్‌తో వెళ్తున్న వారిని అనుసరించి అదును చూసి, అనువైన చోట తమ‘పని’ పూర్తి చేసుకున్నారు. పోలీసు గస్తీ ఏపాటితో తెలుసు కాబట్టి అద్దె ఇళ్లు కావాలంటూ వచ్చి దోపిడీలు చేసేస్తున్నారు. తాళం పడితే పగలకొట్టడం, కాస్త అమాయకంగా కనిపిస్తే దృష్టి మళ్లించడంతో అందినకాడికి దండుకుపోతున్నారు.
కొనే వాళ్లకు కొదవలేదు
చోరీ వాహనాలు, సొత్తును కొనుగోలు చేసే మారు వ్యాపారులకు నగరంలో కొదవలేదు. శివారు జిల్లాలకు చెందిన కొందరు జ్యువెలరీ దుకాణాలు, నగల తయారీదారులు సైతం ఈ బంగారంపై మక్కువ చూపిస్తుంటారు. బేగంబజార్, సిద్ధిఅంబర్‌బజార్, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బంగారం దుకాణాల్లో అసలు వ్యాపారానికి పోటీగా మారు వ్యాపారం నడుస్తుంటుందనేది ‘ఖాకీ’లెరిగిన సత్యం. అసలు ధరలో 50 శాతానికే బంగారం వస్తుండటంతో యథేచ్ఛగా కొనుగోళ్లకు పాల్పడుతుంటారు. ఈ తరహా వ్యాపారాలు సాగించే దుకాణదారుల జాబితాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉన్నాయి. వీరిని కట్టడి చేసి, అమ్మే అవకాశం లేకుండా చేస్తే చోరీలు తగ్గొచ్చు. పోలీసులకు మాత్రం ఇది పట్టదు.
రిక‘వర్రీలు’ మరీ ఘోరం
ఓ పక్క చోరులు ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన మూడేళ్ల పరిస్థితిని చూస్తే... ఏ ఒక్క ఏడాదీ రికవరీలు 60 శాతానికి చేరిన పాపాన పోలేదు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు కోల్పొతున్న సొత్తులో నాలుగో వంతు నగరవాసులదే. అయితే సిబ్బంది, మౌలిక వసతుల కొరతకు తోడు అనునిత్యం వెంటాడే బందోబస్తు, ప్రొటోకాల్ డ్యూటీల ఫలితంగా అనేక కేసులు కొన్నాళ్లకు అటకెక్కుతున్నాయి. కేజీల లెక్కన చోరీ, దోపిడీ అయిన భారీ ఉదంతం జరిగినప్పుడు పోలీసులు చూపించే శ్రద్ధ, మామూలు మధ్య తరగతి వ్యక్తి ఇంట్లో గ్రాముల్లో పోతే చూపించరు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఓ దొంగ దొరికినప్పుడు చిట్టా విప్పాల్సిందే తప్ప సాధారణ కేసులపై ప్రత్యేక దృష్టంటూ ఉండదు.
కొత్తవారూ ‘చోరం’గేట్రం...
పెరుగుతున్న బంగారం ధరలు, పోలీసుల ‘శక్తిసామర్థ్యాలను’ ప్రత్యక్షంగానో, మీడియా ద్వారానో చూస్తున్న అనేక మంది జల్సా రాయుళ్లూ ఈజీ మనీ కోసం చోరుల అవతారం ఎత్తుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థులు సైతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. జల్సాల కోసం విద్యార్థులు, విద్యాధికులు కూడా చోరబాట పడుతున్నారు. ఈ కారణంగానూ నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా చోరుల అవతారం ఎత్తుతున్న వారిలో ఇతర నేరాలు చేసే వారికన్నా స్నాచింగ్స్ చేసేవారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి ఎలాంటి క్రిమినల్ బేక్‌గ్రౌండ్ లేకపోయినా కేవలం విలాసాలకు అవసరమైన ఖర్చులు, సాటి విద్యార్థుల మాదిరి డాబు దర్పాల కోసం నేరబాట పడుతున్నారు.
నైబర్‌హుడ్ వాచ్ ఉత్తమం
ఏళ్ల క్రితం నాటి సిబ్బందితో పోలీసు వ్యవస్థ ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడకుండా విదేశాల్లో మంచి ఫలితాలనిచ్చిన నైబర్‌హుడ్ వాచ్ వంటివి ఇక్కడ కూడా అమలులోకి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతోందనే అంశంపై కన్నేసి ఉంచి అవసరమైన సందర్భాల్లో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం నేరగాళ్లకు పట్టుకునే ప్రయత్నం చేయడమనే సూత్రాలతో కూడిన నైబర్‌హుడ్ వాచ్ ఇక్కడా అభివృద్ధి చేయాలని పోలీసువిభాగాన్ని కోరుతున్నారు.
వారంలో రికార్డులకెక్కిన సొత్తు సంబంధ నేరాల్లో కొన్ని...
దోపిడీలు...
21.11.13
మల్కాజ్‌గిరి ఠాణా పరిధిలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి 13 తులాల బంగారం, రూ.30 వేల నగదు దోపిడీ
కుషాయిగూడ ఠాణా పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి 10 తులాల బంగారం దోపిడీ
24.11.13
రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విజయలక్ష్మి అనే మహిళపై దాడి చేసి 2.5 తులాల బంగారం దోపిడీ
26.11.13
మీర్‌పేట్ ఠాణా పరిధిలో కృష్ణవేణి అనే మహిళ ఇంటికి అద్దె ఇల్లు కావాలని వచ్చి దాడి చేసి 3 తులాల బంగారం దోపిడీ
28.11.13
కార్ఖానా ఠాణా పరిధిలో పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనిల్‌కుమార్, పూనంవర్మలపై దాడి చేసి రూ.5.25 లక్షల దోపిడీ
చోరీలు...
24.11.13
జీడిమెట్ల ఠాణా పరిధిలో ఐదేళ్ల చిన్నారి వైష్ణవిని అపహరించి గ్రాము చెవిపోగులు చోరీ
చందానగర్ ఠాణా పరిధిలో భెల్ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో 14 తులాల బంగారం చోరీ
నాచారం పరిధిలో మితిన్‌కుమార్ ఇంట్లో 7 తులాల బంగారం, రూ.35 వేలు చోరీ
28.11.13
వనస్థలిపురం పరిధిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి బ్యాంకునకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో 20 తులాల బంగారం చోరీ దృష్టి మళ్లించి చేసిన నేరాలు, స్నాచింగ్స్ 22.11.13
పంజగుట్ట ఠాణా పరిధిలో సిరాజుద్దీన్ దృష్టి మళ్లించి రూ.2 లక్షలు స్వాహా
ఇదే పరిధిలో ఉమామహేశ్వరరావు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు రూ.6 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్
23.11.13
మహంకాళి పరిధిలో అక్బర్, జావేద్‌ల నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు రూ.4 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్
25.11.13
సోమాజిగూడలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు జగదీష్ నుంచి రూ.9.45 లక్షలున్న బ్యాగ్ స్నాచింగ్
బంజారాహిల్స్ పరిధిలో శేఖర్ నుంచి ఇదే పంథాలో రూ.5.5 లక్షలున్న బ్యాగ్ అపహరణ
28.11.13
ఎల్బీనగర్ ఠాణా పరిధిలో రంగనాయకమ్మ దృష్టి మరల్చి 7 తులాల బంగారం అపహరణ
దొంగలు బాబోయ్
Published Sat, Nov 30 2013 4:07 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement