నామినేషన్‌లో గందరగోళం
నామినేషన్‌లో గందరగోళం
Published Wed, Jul 20 2016 10:31 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
మిత్ర పక్ష బీజేపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
ఏకపక్షంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ
టీడీపీ దౌర్జన్యకాండను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ
కొరిటెపాడు (గుంటూరు) : అర్బన్ బ్యాంకు పాలకవర్గ పదవులకు సంబంధించి బుధశారం నామినేషన్‌ల ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్‌కు తుది గడువుగా ఉంది. దీంతో చైర్మన్ పదవిని ఆశిస్తూ బరిలో ఉన్న టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న బీజేపీ నేత, బ్యాంకు మాజీ చైర్మన్ ఆర్తిమళ్ళ వెంకటరత్నం ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలతో కలిసి బ్యాంకు చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్ వేయడానికి లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు ఈదర శ్రీనివాసరెడ్డిపై దాడిచేశారు. దీంతో నామినేషన్లు వేయకుండానే బీజేపీ అభ్యర్థులు వెనుదిరిగారు. అనంతరం భారతీయ జనతా పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సిట్టింగ్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని ఎమ్మెల్యేల వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల జోక్యంతో కొత్తమాసు నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు.
టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు
ఈ సందర్భంగా అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేసిన కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్‌ను అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. దీంతో ఏకీభవించని టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిందని ఈ మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పదవిని తమకు వదలి వేయాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్, బీజేపీ నుంచి వెంకటరత్నం నామినేషన్లు వేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులతోపాటు నాయకులు నేరేళ్ళ మాధవరావు, చెరుకూరి తిరుపతిరావు, శిఖాకొల్లి అభినేష్, జగన్‌మోహన్‌రావు, తోట రామకష్ణ, కె.వి.సుబ్బారావు తదితరులు ఉన్నారు.
దౌర్జన్య కాండను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ
తెలుగుదేశం పార్టీ అడ్డగోలు రాజకీయం, దౌర్జన్యకాండను వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాలతో పాటు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు తరలి వచ్చారు. బ్యాంకులోకి ఎవ్వరిని వెళ్లనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బ్యాంకులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అప్పిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలతో వాదనకు దిగారు. అనంతరం బ్యాంకులోకి వెళ్ళి ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలా అడ్డుకునే ధోరణి సరి కాదని, ఈ విధంగావ్యవహరిస్తే తాము న్యాయ పోరాటం చేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, అంగడి శ్రీనివాస్, గులాం రసూల్, జగన్ కోటి, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆరుమండ్ల కొండారెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దాసరి కిరణ్, అంగడి శ్రీనివాసరావు, దుగ్గింపూడి యోగేశ్వరెడ్డి, కె.ప్రేమ్‌కుమార్, మొహమూద్, బడావీరు నాగరాజు, తోట మణికంఠ, కీసర వెంకటసుబ్బారెడ్డి, మేరుగ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, గనిక జాన్సీరాణీ, నిమ్మరాజు శారదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement