మొలకెత్తని ఆశలు | Hopes to germinate | Sakshi
Sakshi News home page

మొలకెత్తని ఆశలు

Published Fri, Jul 18 2014 1:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మొలకెత్తని ఆశలు - Sakshi

మొలకెత్తని ఆశలు

  • రైతులను నిండా ముంచిన ఏపీ సీడ్స్ వరి విత్తనాలు
  •   మళ్లీ నారుమడులు పోయాల్సిందే
  •   అన్నదాతలకు అదనపు భారం
  • అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు) : వ్యవసాయ అధికారులు సబ్సిడీపై పంపిణీచేసిన ‘ఏపీ సీడ్స్’ వరి విత్తనాలు మొలకెత్తలేదు. నాసిరకం విత్తనాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు సహకార సంఘానికి తొలి విడతగా ఏసీ సీడ్స్ ద్వారా 10 టన్నులు, పెనుగంచిప్రోలు సహకార సంఘానికి 15 టన్నుల వరి విత్తనాలు వచ్చాయి. 25 కిలోల సంచులుగా ఈ విత్తనాలు సరఫరా చేశారు. కిలోకు రూ.5ల సబ్సిడీపై 25 కిలోల వరి విత్తనాల సంచిని రూ.562.50లకు రైతులకు అందజేశారు.

    ఈ విత్తనాలతో చాలా మంది రైతులు నారుమడులు పోసుకున్నారు. అయితే విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తలేదు. 80 శాతం మొలక వస్తేనే మంచి విత్తనాలుగా గుర్తిస్తారు. కొందరు రైతులు మండె కట్టి మొలకేస్తే కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే మొలకెత్తాయి. పెనుగంచిప్రోలు మండలంలోనే 40 మంది రైతులు నష్టపోయారు. నాసిరకం విత్తనాల కారణంగానే మొలకశాతం తగ్గిందని వారు ఆరోపించారు. మొలక శాతం తగ్గడంతో రైతులు సహకార సంఘాలకు తమ గోడు చెప్పుకున్నారు.

    సహకార సంఘాల బాధ్యులు వ్యవసాయాధికారులకు సమాచారం ఇచ్చారు. మొలక రాని ధాన్యం సంచులను రైతుల నుంచి తిరిగి తీసుకుని వేరే సంచులు ఇవ్వాలని వ్యవసాయాధికారులు చెప్పారని సొసైటీల పాలకులు పేర్కొంటున్నారు. అదును దాటిపోతుండటంతో చేసేది లేక రైతులు చాలామంది ప్రయివేటు డీలర్ల వద్ద నుంయి విత్తనాలు కొనుగోలు చేసి, మళ్లీ నారుమడులు పోసుకుంటున్నారు.

    దీని వల్ల పెట్టుబడుల మొత్తం పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రయివేటు డీలర్లను ప్రోత్సహించేందుకే ఏపీ సీడ్స్ అధికారులు నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో పంపిణీచేసిన జీలుగ, ఇప్పటి వరి విత్తనాలు నాసిరకమేనని పేర్కొంటున్నారు. ఈ నాసిరకం విత్తనాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
     
    150 మందికి నష్టం

    గుడ్లవల్లేరు : మండలంలోని వెణుతురుమిల్లి, కౌతవరం, పసుభొట్లపాలెం, పెసరమిల్లి ప్రాంతాల్లో దాదాపు 150మంది రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొని నారు పోసుకున్నారు. అయితే విత్తనాలు జల్లి రోజులు గడుస్తున్నా మొలక రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నారు మడి పోయాలంటే ఎకరానికి కనీసం రూ.1,500 ఖర్చవుతుందని, సాగు ఆరంభంలోనే నష్టపోయిమని  రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    గతంలోను ఇంతే
    ఏపీ సీడ్స్ వరి విత్తనాలను ఇంటి దగ్గర మండె కట్టాం. మొలక శాతం పూర్తిగా తగ్గింది. దీంతో విత్తనాలను తిరిగి బస్తాల్లో పట్టి సహకార సంఘానికి తరలించాం. కొందరు రైతులు విత్తనాలను పొలంలో చల్లారు. వారికి బాగా నష్టం వచ్చింది. గతంలో కూడా నాసిరకం విత్తనాలు రైతులను ముంచాయి.
     - గంగూరి కోటేశ్వరరావు, రైతు, అనిగండ్లపాడు
     
    12రోజులైనా మొలకలేదు...
    1232వరి రకం విత్తనం వేసి, 12రోజులైంది. అయినా పెద్దగా మొలక రాలేదు. మామూలుగా నాలుగు రోజుల్లో మొలక వచ్చేస్తుంది. పక్కన ఉన్న చేలల్లో రెండు రోజుల వెనుక వేరే రకం వేసినా నూటికి నూరు శాతం బాగానే ఎదిగింది. దళారుల నియంత్రణ లేకే మాకు ఈ తిప్పలు.
    - పడమటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పెసరమిల్లి రైతు
     
     రైతుల నుంచి తిరిగి తీసుకుంటాం
     మొలక రాని విత్తనాల గురించి మాట్లాడగా ఏపీ సీడ్స్ కార్పోరేషన్ డీఎం వాటిని తిరిగి తీసుకోవాలని సూచించారు. కొన్ని లాటుల విత్తనాలే మొలకెత్తలేదు. తరువాత మరో వచ్చిన 15 టన్నులు బాగానే ఉన్నాయి. రైతులకు ఎటువంటి నష్టాన్ని కలుగనీయం. రైతులు చాలామంది విత్తనాల సంచులను తిరిగి ఇచ్చేశారు.
     - రామ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement