అధైర్యపడకండి | Annadataku vijayamma guarantee | Sakshi
Sakshi News home page

అధైర్యపడకండి

Published Mon, Oct 28 2013 12:53 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

Annadataku vijayamma guarantee

ప్రకృతి విలయంతో కుదేలైన అన్నదాతకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకునేవరకు రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను చూసి చలించిపోయారు. రైతులు విజయమ్మను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
 
సాక్షి, విజయవాడ : ‘అధైర్య పడకండి.. ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందేంత వరకు అండగా ఉంటాం’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆమె ఆదివారం పరిశీలించారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, గౌరవరం, చిల్లకల్లు, ముండ్లపాడు, నవాబుపేట, రాఘవాపురం గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టపోయిన పంటలను చూసి ఆమె చలించిపోయారు.

రైతులకు సాయం అందేంతవరకు ప్రభుత్వంతో పోరాడతానని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తారని అభయమిచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు రైతులు తమ గోడు చెప్పుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తమకు ఈ గతి పట్టేది కాదని వారు విజయమ్మకు చెప్పుకొన్నారు. మీరైనా తమకు సాయం చేయాలని వేడుకున్నారు. దీనికి చలించిపోయిన  విజయమ్మ మంచి రోజులు వస్తాయని... జగన్ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏ పనీ సరిగా చేయడంలేదని... ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బయటకు కాలు పెట్టడంలేదని విజయమ్మ ధ్వజమెత్తారు. కనీసం ఏరియల్ సర్వే చేయడానికి కూడా సీఎం రావడంలేదని విమర్శించారు.
 
బారులుతీరిన జనం...

విజయమ్మ వస్తున్న సమాచారం తెలుసుకున్న రైతులు, మహిళలు, అభిమానులు దారి పొడుగునా బారులతీరి నిలబడి ఆమెకు తమ కష్టాలు చెప్పుకున్నారు. పాడైపోయిన వరి పనలను, పత్తి గింజలను, మొక్కజొన్న కంకులను ఆమెకు చూపారు. పలు గ్రామాల నుండి మహిళలు ట్రాక్టర్లపై, ఆటోలపై పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది. పంట పొలాలను పరిశీలించిన ఆమె రైతులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కొందరు మహిళా రైతులు ఆమెను చూడగానే కంటతడి పెట్టి వారి బాధలు చెప్పుకొన్నారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షానికి పూర్తిగా తడిసిపాడైంది. కాయలు నల్లగా మారి కుళ్లటంతో పాటు మొక్కలొచ్చాయి.

ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెడితే వర్షం మా ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఒక మహిళ కౌలు రైతు తాను మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశానని... వర్షాల ధాటికి పంట పూర్తిగా దెబ్బతినిపోయిందని వాపోయారు. ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టి పంట కొద్దిరోజుల్లో చేతికి వచ్చే దశలో నష్టపోయామని విజయమ్మకు వివరించారు. ఇప్పుడు ఏంచేయాలమ్మా అంటూ గొల్లుమన్నారు.

ఇంత జరుగుతున్నా అధికారులు తమవైపు కన్నెత్తి కూడా చూడడంలేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని గురించి ఎవరూ పట్టించుకోలేదని ప్రతి ఒక్కరూ తమ ఆవేదన విజయమ్మకు వివరించారు. ఇంత నష్టం జరిగాక ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మీరైనా ఆదుకోవాలని చేతులు జోడించి విజయమ్మకు విన్నవించారు.

 ఎవరూ రాలేదు మీరే వచ్చారు...  జగన్ సీఎం కావాలి...

 ‘ఇంత నష్టం జరిగి కష్టంలో ఉన్నా మమ్మల్ని కన్నెత్తి చూసినవారు లేరు... మీరే మా కోసం వచ్చారు’ అంటూ రైతులు విజయమ్మతో చెప్పారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు ఎటెళ్లిపోయారోనని రైతులు తీవ్రంగా విమర్శించారు. రాజన్న పాలన రావాలన్నా, తమ కష్టాలు తొలగాలన్నా, జగన్ సీఎం కావాలని వారు ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement