జిల్లాలో ఏయేటికాయేడు వ్యవసాయ సంక్షోభం రైతుల్ని పట్టిపీడిస్తోంది. వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా వాటి అమలులో ప్రభుత్వం
=గిట్టుబాటు కాని ధరలు
= భారంగా మారుతున్న పెట్టుబడులు
=అమలుకు నోచని పాలకుల హామీలు
=అప్పులపాలవుతున్న అన్నదాత
= దిక్కుతోచని స్థితిలో కాడి వదిలేస్తున్న రైతన్న
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏయేటికాయేడు వ్యవసాయ సంక్షోభం రైతుల్ని పట్టిపీడిస్తోంది. వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు వ్యవసాయానికిచ్చే ప్రోత్సాహకాలు.. నూటికి 65 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడే మన దేశంలో లేకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.
నానాటికీ పెరుగుతున్న కూలీల ఖర్చులు రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే యంత్రపరికరాలతో సాగుచేద్దామంటే వాటని బినామీల పేరిట రాజకీయ నేతలు నొక్కేస్తున్నారు. ఎరువుల ధరలు పెరగడంతోపాటు తెగుళ్లు సోకిన పంట దిగుబడులు నాణ్యత లేక గిట్టుబాటు ధర రావడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటల్ని తుపానులు పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతులు, కౌలుదారులకు వ్యవసాయమంటే కత్తిమీద సాములా మారింది.
ఈ దశలో కొందరు రైతులు నేలతల్లికి నీళ్లొదిలి ఉన్న ఊళ్లోనే ఇతర రంగాల వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు పొరుగు ప్రాంతాలకు వలసపోతున్నారు. సాగులో దెబ్బతిన్న రైతుల్ని ప్రభుత్వం గుర్తించి, వారికి సాయం అందిస్తే కొంతమేరకైనా వలసలు తగ్గుతాయని బాధిత రైతులు అంటున్నారు. ఇంకా వారేమంటున్నారో వారి మాటల్లోనే విందాం..
మూడు లక్షల అప్పు మిగిలింది..
పదెకరాల పొలాన్ని నాలుగేళ్లుగా కౌలుకు చేస్తే రూ.3 లక్షల అప్పు తేలింది. ఏటా వచ్చే తుపానులకు ఖరీఫ్‌లో పంట మునగడంతో అన్నీ అప్పులే మిగిలాయి. ఇక వ్యవసాయం జోలికి పోకూడదని నిర్ణయించుకున్నా. ఆటో డ్రైవర్‌గా జీవనం ప్రారంభించా. రోజుకు రూ.700 సంపాదిస్తున్నా. అందులో రూ.300 ఆటోకు అద్దె కడుతున్నా. కడుపులో నీళ్లు కదలడం లేదు.
- నందం శ్రీనివాసరావు, ఆటో డ్రైవర్, సింగలూరు
ఆయిల్ ఇంజిన్లు పెడుతున్నా..
గతంలో నేను 45 ఎకరాలు కౌలుకు చేసేవాడిని. మొదట్లో వ్యవసాయంలో అప్పులే ఉండేవి కావు. ఆ తర్వాత రూ.6 లక్షల వరకు అప్పుపడ్డా. సొంత పొలం 1.5 ఎకరాలు, ట్రాక్టర్‌ను అమ్మేసి ఉన్న అప్పులు తీర్చేశాను. మిగిలిన డబ్బుతో ఇంజిన్లు కొన్నాను. ప్రస్తుతం సార్వా, దాళ్వాలో పొలాలతో పాటు చేపల చెరువులకు కూడా ఆయిల్ ఇంజిన్లు పెడుతున్నా.
- అంగడాల వీరప్రసాదరావు, వడ్లమన్నాడు, ఆయిల్ ఇంజిన్ల సప్లయర్
రాజకీయ నేతలకే సబ్సిడీలు..
కౌలు చేసే రైతులకు పంట రుణాలు ఇచ్చేవారే కరువయ్యారు. 50 ఎకరాలు చేసేవాడిని. లంచాలకు మరిగిన అధికారులు రుణాలు, సబ్సిడీలను రాజకీయ నేతలకే ఇస్తున్నారు. ఎరువుల ధరలు పెరిగాయి. సాగుకు రూ.50 లక్షల అప్పు కావడంతో మూడు ఎకరాలు విక్రయించి రెండేళ్లుగా వ్యవసాయానికి దూరమయ్యా. ప్రస్తుతం ట్రాక్టర్‌పైనే ఆధారపడ్డాను.
- శేషం వెంకటేశ్వరరావు, వడ్లమన్నాడు, ట్రాక్టర్ యజమాని
రైతుకూలీనయ్యా..
రాజకీయ నేతలు మాత్రం రైతే రాజు అని అంటారు. కాని నా వంటి బక్క రైతులంతా కూలీలయ్యారు. 12 ఎకరాలు కట్టుబడికి చేశా. మొదటి ఐదేళ్ల పాటు బాగానే ఉంది. సాగును నమ్ముకుని రూ.1.75 లక్షల అప్పులపాలయ్యా. సొంత పొలంలో కొంత భాగాన్ని అమ్మేసి రుణాలు చెల్లించేశా. వ్యవసాయం చేయలేక ఉన్న పొలం 1.75 ఎకరాలను కౌలుకు ఇచ్చేశా. కూలీగా అవతారమెత్తా.
- చింతపల్లి లక్ష్మారెడ్డి, డోకిపర్రు, కూలీ
సాగు భారమైంది...
ఐదెకరాల సొంత పొలంతోపాటు 15 ఎకరాలు కట్టుబడికి 20 ఏళ్లుగా సాగు చేశా. ఎరువులు, పురుగుమందుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి సాగు భారమైంది. తలకు మించిన అప్పులు మిగిలాయి. ఐదెకరాలతో పాటు తిండి పెట్టే ఎడ్లబండి కూడా అమ్మేశా. నాలుగేళ్లుగా వ్యవసాయం మానేసి తాపీమేస్త్రిగా స్థిరపడ్డా. ఇంకా సాగు తాలూకు రూ.30 వేల అప్పు ఉంది.
- కొండేటి వెంకటస్వామి, డోకిపర్రు, తాపీమేస్త్రి
పాడిని నమ్ముకున్నా..
వడ్లమన్నాడు మురుగుకాల్వ వర్షాలకు పొంగుతుండడంతో ప్రతి సార్వాలో పంటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. పంట మునకబారిన పడడంతో మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరూ కొనక ఉన్న ఎనిమిది ఎకరాల్లో నాలుగు ఎకరాల్ని వేరే వారికి కౌలుకు ఇచ్చేశా. మరో నాలుగు ఎకరాలను అమ్మేసి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేశా. సాగుబాధ పడలేక రెండు పాడిగేదెలు పెంచుతున్నా.
- దిమ్మెట నాంచారయ్య, వడ్లమన్నాడు, పాడి రైతు
మెకానిక్‌గా మారా..
ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు చేతికి వచ్చే సమయానికి వడ్లమన్నాడు డ్రెయిన్ పొంగిపోయి ముంచెత్తింది. పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఐదేళ్ల పాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు చేస్తే రూ.1.80 లక్షలు నష్టపోయా. మూడేళ్లగా వ్యవసాయం మానేశా. ఇంట్లో వయసు మీద పడిన తల్లిదండ్రులున్నారు. కుటుంబ పోషణకు పవర్ స్ప్రేయర్లు, బైక్‌లు బాగు చేసుకుంటున్నాను.
- షేక్ దాదా, డోకిపర్రు, మెకానిక్
రెండేళ్లుగా పంక్చర్లు వేసుకుంటున్నా..
రూ.400 ఉండే యూరియా కట్ట ప్రస్తుతం రూ.1600కు పెరిగింది. నాలాంటి చిన్న రైతులు సాగు చేయాలంటే ప్రభుత్వ చేయూత అంతంతమాత్రమే. 11 ఏళ్లుగా మూడెకరాలు కౌలుకు చేస్తే రూ.70 వేలు నష్టం వచ్చింది. వ్యవసాయం వదిలేసి రెండేళ్లవుతోంది. బైక్‌లు, సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ కాలం గడుపుతున్నా.
- ఇలియాస్ బేగ్, డోకిపర్రు, పంక్చర్ల మేస్త్రి