అన్నదాతల ఇళ్లలో చావుడప్పు! | resistant thoughts farmers CM Chandra Babu | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!

Published Tue, Dec 2 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!

అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!

  • టీడీపీ హయాంలో ఇదో పరంపర
  •  ఈ ఆర్నెల్ల కాలంలో 86 మంది రైతుల బలవన్మరణం
  •  రైతుల గోడు పట్టని సీఎం చంద్రబాబు
  •  ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత
  •  అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు
  •  రైతుల ఖాతాలు తగ్గించడానికే ఆర్నెల్లూ కసరత్తు
  •  రుణ భారంతో పాటు, అపరాధ వడ్డీ భారం కూడా తోడై మరింత కుంగిపోతున్న అన్నదాత
  •  ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది బలవన్మరణం.. కర్నూలు జిల్లాలో 33 మంది
  •  ప్రాణాలు వదులుతున్న రైతుల్లో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతులే
  • సాక్షి, హైదరాబాద్: బంగరు భూమిలో విషాదం చిమ్ముతోంది. పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వం హామీలు అమలు కాక, కాలం కలిసి రాక రైతన్న కుదేలవుతున్నాడు. రుణాలు మాఫీ చేస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశలు అడియాశలై, కుప్పలా పేరుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నాడు. ఇల్లాలి పుస్తెలమ్మి పంట కోసం తెచ్చుకున్న పురుగుమందు తాగో, సద్దిమూట తగిలించాల్సిన చెట్టు కొమ్మకు ఉరేసుకొనో బలవన్మరణం పొందుతున్నాడు. మరికొందరు గుండె పగిలి మరణిస్తున్నారు.

    అన్నదాతకు అండగా నిలిచి, సిరులు పండించేలా చేయూతనివ్వాల్సిన సర్కారు.. రైతన్న బలవన్మరణం పొందుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగన్న సిద్ధాంతంతో దేశదేశాలు తిరిగొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక్కడి రైతుల గోడు మాత్రం వినిపించడంలేదు. అధికారం కోసం పాదయాత్రలు చేసి, అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఈ ఆర్నెల్లలో రైతన్న కష్టాలను మరింతగా పెంచారు.

    ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అందుకే అధికారంలోకి రాగా నే రైతుల రుణాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేస్తానన్న బాబు.. అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. తొలి సంతకం అంటూ హడావుడి చేసి రుణమాఫీని మసిపూసి మారేడు కాయ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 87,612 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయకపోగా, వారి ఖాతాలను తగ్గించడంలోనే ఆరు నెలలు సాగదీశారు. దాని పర్యవసానాలను రైతులు ఎదుర్కొంటున్నారు.

    అప్పులు తీరుతాయని, కొంతలో కొంతైనా భారం తగ్గుతుందని భావించిన రైతాంగానికి, రుణ భారంతో పాటు దానికిప్పుడు అపరాధ వడ్డీ భారం కూడా తోడైంది. మరో వైపు సీజన్ సరిగా లేక , భారంగా మారిన అప్పులు, వడ్డీల సంగతేంటో రైతులు మరింతగా కుంగిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 86 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని రాజకీయపార్టీలు చెబుతున్నాయి.

    అసలే కరువు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమ జిల్లాల్లో ఈసారి వ్యవసాయదారులకు మరిన్ని ఇబ్బం దులు తలెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 60కంటే ఎక్కువేనని జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు అంటున్నాయి. కర్నూలు జిల్లాలోనూ 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

    ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడటం రైతుల దయనీయస్థితిని తెలియజేస్తోందని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమలోనే కాదు.. ఇంతో అంతో సేద్యం చేయడానికి వీలున్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఇద్దరు రైతులు మరణించారు. పంట నష్టపోయి, అప్పు ఎలా తీర్చాలో తెలియక గుండెచెదిరి కన్నుమూశారు.

    దక్షిణాది ధాన్యాగారంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. నేల రాలుతున్న వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారు, సన్న, చిన్నకారు రైతులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ప్రకటించుకున్న చం ద్రబాబు ఇంతవరకు రైతన్నల ఆత్మహత్యలను మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ఏ ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదు. చిల్లి ఏగాణి సాయం ప్రకటించలేదు సరికదా.. ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అని ప్రశ్నిస్తున్నారు.
     
    ఎరువుల ధరలపై నోరెత్తరేం?

    ముఖేష్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా గ్యాస్ ధరను సవరించేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు, ఆయన మిత్రబృందం.. కరెంటు చార్జీలు రెట్టింపు అయినా, ఎరువుల ధర పెరిగినా కిమ్మనరు. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు సొంత పొలంలోనే రైతులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలసపోతున్నా పట్టించుకోరు. రైతన్నను సంపన్నుణ్ణి చేస్తామం టూ మాటలతో సరిపెడతారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నే కిందిస్థాయిలో ఉన్న రైతుకు అం దించలేని పాలకులు.. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని నమ్మబలుకుతూ రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు.
     
    సబ్సిడీలకు ఎగనామం పెట్టేందుకే..

    గ్రామీణ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ కొద్దికాలం చెప్పిన మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి సరిపోతాయని చెప్పొచ్చు. ‘కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ రైతు గ్రూపులను ఏర్పాటు చేస్తాడు. వరి, రాగి, మిర్చి, పత్తి ఎలా పండించాలో వ్యవసాయంలో అప్పటికే ఆరితేరిన వారికి సలహాలు ఇస్తాడు. పాఠాలు చెప్తాడు. రైతులకిచ్చే కోట్లాది రూపాయల సబ్సిడీలను బొక్కేందుకు కార్పొరేట్ కంపెనీలు పన్నిన పన్నాగం ఇది’ అంటారు సాయినాధ్. చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కార్పొరేట్లకు వంత పాడి, కర్షకుల కడుపు కొడుతున్నారు. అందుకే రైతు ఆత్మహత్యల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడంలేదు.
     
    ప్రభుత్వం ఇప్పటికైనా...

    ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పెరిగిన సాగుబడి వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న రైతుకు పెట్టుబడి రాయితీ కల్పించాలి. రైతులకు అండగా నిలిచేలా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. సబ్సిడీలను పెంచాలి. సాగు మెళకువల్ని పెంచేలా పరిశోధనలు జరగాలి. రుణ ప్రణాళికను ప్రకటించి, వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంపొందించాలి. అప్పుడే రైతుకు భరోసా కలిగి, ఆత్మహత్యల్ని నివారించగలుగుతాము.
     
    గతంలో బాబు హయాంలో 11,952 మంది ఆత్మహత్యలు..

    చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. సాక్షాత్తు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 11,952 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశంలో రోజుకు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తుంటే, రాష్ట్రంలో ఆ సంఖ్య 375 మందికి చేరింది. ‘సాక్షి నెట్‌వర్క్’ పరిశీలన ప్రకారం చంద్రబాబు అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 86కు చేరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది జగద్విదితం. రుణ మాఫీపై గంపెడాశలు పెట్టుకున్న రైతాంగం, ఆ హామీ వమ్మయినట్లేనని నిర్ధారణకు వచ్చి, నిస్పృహకు లోనై ఆత్మహత్యల వైపు అడుగు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
     
    హక్కుల వేదిక డిమాండ్ ఇది..

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ చేసిన మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) సమగ్ర రుణ ప్రణాళికను ప్రకటించాలని ఉభయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై హెచ్‌ఆర్‌ఎఫ్ సోమవారమిక్కడ ఓ ప్రకటన చేసింది. ‘చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు. ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 910 మంది చనిపోయారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం వల్ల అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అమలు చేయాల్సిన జీవో 421 ని కూడా అమలు చేయడంలేదు. ప్రతి కుటుంబానికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలి. ప్రస్తుతం ఇస్తున్న లక్షన్నరను రూ.5 లక్షలకు పెంచాలి’ అని వేదిక ప్రతినిధులు వీఎస్ కృష్ణ, ఎ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement