‘మాఫీ‘కి మరో కొర్రీ | "Another korri maphiki | Sakshi
Sakshi News home page

‘మాఫీ‘కి మరో కొర్రీ

Published Fri, Sep 5 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

"Another korri maphiki

  •      భారాన్ని తప్పించుకునేందుకు ఉత్తర్వుల పరంపర
  •      తాజా జీవోతో రైతులపై 9 నెలల వడ్డీ భారం
  •      స్పష్టత కొరవడిన ప్రభుత్వ వైఖరిపై రైతాంగం ఆందోళన
  • విశాఖ రూరల్ :  రుణమాఫీ ఎప్పటికి జరుగుతుందో తెలియక సతమతమవుతుండగా.. తాజాగా వడ్డీ భారం రైతాంగం వెన్ను విరవనుంది. ఎన్నికలకు ముందు అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.

    రుణమాఫీ భారాన్ని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వుల మీద ఉత్తర్వులు జారీ చేస్తూ మాఫీ ప్రక్రియకు కొర్రీలు వేస్తోంది. తాజా ఉత్తర్వుల కారణంగా జిల్లా రైతులపై తొమ్మిది నెలల వడ్డీ భారం రూ.122 కోట్ల వరకూ పడనుంది. దీంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. రుణమాఫీపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విభిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి.

    గత నెలలో రుణమాఫీపై 174 జీవో జారీ  చేస్తూ మార్చి 31, 2014కి ముందు రుణం తీసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జీవోను అమలు చేయకుండా తాజాగా ప్రభుత్వం సోమవారం 181 జీవో జారీచేసింది. దీని ప్రకారం డిసెంబర్ 31, 2013 నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.1.50 లక్షలు మాత్రమే ఒక్కో కుటుంబానికి మాఫీ జరగనుంది. డిసెంబర్ 31 తరువాత ఆ రుణంపై వడ్డీని రైతులే భరించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం.  
     
    వడ్డీ బాదుడు..
     
    బ్యాంకర్లు ఏడు శాతం వడ్డీపై రైతులకు పంట రుణాలిస్తున్నారు. రూ.లక్షలోపు రుణాలు వడ్డీ లేకుండా.. రూ.3 లక్షల వరకు రుణాలపై పావలా వడ్డీని ప్రభుత్వం వర్తింపచేస్తోంది. వాయిదాలోపు రుణాలు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు నిర్ణీత గడువులోగా రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు 11.75 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల వల్ల తొమ్మిది నెలల వడ్డీ రైతుల భరించాల్సి వస్తోంది. జిల్లాలో రైతులు రూ.1,040 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం తాజా మెలిక వల్ల రైతులపై రూ.122 కోట్ల వరకు వడ్డీ భారం పడనుంది.
     
    కొరవడిన స్పష్టత
     
    పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం తేల్చడం లేదు. ఎప్పటిలోగా మాఫీ చేస్తామన్నది చెప్పడం లేదు. ఫలితంగా బ్యాంకర్లు  కొత్తగా పంట, డ్వాక్రా రుణాలు మంజూరు చేయడం లేదు. రుణమాఫీ కోసం మార్గదర్శకాలను జారీచేసిన ప్రభుత్వం.. వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తయారు చేసి రైతుల వివరాలను అందజేయాలని పేర్కొంది. వాస్తవానికి గత నెల 25లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

    ఆర్‌బీఐ నుంచి గాని, బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి గానీ ఆదేశాలు రాకపోవడంతో రైతుల వివరాలను స్వీకరించలేమని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సిద్ధం కాలేదు. తాజాగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతుల నుంచి వివరాలను సేకరించాలని సూచించారు. ఎప్పటిలోగా రుణమాఫీని వర్తింపచేస్తామన్న అంశంపై ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో వడ్డీ భారం ఎక్కువవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement