
పంజాబ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు!
Comments
Please login to add a commentAdd a comment