మహిళల వడ్డీ మేమే కడతాం
ఏపీ సీఎం చంద్రబాబు
రుణాల మాఫీపై సీఎం బాబును నిలదీసిన మహిళలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళల రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం ఆయన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పతివాడపాలెం పంచాయతీ పిసిని గ్రామంలో మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు ఆయన్ని నిలదీశారు. రుణ మాఫీ నిబంధనల వల్ల తాము పొదుపు చేసుకున్న డబ్బును బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారని మహిళలు చెప్పారు.
ఇప్పటికీ రుణాలు మాఫీ కాకపోవడంవల్ల తమపై వడ్డీ భారం పడుతోందని తెలిపారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ఇకపై మహిళలపై పడే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన నెలివాడలో మహిళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన స్వయం సహాయక సంఘాల జిల్లా స్థాయి అవగాహన సదస్సులో కూడా మహిళలకు ఇదే హామీ ఇచ్చారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారికి ఆదాయం పెంచే మార్గాల్ని తానే చెబుతానని అన్నారు.
ఆర్థిక అంశాల విషయంలో వరల్డ్ బ్యాంకు కన్సల్టెన్సీలకన్నా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల సభ్యులే మిన్న అని కొనియాడారు. అప్పు చేయకుండా, వడ్డీ లేకుండా రుణం పుట్టేలా, మహిళలే బ్యాంకులు నిర్వహించుకునేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం వల్ల 26 శాతమే ఆదాయం వస్తోందని, సేవా రంగంలో అంతకంటే ఎక్కువ వస్తుందని తెలిపారు. బెల్ట్ షాపులపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో తాను అనుకున్నది జరగలేదని, ఇప్పుడు చేసి చూపిస్తానని చెప్పారు. మంచి నీటి కోసం ప్రత్యేక గ్రిడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయసమ్మతంగా అర్హులకు పింఛన్లు అందేందుకు కమిటీలు వేస్తున్నట్టు తెలిపారు. పదేళ్లలో అన్ని గ్రామాల్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రూ.2.5 లక్షల మేర 100 రకాల సేవలందిస్తామని చెప్పారు.
లాభార్జనే కాదు.. సామాజిక సేవ చేయండి
పారిశ్రామికవేత్తలు లాభార్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక సేవపై దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. రణస్థలం సమీపంలోని దేరసాంలో వీకేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు.