=పకృతి విపత్తులతో తప్పని తిప్పలు
=పెరుగుతున్న రుణ భారంతో అవస్థలు
=రాబడి తగ్గి, ఖర్చు పెరిగి బెంబేలు
గాదుల్లో ధాన్యానికి బదులు బతుకుల్లో దైన్యం కదలాడుతోంది. ఇళ్లల్లో సిరులకు బదులు కళ్లలో దిగులు కనిపిస్తోంది. పదిమందికి కడుపు నింపే తృప్తితో బతికే రైతన్నకు కడుపు కాలే పరిస్థితి ఎదురవుతోంది. కాడి పట్టి లోకానికి పిడికెడు మెతుకులు పెట్టాల్సిన కర్షకుడు పుట్టెడు కష్టంలో విలవిలలాడాల్సి వస్తోంది. అక్షయంగా పంటలు పండించే అన్నదాత అప్పుల కోసం పరుగులు తీయాల్సి వస్తోంది.
యలమంచిలి, న్యూస్‌లైన్: అన్నదాతలు అప్పుల తిప్పలు పడుతున్నారు. తమ చేతుల్లో సాగయిన పంటను పదిమందికీ పెట్టాల్సిన వారు ఆహార ధాన్యా ల కోసం దేవులాడుతున్నారు. ధాన్యరాశుల మధ్య కాలం గడపాల్సిన వారు సాయం కో సం దీనంగా చూస్తున్నారు. సేద్యం అప్పుల ను మిగిలిస్తూ ఉండడంతో చేయూత కోసం అలమటిస్తున్నారు. ఏడాదంతా చెమటోడ్చి కష్టపడుతున్న రైతులు బ్యాంకులు, వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక మొహం చాటేసే అవమానానికి సిద్ధపడుతున్నారు. ఏటా ప్రకృతివైపరీత్యాలు, తుఫా న్లు రైతులకు తీవ్రనష్టాలను చవిచూపిస్తున్నాయి. పరిహారం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పెరిగిన కూలి ధరలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు రైతులకు గుదిబండగా మారాయి. పండించిన పం టలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఏ ఏటికాయేడు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు.
వెంటాడుతున్న అప్పులు...
జిల్లా రైతులను ఏళ్ల తరబడి అప్పులు వెంటాడుతున్నాయి. ఏటా తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీ చెల్లించలేని దుస్థితి నెలకొంది. రైతులకు కొత్త అప్పులు ఇచ్చేవాళ్లు లేకపోవడంతో ఇంట్లో ఆభరణాలను కుదువ పెట్టి, భూములను తనఖా పెట్టి కొత్త అప్పుల గండంనుంచి గట్టెక్కుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 600 కోట్ల రుణాలు ఇచ్చామంటున్న అధికార యంత్రాంగం కొత్త రైతులకు రుణాలు ఇచ్చి న దాఖలాలు కనిపించలేదు. జిల్లాలో 50 వేల మంది కౌలు రైతులు ఉండగా 3341మందికి మాత్రమే రుణ అర్హత కార్డు లు మంజూరుచేసి కేవలం 41మంది మాత్రమే రుణాలు పం పిణీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జాతీయ వ్యవసాయ బీమా పథకంలో కూడా సవాలక్ష నిబంధనలతో పలువురు రైతులు బీమా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.
గిట్టుబాటేదీ?
నాలుగేళ్లనుంచి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లతో ముంపుకు గురవుతుండడంతో పంటల దిగుబడితోపాటు నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా వరిపంట ముంపువల్ల ధాన్యం రంగు మారుతోంది. ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడంతో రైతులు తక్కువధరలకు మిల్లర్లకు ధాన్యం అమ్ముకోవలసి వస్తోంది. చెరుకు మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఈఏడాది అల్పపీడనం, తుఫాన్లతో పలు ప్రాంతాల్లో ఎకరాకు కనీసం 10 టన్నుల చెరుకు దిగుబడి రాని పరిస్థితులు ఉన్నాయి.
అప్పుల ఊబిలో అన్నదాత
Published Sat, Nov 30 2013 12:49 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement