అనుమానాలొద్దు.. ‘టీ’ ఖాయం!: మన్మోహన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రధాని మన్మోహన్ భరోసా
దీక్ష వద్దంటే మహిళా మంత్రులపై దాడి చేయించారని సీఎంపై టీ నేతల ఫిర్యాదు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుంది. తెలంగాణపై మేమిచ్చిన హామీని నెరవేరుస్తాం. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు’.. ఇది బుధవారం ఢిల్లీలో తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన భరోసా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరిపై వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం అసెంబ్లీలో తీర్మానం చేశారని, సమైక్యాంధ్ర అంటూ ఢిల్లీలో దీక్ష చేశారని వారు ప్రధానికి వివరించారు. ఇకనైనా వెంటనే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షకు దిగొద్దని మంత్రివర్గ సహచరులే కోరితే పోలీసులతో వారిపై దాడి చేయించారని ఆరోపించారు. మహిళా మంత్రులనైనా చూడకుండా వారిపై అమానవీయంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్‌కుమార్, గీతారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్.రాజయ్య, సురేశ్ షేట్కార్, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు.