బీహార్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల దాదాపు160 మంది మరణించారని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆ వరదల వల్ల రాష్ట్రంలోని 20 జిల్లాలోని 5.5 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారని వివరించారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. అయితే వరద ప్రాంతాల్లో పునరవాస చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వరద నీరు గ్రామాల్లో ప్రవేశించడంతో వివిధ గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అలాగే వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గంగా, కోసి, గండక్, బుద్ది గండక్, సొని, బాగమతి నదులు ప్రమాద ఉధృతిని మించి ప్రవహిస్తున్నాయని ఆయన వివరించారు. ఆ నదుల ప్రవాహం మరి కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. దాంతో ఆ నదీ పరివాహాక ప్రాంతంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందస్తు చర్యల్లో భాగంగా తరలించినట్లు చెప్పారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించారు.