పునరావాస కేంద్రానికి తరలించిన తమకు నిత్యవసరాలు సరిగా ఇవ్వడంలేదంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చింతూరు, న్యూస్‌లైన్ : పునరావాస కేంద్రానికి తరలించిన తమకు నిత్యవసరాలు సరిగా ఇవ్వడంలేదంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి సోమవారం వరకు బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొంతమందికి బియ్యం ఇచ్చారని, తమకు ఇంతవరకు ఇవ్వకపోవడంతో పస్తులు ఉంటున్నామని బాధితులు వాపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పడు ఓ జాబితా తయారుచేసి ఓ ట్రస్ట్ ద్వారా అందించిన బియ్యాన్ని వారికి పంపిణీ చేశారు. అదికూడా రెండు కుటుంబాకు కలిపి ఒకే బ్యాగ్ ఇచ్చి పంచుకోవాలని చెప్పారని బాధితులు తెలిపారు. మూడు రోజుల క్రితం 5 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారని, మరలా ఇంతవరకు ఇవ్వలేదని, ఆ బియ్యంతో మూడు రోజుల పాటు ఎలా గడపాలని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూటూరు గ్రామం మూడురోజులుగా వరద ముంపులోనే ఉన్నా, అధికారులు గానీ, వైద్యసిబ్బంది గానీ, కన్నెత్తి చూడకపోవడంపై ముకునూరు సర్పంచ్ సవలం దారయ్య, చూటూరు గ్రామానికి చెందిన పాయం మల్లయ్యలు సెక్టోరియల్ అధికారి రహీంతో వాగ్వాదానికి దిగారు. అధికారులు చూటూరు గ్రామం రాని మాట వాస్తవమేనని, సోమవారం గ్రామానికి బియ్యం పంపించామని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు పునరావాస కేంద్రానికి తరలివచ్చిన వారికి మాత్రమే సాయం అందిస్తామని అధికారులు మెలిక పెడుతుండడంపై వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఎండీ మూసా, రామలింగారెడ్డి, సుధాకర్, ఆసిఫ్‌లు సెక్టోరియల్ అధికారిని నిలదీశారు. ఇళ్ల సమీపంలో వరదనీరు రావడంతో అనేకమంది ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారని, వారికి వరదసాయం ఇవ్వమనడం ఎంతవరకు సబబని నాయకులు ప్రశ్నించారు. ఇళ్లు ఖాళీ చేసిన ప్రతి ఒక్కరికీ వరదసాయం అందిస్తామని సెక్టోరియల్ అధికారి వారికి హామీనిచ్చారు. గోదాం ఇన్‌చార్జ్ రాకపోవడంతో ఇప్పటివరకు అధికారులు ఓ స్వఛ్చంధ సంస్థ అందించిన బియ్యాన్నే బాధితులకు సరఫరా చేస్తూ కాలంవెళ్లదీస్తున్నారు.