Bhadrachalam agnecy
-
అలర్ట్.. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.కాగా, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ఎగువన భారీ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల అవుతోంది.ఇక, క్రమంగా వరద నీరు వస్తుండటంతో 48 అడుగులకు నీటి మట్టం చేరితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు.. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరద ప్రవాహం కారణంగా పర్ణశాలలో నారా చీరల ప్రాంతం నీటి మునిగింది. -
రాములోరి క్షేత్రంలో నెత్తుటి వ్యాపారం
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీకి కేంద్రమైన భద్రాచలంలో రక్తపు వ్యాపారం జోరుగా సాగుతోంది. భద్రాద్రి రామయ్య క్షేత్రంలో కొందరు అనుమతుల్లేకుండా ల్యాబులు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం బ్లడ్‌బ్యాంక్ మూతపడడంతో ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు రక్తంతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. రోగుల అవ సరాన్ని ఆసరా చేసుకుని బాటిల్‌కు రూ. 3 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. భద్రాచలంలో 14 ల్యాబులు ఉండగా వీటిలో రక్తసేకరణ, నిల్వకు ఏ ఒక్క ల్యాబ్‌కూ అనుమతుల్లేవు. అయినా పట్టణంలోని రెండు ల్యాబుల్లో రక్తం సేకరణ, విక్రయాలు దర్జాగా సాగుతున్నట్లు ప్రచారం ఉంది. రక్త సేకరణ తర్వాత హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ టెస్టులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. భద్రాచలంలోని కొన్ని ప్రైవేటు ల్యాబుల్లో హెచ్‌సీవీ పరీక్ష అసలే జరగడం లేదని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలీసాటెస్టు చేస్తారు. కానీ ప్రైవేటు ల్యాబుల్లో ర్యాపిడ్ కిట్స్‌తో పరీక్షలు చేస్తుండడంతో రోగ నిర్ధారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తసేకరణ సమయంలో వివిధ పరీక్షల నిమిత్తం రూ.700, బాటిల్ ఖరీదు రూ.150, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బాటిల్ రక్త సేకరణకు సుమారు రూ. వెయ్యి ఖర్చవుతుంది. అవసరమైన రోగులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దీన్ని రూ. 850కు కొనుగోలు చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు మూతపడడంతో అక్రమార్కుల పంట పండినట్టయ్యింది. ఏజెన్సీలోని వివిధ మండలాల నుంచి ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి గర్భిణులకు దాదాపుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రమాదబారిన పడి వచ్చే వారికీ రక్తం అవసరం. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు అందుబాటులో లేకపోవడంతో కొత్తగూడెం, ఖమ్మం తదితర పట్టణాలకు వెళ్లలేక కొంతమంది రోగులు అనధికారికంగా నిర్వహిస్తున్న ల్యాబుల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రాన్ని వెంటనే తెరిపించి నిరుపేద రోగులకు ఆపన్న హస్తం అందించాలని పలువురు కోరుతున్నారు. రక్త పరీక్షల్లోనూ దోపిడీ భద్రాచలంలోని కొన్ని ల్యాబుల్లో నిర్వాహకులు రోగ నిర్ధారణ పరీక్షల్లోనూ అడ్డగోలుగా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ యంత్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులపై కాసుల వర్షం కురుస్తోంది. ప్లేట్లెట్స్ కౌంట్ రిపోర్టులు తప్పలతడకగా ఇస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. బస్టాండ్ ఎదుట, వెనుక ఉన్న రెండు ల్యాబుల్లో ఒకే వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు వేర్వేరుగా వచ్చినట్లు అప్పట్లో దుమారం లేచింది. ప్రభుత్వాస్పత్రిలో యంత్రం లేకపోవడం వల్లే ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆస్పత్రులకు అనుబంధంగానూ సొంతంగానూ ఏర్పాటు చేసుకుంటున్న ల్యాబులపై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సరైన తనిఖీ లేకపోవడంతో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ల్యాబుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. రక్తాన్ని సేకరిస్తే కఠిన చర్యలు: సురేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫెక్టర్ ప్రైవేటు ల్యాబుల్లో రక్తసేకరణ, విక్రయం నేరం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ల్యాబ్ నిర్వహణలో కొన్ని అంశాలనే మేము పరిశీలిస్తుంటాం. మిగతా అనుమతులన్నీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. -
మనుగడ ప్రశ్నార్థకం !
భద్రాచలం, న్యూస్‌లైన్: అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలతో ఒక వెలుగు వెలిగిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ)మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవులు అంతరించిపోతుండటంతో ఉత్పత్తుల సేకరణ ఆశించిన స్థాయిలో లేక ఆ శాఖాధికారులు ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ సంస్థ క్రమేణా గిరిజనులకు దూరమైపోతోంది. జిల్లాలో భద్రాచలం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ ద్వారా ఏడాదికి రూ. 35 కోట్ల మేర వ్యాపారం సాగుతుంది. ఎనిమిది బ్రాంచ్‌ల ద్వారా ఇందుకనుగుణంగా ఆ శాఖాధికారులు ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. గతంలో అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారానే ఏడాదికి రూ.5 కోట్లకు పైగా వ్యాపారం సాగేది. కానీ క్రమేపీ అవి తగ్గిపోతుండటంతో జీసీసీ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. గత ఏడాది రూ.3.50 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటకీ రూ.2.50 కోట్ల మేరకే చేరువయ్యారు. ఇలా భద్రాచలం డివిజన్ గత రెండేళ్లుగా లక్ష్య సాధనలో వెనుకబడుతోంది. ఆంధ్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మినహా మరే ప్రాంతంలోనూ అడవులు పెద్దగా కనిపించటం లేదు. పోడు భూముల సాగుతో అడవులు క్రమేపీ అంతరిస్తున్నాయి. దీంతో అటవీ ఉత్పత్తులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చీపుర్లు, చింతపిక్కలు, చిల్ల గింజలు, తేనె, విప్పపువ్వు, విప్పబద్ద, వెదురు, జిగురు, నరమామిడి చెక్క వంటి అటవీ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో ఒకప్పుడు సమృద్ధిగా దొరికేవి. ప్రస్తుతం విప్పపువ్వు, కొంతమేర జిగురు తప్ప మరే ఇతర వస్తువులూ లభించటం లేదు. జిగురు సేకరణలో ఒకప్పుడు భద్రాచలం డివిజన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం జిగురు ద్వారానే లభించేది. ప్రతి ఏటా 1000 క్వింటాళ్లకు పైగా జిగురు సేకరించేవారు. కాగా, గత ఏడాది ఇది 710 క్వింటాళ్లకు మించలేదు. ఈ ఏడాది ఇంకా తగ్గిపోయేలా కనిపిస్తోందని జీసీసీ అధికారులు చెపుతున్నారు. మొండి బకాయిలతో ఇబ్బందులు... డీఆర్ డిపోల ద్వారా గిరిజనులకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల విక్రయంతో పాటు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు నిత్యావసరాలను జీసీసీ ద్వారానే సర ఫరా చేస్తున్నారు. ఈ సరుకులకు ఐటీడీఏ సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. గత జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.3.75 కోట్ల మేర బకాయిలు ఐటీడీఏ నుంచి జీసీసీకి రావాల్సి ఉంది. అత్యధికంగా ఇల్లెందు బ్రాంచి పరిధిలో రూ.1.10 కోట్లు, భద్రాచలం బ్రాంచి పరిధిలో రూ. 63 లక్షలు, పాల్వంచ బ్రాంచి నుంచి రూ. 53 లక్షలు, దమ్మపేట బ్రాంచిలో రూ. 51 లక్షలు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం గిరిజన సహకార సంస్థ అధికారులు ఐటీ డీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. జీసీసీలకు వ్యాపారం చూపుతున్న ఐటీడీఏ పీవో కరుణించి బిల్లులు మంజూరు చేస్తే తప్ప వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో జీసీసీల నిర్వహణకు కొంత ఇబ్బంది కలుగుతోంది. రైతులకు రుణాలు బంద్.. గిరిజనులకు వ్యవసాయ, వ్యాపార అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ ద్వారా రుణాలు ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన అప్పు వసూలు చేయడంలో అప్పటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సంస్థ ఉన్నతాధికారలు ఇక రుణాలు ఇవ్వవద్దని తేల్చి చెప్పారు. 2007 నుంచి ఇప్పటి వరకు రుణ బకాయిలు రూ.50 లక్షల మేర వసూలు చేయాల్సి ఉంది. అయితే సంస్థ మనుగడ దృష్ట్యా ఈ ఏడాది రూ.32 లక్షల రుణాలివ్వాలని జీసీసీ అధికారులు ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించినా.. బకాయిల కారణంగా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. దీంతో అందుబాటులో ఉన్న నిధులతో స్థానిక అధికారులు ఇప్పటివరకు రూ.11 లక్షలు గిరిజనులకు రుణాలిచ్చారు. ఇంకా ఇవ్వాలనుకున్నా నిధులు లేవు. ఇలా గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన జీసీసీ ప్రస్తుతం వారికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. జీసీసీకి మాత్రం ఆర్థిక సహాయం అందించకపోవడం గమనార్హం. డీఆర్ డిపోలపైనే మనుగడ... అటవీ ఉత్పత్తులు తగ్గిపోవటంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు దృష్టి సారించారు. దీనిలో భాగంగా గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులను విక్రయించేందుకు వారికి అందుబాటులో ఉండే విధంగా జిల్లాలో 149 డీఆర్ డిపోలను ఏర్పాటు చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు నిత్యావసర సరుకులను ఈ కేంద్రాల ద్వారా బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే అందించేలా వీటిని ఏర్పాటు చేశారు. ఏడాదికి రూ.1.50 కోట్ల మేర వీటి ద్వారా వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఆశించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం వస్తుండటంతో దీనిపైనే ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్, ఎల్‌డబ్ల్యూఈఏ, ఆర్ఐడీఎఫ్ పథకాల కింద విడుదలైన రూ.4.99 కోట్లతో డీఆర్ డిపోల కోసం నూతన భవనాలు, గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇవి చాలా చోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారుల నిర్వాకంతో నిర్మించిన భవనాలు కూడా ఉపయోగపడటం లేదు. ఉన్నతాధికారులకు నివేదించాం గిరిజన సహకార సంస్థ ప్రస్తుతం డీఆర్‌డిపోల వ్యాపారంపైనే ఆధారపడిన మాట వాస్తవమే. అటవీ ఉత్పత్తులు ఆశించిన స్థాయి లో రావటం లేదు. అడవులు అంతరించిపోతుండడంతో ఇక భవిష్యత్‌లోనూ అవి లభించే పరిస్థితి లేదు. దీంతో సంస్థ మనుగడ కోసం సూపర్ మార్కెట్లను నెలకొల్పాలనే ఆలోచన ఉంది. ఉన్నతాధికారులకు దీనిపై నివేదించా ము. మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారిం చాము. సంస్థను కాపాడుకునేందుకు ఉద్యోగులు కూడా అంకిత భావంతో పనిచేయాలి. - రామస్వామి, జీసీసీ డివిజనల్ మేనేజర్ -
సకాలంలో వైద్యం అందక... నిండుగర్భిణి పరిస్థితి విషమం
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా...ఎన్ని నిధులు వెచ్చిస్తున్నా ఏజెన్సీ వాసులకు వైద్యం విషయంలో అన్యాయమే జరుగుతోంది. సకాలంలో సరైన వైద్యం అందక వారు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావనడానికి శనివారం ఓ గర్భిణి అనుభవించిన నరకయాతనే నిదర్శనం. ప్రసవం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు రోడ్డుమీదనే ఆమె మృతశిశువుకు జన్మనిచ్చిన సంఘటన పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. బాధితురాలి బంధువుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు...వాజేడు మండలం చింతూరు పంచాయతీ ధర్మారం గ్రామానికి చెందిన కావిరి అనూష అనే గర్భిణికి నెలలు నిండి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాన్పుకు తీసుకువెళ్లారు. అనూషను పరిశీలించిన వైద్యులు కాన్పు ఇక్కడ కష్టమని తెలపటంతో వాజేడు ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా వైద్యులు పరిశీలించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అనూషను తీసుకొని ఆమె భర్త సతీష్ శనివారం తెల్లవారుజామున 3గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. డ్యూటీలో ఉన్న వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించి స్కాన్ చేయించి కడుపులో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. అనూషకు కావల్సిన ఓ పాజిటివ్ రక్తం కూడా అందుబాటులో లేకపోవటంతో వైద్యులు ఆమెకు ఫీజిషియన్ సేవలు అవసరమని, ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ భర్త సతీష్‌కు సూచించారు. ఖమ్మం ఆసుపత్రికి వెళ్లటానికి డబ్బులు లేకపోవడంతో ఈ వైద్యశాలలోనే చికిత్స నిర్వహించాలంటూ అతను వైద్యులు, సిబ్బంది కాళ్లవేళ్లబడ్డాడు. అయినా సిబ్బంది ఇక్కడ చికిత్స నిర్వహించమని మీరు ఖమ్మం వెళ్లిపోవాలంటూ కనికరం లేకుండా సూటిపోటి మాటలతో వేధించారని సతీష్ ఆరోపించాడు. చేసేది లేక భార్యను ఖమ్మం తరలిద్దామని ఆటోమాట్లాడి ఎక్కించేసరికి ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. తిరిగి ఆస్పత్రిలోపలికి వెళదామని ఆటోదిగే ప్రయత్నంలో అనూష ఆస్పత్రి ఆరుబయట ప్రాంగణంలోనే మృతశిశువును ప్రసవించింది. వెంటనే బాధితురాలిని వైద్యులు తిరిగి ఆస్పత్రి లోపలికి తరలించి చికి త్స ప్రారంభించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉండటంతో బంధువులు ఆసుపత్రి గేటు ఎదురుగా మృతశిశువును ఉంచి ఆందోళన కు దిగారు. సమయానికి వైద్యం అందించకపోవటం వలనే అనూష పరిస్థితి విషమంగా మా రిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు అక్కడకు చేరుకొని వారికి మద్ద తు తెలిపాయి. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ ఎం అబ్బయ్య ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనూష పరిస్థితి విషమంగానే ఉందని మెరుగైన చికిత్సకు ఖమ్మం వైద్యశాలకు వెళ్లాలని ఆసుపత్రి అధికారులు మరలా సూచించారు. -
ఏజెన్సీకి మరో గండం
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ఏజెన్సీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్న గోదావరి వరద మరో మారు ఉప్పెనలా వస్తుండటంతో పరీవాహక ప్రాంత వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 5గంటలకు 36 అడుగుల నీటిమట్టం నమోదైంది. వాజేడు వద్ద 12 మీటర్లు నమోదుకావటంతో శనివారం నాటికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 4వతేదీన అత్యధికంగా 61.5 అడుగుల నీటిమట్టంతో ఉగ్ర రూపం దాల్చి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా శాంతించటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ గోదావరి నెమ్మదిగా పెరుగుతుండటంతో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 14 మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. పంట నష్టంతో పాటు, వంద కుపైగా ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్, ఆర్అండ్బీ తదితర శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. వరద ముంపు నుంచి బయట పడిన పరీవాహక ప్రజలు ఇంకా తేరుకోకముందే మరో ఉప్పెన వచ్చి పడుతుందని తెలియటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ ఒక్క నయాపైసా కూడా పరీహారం అందలేదు. కూలిన ఇళ్లకూ, వరద బాధితులకు కూడా తగిన రీతిలో సహాయం లేదు. మరో సారి గ్రామాలు ముంపునకు గుైరె తే పరిస్థితి ఏలా ఉంటుందోననే ఆందోళన అందరిలో ఉంది. 32 గ్రామాలకు నిలిచిన రాకపోకలు: వరద ఉధృతితో వాజేడు మండలంలోని 32 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ గురువారం సాయంత్రం 10 మీటర్లు ఉన్న నీటిమట్టం శుక్రవారం నాటికి 12 మీటర్లకు చేరింది. గోదావరి నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో రహదారులపైకి వరద నీరు చేరింది. వాజేడు - గుమ్మడి దొడ్డి, దూలాపురం- పాయబాటలు, కృష్ణాపురం- పేరూరు, పూసూరు- ఏడ్చర్ల పల్లి గ్రామాల మధ్య రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో మండల కేంద్రమైన వాజేడు నుంచి చీకుపల్లి అవతల ఉన్న 32 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లి వాగు వద్ద నాటుపడవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను అవతలి ఒడ్డుకు దాటిస్తున్నారు. రహదారులపైకి వరద నీరు చేరటంతో వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వరద నీరు ఇంకా పెరిగితే పంట పొలాలు మునిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఏజెన్సీ రైతుకు వరదకష్టాలు
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ రైతుపై ప్రకృతి పగపట్టింది...గోదావరి వరదలతో దెబ్బమీద దెబ్బ తగలడంతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతీ ఏటా వలెనే ఆగస్టులో గోదావరికి వరదలు వస్తాయని భావించిన ఈ ప్రాంత రైతులు ఈ ఏడాది ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగానే ఉపద్రవం ముంచు కురావడంతో భద్రాచలం డివిజన్లోని వాజేడు, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లో వేసిన వరి పంట, నాటేందుకు సిద్ధంగా ఉన్న వరి నారు పూర్తిగా నీటిముంపునకు గురయింది. అదే విధంగా భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పత్తి, మిరప పంటలు వే లాది ఎకరాల్లో నీటమునిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వరదలు రాగా పరీవాహక ప్రాంతంలో సుమారు 35 వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. గత వారం సంభవించిన వరద తగ్గుముఖం పట్టడంతో పాడైన పత్తి, మిర్చి మొక్కలను తీసి రైతులు మళ్లీ వాటి స్థానంలో కొత్తమొక్కలను వేశారు. ఇంతలోనే మరోసారి వరద ఉప్పెనలా వచ్చిపడటంతో మళ్లీ పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. మూడు రోజుల పాటు పూర్తిగా వరద నీటిలోనే ఉన్న పంటలు ఇక ఏమాత్రం పనికిరావని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 31 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పాథమిక అంచనా వేశారు. ఒక్క భద్రాచలం డివిజన్‌లోనే 20 వేల ఎకరాలకు పైగా పంట నష్టం ఉంటుందని రైతులు అంటున్నారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో సుమారు 4 వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. అదే విధంగా మణుగూరు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగినాయి. పినపాక మండలంలోని భూతిరావుపేట, చింతలబయ్యారం, రాయిగూడెం, ఏడూళ్ళ బయ్యారం గ్రామాలకు చెందిన సుమారు 2 వేల ఎకరాల పంట పోలాలు నీట మునిగాయి. అలాగే వేలేరుపాడు మండలంలో 6 వేల ఎకరాలకు పైగా పంట భూములు మునకకు గురయ్యాయి. రైతుల గోడు పట్టని ప్రభుత్వం: గోదావరి వరదలతో నష్టపోయిన రైతులకు భరోసా కరువవుతోంది. వేలాది రూపాయిల పెట్టుబడి పెట్టిన పంట కళ్ల ముందే పాడైపోవటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. పది రోజుల క్రితం వరద పరిస్థితిని చూసేందుకని వచ్చిన కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్ రైతులకు అపార నష్టం వాటిల్లిందని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 నుంచి 10 వేల వరకూ వెంటనే అందజేస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఆది ఆచరణకు నోచుకోలేదు. అధికారులు సైతం దీనిపై స్పష్టంగా చెప్పకపోవటంతో బాధిత రైతులు పరిహారం కోసం ఎదురు చూడాల్సివస్తోంది. ప్రస్తుతం గోదావరి వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో వరి, పత్తి పంటలు బాగా దెబ్బ తిన్నాయి. పత్తి పంట అయితే పూర్తిగా కుళ్లిపోయింది. పంట నష్టం సుమారుగా రూ. 13 కోట్ల వరకూ ఉండవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నట్లు ఓ వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. నీలం తుఫాన్ పరిహారమే రాలేదు.... ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం సకాలంలో అందటం లేదు. గత ఏడాది సంభవించిన నీలం తుపాను కారణంగా పాడైన పంటలకు ఇప్పటి వరకూ నష్ట పరిహారం చెల్లించలేదు. రూ.10.63 కోట్ల పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించినా ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. రైతుల అకౌంట్లలోనే జమ చేస్తామని సాకులు చూపించిన ప్రభుత్వం బాధిత రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ పరిహారం మాత్రం నేటికీ మంజూరు కాలేదు. 34,200 మంది బాధిత రైతులకు గాను 28,200ల మందికి చెందిన బ్యాంకు అకౌంట్లను తె రిపించి వారికి సంబంధించిన రూ.8.96 కోట్లను పంపకాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం డబ్బులు మంజూరు కాని పరిస్థితి ఉంది. ప్రస్తుత వరదలతో నష్టపోయిన పంటకు పరిహారం ఇంకెన్నాళ్లకు వస్తుందోననే రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఇబ్బందులను ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పునరావాసంలో ఆకలికేకలు
చింతూరు, న్యూస్‌లైన్ : పునరావాస కేంద్రానికి తరలించిన తమకు నిత్యవసరాలు సరిగా ఇవ్వడంలేదంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి సోమవారం వరకు బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొంతమందికి బియ్యం ఇచ్చారని, తమకు ఇంతవరకు ఇవ్వకపోవడంతో పస్తులు ఉంటున్నామని బాధితులు వాపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పడు ఓ జాబితా తయారుచేసి ఓ ట్రస్ట్ ద్వారా అందించిన బియ్యాన్ని వారికి పంపిణీ చేశారు. అదికూడా రెండు కుటుంబాకు కలిపి ఒకే బ్యాగ్ ఇచ్చి పంచుకోవాలని చెప్పారని బాధితులు తెలిపారు. మూడు రోజుల క్రితం 5 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారని, మరలా ఇంతవరకు ఇవ్వలేదని, ఆ బియ్యంతో మూడు రోజుల పాటు ఎలా గడపాలని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూటూరు గ్రామం మూడురోజులుగా వరద ముంపులోనే ఉన్నా, అధికారులు గానీ, వైద్యసిబ్బంది గానీ, కన్నెత్తి చూడకపోవడంపై ముకునూరు సర్పంచ్ సవలం దారయ్య, చూటూరు గ్రామానికి చెందిన పాయం మల్లయ్యలు సెక్టోరియల్ అధికారి రహీంతో వాగ్వాదానికి దిగారు. అధికారులు చూటూరు గ్రామం రాని మాట వాస్తవమేనని, సోమవారం గ్రామానికి బియ్యం పంపించామని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు పునరావాస కేంద్రానికి తరలివచ్చిన వారికి మాత్రమే సాయం అందిస్తామని అధికారులు మెలిక పెడుతుండడంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎండీ మూసా, రామలింగారెడ్డి, సుధాకర్, ఆసిఫ్‌లు సెక్టోరియల్ అధికారిని నిలదీశారు. ఇళ్ల సమీపంలో వరదనీరు రావడంతో అనేకమంది ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారని, వారికి వరదసాయం ఇవ్వమనడం ఎంతవరకు సబబని నాయకులు ప్రశ్నించారు. ఇళ్లు ఖాళీ చేసిన ప్రతి ఒక్కరికీ వరదసాయం అందిస్తామని సెక్టోరియల్ అధికారి వారికి హామీనిచ్చారు. గోదాం ఇన్చార్జ్ రాకపోవడంతో ఇప్పటివరకు అధికారులు ఓ స్వఛ్చంధ సంస్థ అందించిన బియ్యాన్నే బాధితులకు సరఫరా చేస్తూ కాలంవెళ్లదీస్తున్నారు.