రాములోరి క్షేత్రంలో నెత్తుటి వ్యాపారం
Published Wed, Dec 11 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీకి కేంద్రమైన భద్రాచలంలో రక్తపు వ్యాపారం జోరుగా సాగుతోంది. భద్రాద్రి రామయ్య క్షేత్రంలో కొందరు అనుమతుల్లేకుండా ల్యాబులు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం బ్లడ్‌బ్యాంక్ మూతపడడంతో ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు రక్తంతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. రోగుల అవ సరాన్ని ఆసరా చేసుకుని బాటిల్‌కు రూ. 3 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. భద్రాచలంలో 14 ల్యాబులు ఉండగా వీటిలో రక్తసేకరణ, నిల్వకు ఏ ఒక్క ల్యాబ్‌కూ అనుమతుల్లేవు. అయినా పట్టణంలోని రెండు ల్యాబుల్లో రక్తం సేకరణ, విక్రయాలు దర్జాగా సాగుతున్నట్లు ప్రచారం ఉంది. రక్త సేకరణ తర్వాత హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ టెస్టులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. భద్రాచలంలోని కొన్ని ప్రైవేటు ల్యాబుల్లో హెచ్‌సీవీ పరీక్ష అసలే జరగడం లేదని తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలీసాటెస్టు చేస్తారు. కానీ ప్రైవేటు ల్యాబుల్లో ర్యాపిడ్ కిట్స్‌తో పరీక్షలు చేస్తుండడంతో రోగ నిర్ధారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తసేకరణ సమయంలో వివిధ పరీక్షల నిమిత్తం రూ.700, బాటిల్ ఖరీదు రూ.150, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బాటిల్ రక్త సేకరణకు సుమారు రూ. వెయ్యి ఖర్చవుతుంది. అవసరమైన రోగులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దీన్ని రూ. 850కు కొనుగోలు చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు మూతపడడంతో అక్రమార్కుల పంట పండినట్టయ్యింది. ఏజెన్సీలోని వివిధ మండలాల నుంచి ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి గర్భిణులకు దాదాపుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రమాదబారిన పడి వచ్చే వారికీ రక్తం అవసరం. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంకు అందుబాటులో లేకపోవడంతో కొత్తగూడెం, ఖమ్మం తదితర పట్టణాలకు వెళ్లలేక కొంతమంది రోగులు అనధికారికంగా నిర్వహిస్తున్న ల్యాబుల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రాన్ని వెంటనే తెరిపించి నిరుపేద రోగులకు ఆపన్న హస్తం అందించాలని పలువురు కోరుతున్నారు.
రక్త పరీక్షల్లోనూ దోపిడీ
భద్రాచలంలోని కొన్ని ల్యాబుల్లో నిర్వాహకులు రోగ నిర్ధారణ పరీక్షల్లోనూ అడ్డగోలుగా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్ కౌంటింగ్ యంత్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులపై కాసుల వర్షం కురుస్తోంది. ప్లేట్‌లెట్స్ కౌంట్ రిపోర్టులు తప్పలతడకగా ఇస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. బస్టాండ్ ఎదుట, వెనుక ఉన్న రెండు ల్యాబుల్లో ఒకే వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు వేర్వేరుగా వచ్చినట్లు అప్పట్లో దుమారం లేచింది. ప్రభుత్వాస్పత్రిలో యంత్రం లేకపోవడం వల్లే ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆస్పత్రులకు అనుబంధంగానూ సొంతంగానూ ఏర్పాటు చేసుకుంటున్న ల్యాబులపై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సరైన తనిఖీ లేకపోవడంతో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్‌లెట్స్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ల్యాబుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.
రక్తాన్ని సేకరిస్తే కఠిన చర్యలు: సురేందర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఫెక్టర్
ప్రైవేటు ల్యాబుల్లో రక్తసేకరణ, విక్రయం నేరం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ల్యాబ్ నిర్వహణలో కొన్ని అంశాలనే మేము పరిశీలిస్తుంటాం. మిగతా అనుమతులన్నీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు.
Advertisement
Advertisement