ఏజెన్సీకి మరో గండం
Published Sat, Aug 17 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం ఏజెన్సీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్న గోదావరి వరద మరో మారు ఉప్పెనలా వస్తుండటంతో పరీవాహక ప్రాంత వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 5గంటలకు 36 అడుగుల నీటిమట్టం నమోదైంది. వాజేడు వద్ద 12 మీటర్లు నమోదుకావటంతో శనివారం నాటికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈనెల 4వతేదీన అత్యధికంగా 61.5 అడుగుల నీటిమట్టంతో ఉగ్ర రూపం దాల్చి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా శాంతించటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ గోదావరి నెమ్మదిగా పెరుగుతుండటంతో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 14 మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. పంట నష్టంతో పాటు, వంద కుపైగా ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. వరద ముంపు నుంచి బయట పడిన పరీవాహక ప్రజలు ఇంకా తేరుకోకముందే మరో ఉప్పెన వచ్చి పడుతుందని తెలియటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ ఒక్క నయాపైసా కూడా పరీహారం అందలేదు. కూలిన ఇళ్లకూ, వరద బాధితులకు కూడా తగిన రీతిలో సహాయం లేదు. మరో సారి గ్రామాలు ముంపునకు గుైరె తే పరిస్థితి ఏలా ఉంటుందోననే ఆందోళన అందరిలో ఉంది.
32 గ్రామాలకు నిలిచిన రాకపోకలు: వరద ఉధృతితో వాజేడు మండలంలోని 32 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ గురువారం సాయంత్రం 10 మీటర్లు ఉన్న నీటిమట్టం శుక్రవారం నాటికి 12 మీటర్లకు చేరింది. గోదావరి నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో రహదారులపైకి వరద నీరు చేరింది. వాజేడు - గుమ్మడి దొడ్డి, దూలాపురం- పాయబాటలు, కృష్ణాపురం- పేరూరు, పూసూరు- ఏడ్చర్ల పల్లి గ్రామాల మధ్య రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో మండల కేంద్రమైన వాజేడు నుంచి చీకుపల్లి అవతల ఉన్న 32 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లి వాగు వద్ద నాటుపడవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను అవతలి ఒడ్డుకు దాటిస్తున్నారు. రహదారులపైకి వరద నీరు చేరటంతో వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వరద నీరు ఇంకా పెరిగితే పంట పొలాలు మునిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement