భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా...ఎన్ని నిధులు వెచ్చిస్తున్నా ఏజెన్సీ వాసులకు వైద్యం విషయంలో అన్యాయమే జరుగుతోంది. సకాలంలో సరైన వైద్యం అందక వారు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావనడానికి శనివారం ఓ గర్భిణి అనుభవించిన నరకయాతనే నిదర్శనం. ప్రసవం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు రోడ్డుమీదనే ఆమె మృతశిశువుకు జన్మనిచ్చిన సంఘటన పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. బాధితురాలి బంధువుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు...వాజేడు మండలం చింతూరు పంచాయతీ ధర్మారం గ్రామానికి చెందిన కావిరి అనూష అనే గర్భిణికి నెలలు నిండి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాన్పుకు తీసుకువెళ్లారు.
అనూషను పరిశీలించిన వైద్యులు కాన్పు ఇక్కడ కష్టమని తెలపటంతో వాజేడు ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా వైద్యులు పరిశీలించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అనూషను తీసుకొని ఆమె భర్త సతీష్ శనివారం తెల్లవారుజామున 3గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. డ్యూటీలో ఉన్న వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించి స్కాన్ చేయించి కడుపులో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. అనూషకు కావల్సిన ఓ పాజిటివ్ రక్తం కూడా అందుబాటులో లేకపోవటంతో వైద్యులు ఆమెకు ఫీజిషియన్ సేవలు అవసరమని, ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ భర్త సతీష్‌కు సూచించారు.
ఖమ్మం ఆసుపత్రికి వెళ్లటానికి డబ్బులు లేకపోవడంతో ఈ వైద్యశాలలోనే చికిత్స నిర్వహించాలంటూ అతను వైద్యులు, సిబ్బంది కాళ్లవేళ్లబడ్డాడు. అయినా సిబ్బంది ఇక్కడ చికిత్స నిర్వహించమని మీరు ఖమ్మం వెళ్లిపోవాలంటూ కనికరం లేకుండా సూటిపోటి మాటలతో వేధించారని సతీష్ ఆరోపించాడు. చేసేది లేక భార్యను ఖమ్మం తరలిద్దామని ఆటోమాట్లాడి ఎక్కించేసరికి ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. తిరిగి ఆస్పత్రిలోపలికి వెళదామని ఆటోదిగే ప్రయత్నంలో అనూష ఆస్పత్రి ఆరుబయట ప్రాంగణంలోనే మృతశిశువును ప్రసవించింది. వెంటనే బాధితురాలిని వైద్యులు తిరిగి ఆస్పత్రి లోపలికి తరలించి చికి త్స ప్రారంభించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉండటంతో బంధువులు ఆసుపత్రి గేటు ఎదురుగా మృతశిశువును ఉంచి ఆందోళన కు దిగారు. సమయానికి వైద్యం అందించకపోవటం వలనే అనూష పరిస్థితి విషమంగా మా రిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు అక్కడకు చేరుకొని వారికి మద్ద తు తెలిపాయి. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ ఎం అబ్బయ్య ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనూష పరిస్థితి విషమంగానే ఉందని మెరుగైన చికిత్సకు ఖమ్మం వైద్యశాలకు వెళ్లాలని ఆసుపత్రి అధికారులు మరలా సూచించారు.
సకాలంలో వైద్యం అందక... నిండుగర్భిణి పరిస్థితి విషమం
Published Sun, Sep 29 2013 3:32 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement