మనుగడ ప్రశ్నార్థకం ! | Are forest products marketing down ? | Sakshi
Sakshi News home page

మనుగడ ప్రశ్నార్థకం !

Published Wed, Nov 6 2013 5:50 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

Are forest products marketing down ?

భద్రాచలం, న్యూస్‌లైన్: అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలతో ఒక వెలుగు వెలిగిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ)మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవులు అంతరించిపోతుండటంతో ఉత్పత్తుల సేకరణ ఆశించిన స్థాయిలో లేక ఆ శాఖాధికారులు ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ సంస్థ క్రమేణా గిరిజనులకు దూరమైపోతోంది.   జిల్లాలో భద్రాచలం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ ద్వారా ఏడాదికి రూ. 35 కోట్ల మేర వ్యాపారం సాగుతుంది. ఎనిమిది బ్రాంచ్‌ల ద్వారా ఇందుకనుగుణంగా ఆ శాఖాధికారులు ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. గతంలో అటవీ ఉత్పత్తుల సేకరణ  ద్వారానే ఏడాదికి రూ.5 కోట్లకు పైగా వ్యాపారం సాగేది. కానీ క్రమేపీ అవి  తగ్గిపోతుండటంతో జీసీసీ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. గత ఏడాది రూ.3.50 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటకీ రూ.2.50 కోట్ల మేరకే చేరువయ్యారు. ఇలా భద్రాచలం డివిజన్ గత రెండేళ్లుగా లక్ష్య సాధనలో వెనుకబడుతోంది. ఆంధ్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మినహా మరే ప్రాంతంలోనూ అడవులు పెద్దగా కనిపించటం లేదు. పోడు భూముల సాగుతో అడవులు క్రమేపీ అంతరిస్తున్నాయి. దీంతో అటవీ ఉత్పత్తులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చీపుర్లు, చింతపిక్కలు, చిల్ల గింజలు, తేనె, విప్పపువ్వు, విప్పబద్ద, వెదురు, జిగురు, నరమామిడి చెక్క వంటి అటవీ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో ఒకప్పుడు సమృద్ధిగా దొరికేవి.  ప్రస్తుతం విప్పపువ్వు, కొంతమేర జిగురు తప్ప మరే ఇతర వస్తువులూ లభించటం లేదు. జిగురు సేకరణలో ఒకప్పుడు భద్రాచలం డివిజన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం జిగురు ద్వారానే లభించేది. ప్రతి ఏటా 1000 క్వింటాళ్లకు పైగా జిగురు సేకరించేవారు. కాగా, గత ఏడాది ఇది 710 క్వింటాళ్లకు మించలేదు. ఈ ఏడాది ఇంకా తగ్గిపోయేలా కనిపిస్తోందని జీసీసీ అధికారులు చెపుతున్నారు.
 
 మొండి బకాయిలతో ఇబ్బందులు...
 డీఆర్ డిపోల ద్వారా గిరిజనులకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల విక్రయంతో పాటు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, సెల్ఫ్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లకు నిత్యావసరాలను జీసీసీ ద్వారానే సర ఫరా చేస్తున్నారు. ఈ సరుకులకు ఐటీడీఏ సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. గత జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.3.75 కోట్ల మేర బకాయిలు ఐటీడీఏ నుంచి జీసీసీకి రావాల్సి ఉంది. అత్యధికంగా ఇల్లెందు బ్రాంచి పరిధిలో రూ.1.10 కోట్లు, భద్రాచలం బ్రాంచి పరిధిలో రూ. 63 లక్షలు, పాల్వంచ బ్రాంచి నుంచి రూ. 53 లక్షలు,  దమ్మపేట బ్రాంచిలో రూ. 51 లక్షలు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం గిరిజన సహకార సంస్థ అధికారులు ఐటీ డీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. జీసీసీలకు వ్యాపారం చూపుతున్న ఐటీడీఏ పీవో కరుణించి బిల్లులు మంజూరు చేస్తే తప్ప వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో జీసీసీల నిర్వహణకు కొంత ఇబ్బంది కలుగుతోంది.
 
 రైతులకు రుణాలు బంద్..
 గిరిజనులకు వ్యవసాయ, వ్యాపార అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ ద్వారా రుణాలు ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన అప్పు వసూలు చేయడంలో అప్పటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సంస్థ ఉన్నతాధికారలు ఇక రుణాలు ఇవ్వవద్దని తేల్చి చెప్పారు. 2007 నుంచి ఇప్పటి వరకు రుణ బకాయిలు రూ.50 లక్షల మేర వసూలు చేయాల్సి ఉంది. అయితే సంస్థ మనుగడ దృష్ట్యా ఈ ఏడాది రూ.32 లక్షల రుణాలివ్వాలని జీసీసీ అధికారులు ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించినా.. బకాయిల కారణంగా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. దీంతో అందుబాటులో ఉన్న నిధులతో స్థానిక అధికారులు ఇప్పటివరకు రూ.11 లక్షలు గిరిజనులకు రుణాలిచ్చారు. ఇంకా ఇవ్వాలనుకున్నా నిధులు లేవు. ఇలా గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన జీసీసీ ప్రస్తుతం వారికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. జీసీసీకి మాత్రం ఆర్థిక సహాయం అందించకపోవడం గమనార్హం.
 
 డీఆర్ డిపోలపైనే మనుగడ...
  అటవీ ఉత్పత్తులు తగ్గిపోవటంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు దృష్టి సారించారు. దీనిలో భాగంగా గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులను విక్రయించేందుకు వారికి అందుబాటులో ఉండే విధంగా జిల్లాలో 149 డీఆర్ డిపోలను ఏర్పాటు చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు నిత్యావసర సరుకులను ఈ కేంద్రాల ద్వారా బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే అందించేలా వీటిని ఏర్పాటు చేశారు. ఏడాదికి రూ.1.50 కోట్ల మేర వీటి ద్వారా వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఆశించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం వస్తుండటంతో దీనిపైనే ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఎల్‌డబ్ల్యూఈఏ, ఆర్‌ఐడీఎఫ్ పథకాల కింద విడుదలైన రూ.4.99 కోట్లతో డీఆర్ డిపోల కోసం నూతన భవనాలు, గోడౌన్‌ల నిర్మాణాన్ని  చేపట్టారు. అయితే ఇవి చాలా చోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారుల నిర్వాకంతో నిర్మించిన భవనాలు కూడా ఉపయోగపడటం లేదు.
 
 
 ఉన్నతాధికారులకు నివేదించాం
 గిరిజన సహకార సంస్థ ప్రస్తుతం డీఆర్‌డిపోల వ్యాపారంపైనే ఆధారపడిన మాట వాస్తవమే. అటవీ ఉత్పత్తులు ఆశించిన స్థాయి లో రావటం లేదు. అడవులు అంతరించిపోతుండడంతో ఇక భవిష్యత్‌లోనూ అవి లభించే పరిస్థితి లేదు. దీంతో సంస్థ మనుగడ కోసం సూపర్ మార్కెట్‌లను నెలకొల్పాలనే ఆలోచన ఉంది. ఉన్నతాధికారులకు దీనిపై నివేదించా ము. మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారిం చాము. సంస్థను కాపాడుకునేందుకు ఉద్యోగులు కూడా అంకిత భావంతో పనిచేయాలి.
 - రామస్వామి, జీసీసీ డివిజనల్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement