భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ రైతుపై ప్రకృతి పగపట్టింది...గోదావరి వరదలతో దెబ్బమీద దెబ్బ తగలడంతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతీ ఏటా వలెనే ఆగస్టులో గోదావరికి వరదలు వస్తాయని భావించిన ఈ ప్రాంత రైతులు ఈ ఏడాది ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగానే ఉపద్రవం ముంచు కురావడంతో భద్రాచలం డివిజన్‌లోని వాజేడు, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లో వేసిన వరి పంట, నాటేందుకు సిద్ధంగా ఉన్న వరి నారు పూర్తిగా నీటిముంపునకు గురయింది. అదే విధంగా భద్రాచలం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పత్తి, మిరప పంటలు వే లాది ఎకరాల్లో నీటమునిగాయి.
పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వరదలు రాగా పరీవాహక ప్రాంతంలో సుమారు 35 వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. గత వారం సంభవించిన వరద తగ్గుముఖం పట్టడంతో పాడైన పత్తి, మిర్చి మొక్కలను తీసి రైతులు మళ్లీ వాటి స్థానంలో కొత్తమొక్కలను వేశారు. ఇంతలోనే మరోసారి వరద ఉప్పెనలా వచ్చిపడటంతో మళ్లీ పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. మూడు రోజుల పాటు పూర్తిగా వరద నీటిలోనే ఉన్న పంటలు ఇక ఏమాత్రం పనికిరావని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో 31 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పాథమిక అంచనా వేశారు. ఒక్క భద్రాచలం డివిజన్‌లోనే 20 వేల ఎకరాలకు పైగా పంట నష్టం ఉంటుందని రైతులు అంటున్నారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో సుమారు 4 వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. అదే విధంగా మణుగూరు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగినాయి. పినపాక మండలంలోని భూతిరావుపేట, చింతలబయ్యారం, రాయిగూడెం, ఏడూళ్ళ బయ్యారం గ్రామాలకు చెందిన సుమారు 2 వేల ఎకరాల పంట పోలాలు నీట మునిగాయి. అలాగే వేలేరుపాడు మండలంలో 6 వేల ఎకరాలకు పైగా పంట భూములు మునకకు గురయ్యాయి.
రైతుల గోడు పట్టని ప్రభుత్వం: గోదావరి వరదలతో నష్టపోయిన రైతులకు భరోసా కరువవుతోంది. వేలాది రూపాయిల పెట్టుబడి పెట్టిన పంట కళ్ల ముందే పాడైపోవటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. పది రోజుల క్రితం వరద పరిస్థితిని చూసేందుకని వచ్చిన కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్ రైతులకు అపార నష్టం వాటిల్లిందని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 నుంచి 10 వేల వరకూ వెంటనే అందజేస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఆది ఆచరణకు నోచుకోలేదు. అధికారులు సైతం దీనిపై స్పష్టంగా చెప్పకపోవటంతో బాధిత రైతులు పరిహారం కోసం ఎదురు చూడాల్సివస్తోంది. ప్రస్తుతం గోదావరి వరదలతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో వరి, పత్తి పంటలు బాగా దెబ్బ తిన్నాయి. పత్తి పంట అయితే పూర్తిగా కుళ్లిపోయింది. పంట నష్టం సుమారుగా రూ. 13 కోట్ల వరకూ ఉండవచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నట్లు ఓ వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.
నీలం తుఫాన్ పరిహారమే రాలేదు....
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం సకాలంలో అందటం లేదు. గత ఏడాది సంభవించిన నీలం తుపాను కారణంగా పాడైన పంటలకు ఇప్పటి వరకూ నష్ట పరిహారం చెల్లించలేదు. రూ.10.63 కోట్ల పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించినా ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. రైతుల అకౌంట్లలోనే జమ చేస్తామని సాకులు చూపించిన ప్రభుత్వం బాధిత రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ పరిహారం మాత్రం నేటికీ మంజూరు కాలేదు. 34,200 మంది బాధిత రైతులకు గాను 28,200ల మందికి చెందిన బ్యాంకు అకౌంట్లను తె రిపించి వారికి సంబంధించిన రూ.8.96 కోట్లను పంపకాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం డబ్బులు మంజూరు కాని పరిస్థితి ఉంది. ప్రస్తుత వరదలతో నష్టపోయిన పంటకు పరిహారం ఇంకెన్నాళ్లకు వస్తుందోననే రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఇబ్బందులను ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ రైతుకు వరదకష్టాలు
Published Tue, Aug 6 2013 4:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement