భద్రాచలం, న్యూస్‌లైన్ : తెలంగాణ విభజన సెగ భద్రాచలాన్ని తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన నాటి నుంచి హైదరాబాద్ తరువాత భద్రాచలంపైనే చర్చ సాగుతోంది. బుధవారం భద్రాచలంలో చోటుచేసుకున్న ఘటన ఈ ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో కలపాలనే దానిపై మరింత చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
భద్రాచలానికి చెందిన కొన్ని ఆదివాసీ సంఘాల వారు బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఆంధ్ర ప్రాంతంలోనే కలపాలని కోరారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సున్నం వెంకటరమణ, మన్యసీమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చిచ్చడి శ్రీరామ్మూర్తి, గిరిజన ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ గొంది వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘాల నాయకుడు కారం సత్తిబాబు, భద్రాచలం పరిరక్షణ కమిటీ కన్వీనర్ పీవీఎస్ విజయవర్మతోపాటు పలువురు నాయకులు ఆదివాసీల తరఫున తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన పలువురు నాయకులు విలేకరుల సమావేశం జరుగుతున్న రాజుల సత్రంలోకి ప్రవేశించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని నినాదాలు చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వారిని అడ్డుకున్నారు.
దీనిపై ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ఏర్పాటుతో ఆదివాసీలకు తలెత్తే సమస్యలపై చర్చించుకుంటున్న తరుణంలో ఇలా సమావేశాన్ని అడ్డగించటం సరికాదని ఆదివాసీ విద్యార్థిసంఘం నాయకుడు కారం సత్తిబాబు తీవ్రంగా స్పందించారు. ఇరువర్గాల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఇరువ ర్గాల వారిని శాంతింపజేశారు. భవనం బయటకు వచ్చిన తరువాత మళ్లీ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతం మునిగిపోనుందని అందుకనే దాన్ని అడ్డుకుంటున్న త రుణంలో ఇలా ఆంధ్రలో కలుస్తామని చెప్పటం సరైంది కాదని బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు ఆదివాసీ నాయకులతో వాదనకు దిగారు. దీనిపై సున్నం వెంకటరమణ, గొందివెంకటేశ్వర్లు, చిచ్చడి శ్రీరామ్మూర్తి సమావేశం జరుపుకోవడానికి గల కారణాలను వివరించారు. ఇరువర్గాల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు వారితో చర్చించారు. రాష్ట్రాల విభజనపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో సున్నితమైన అంశాలపై అనుమతి లేనిదే సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు. ఇరు వర్గాల వారికి తగు హెచ్చరికలు చేసి పంపించారు.
అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛను అడ్డుకుంటే ఎలా : భద్రాచలం ప్రాంతంలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర విభజన జరిగే సమయంలో తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ వాదులు అడ్డుకోవటం ఎంతవరకూ సమంజసమని ఆదివాసీ సంఘాల నాయకులు సున్నం వెంకటరమణ, గొందివెంకటేశ్వర్లు, చిచ్చడి శ్రీరామ్మూర్తి అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో ఉద్యోగాలు, చివరకు పదవులు కూడా ఆదివాసీలకు దక్కకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే లంబాడాలు భద్రాచలం ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారని, అదే జరిగితే ఇక్కడ ఆదివాసీలు కనుమరుగై పోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ జాతి పరిరక్షణ కోసం ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నుంచి దశల వారీ ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు.
భద్రాచలం తెలంగాణాలో అంతర్భాగమే : భద్రాచలం ప్రాంతం తెలంగాణలో అంతర్భాగమేనని బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు అన్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలనే ఎత్తుగడను ప్రభుత్వం చేస్తోందని దీన్ని తాము అడ్డుకుంటామన్నారు.
భద్రాద్రిని తాకిన విభజన సెగ
Published Thu, Aug 8 2013 4:16 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement