కుక్కునూరు,న్యూస్‌లైన్: గోదావరి వరద మరో రైతు నిండుప్రాణాన్ని బలిగొంది. వరదలు తొలగిన తర్వాత కుళ్లిన పత్తిమొక్కలను చూసి ఓరైతు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుక్కునూరు మండలం రామసింగారంలో ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం....
రామసింగారానికి చెందినపసుపులేటి వెంకటేశ్వరరావు(32) అనే రైతు తనకున్న నాలుగుఎకరాలకు తోడు ఆరెకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను వేశాడు. గత నెలలో వచ్చిన వరదలకు పదెకరాలలోని పత్తిచేలు పాడయ్యాయి. ఆ తర్వాత యాభై వేలకుపైగా వెచ్చించి పదెకరాలను శుభ్రం చేయించి మళ్లీ విత్తు నాటాడు. కాగా మూడురోజులుగా గోదావరికి వచ్చిన వరదలవల్ల మళ్లీ చేలన్నీ నీటమునిగాయి. మంగళవారం సాయంత్రం వరదలు కాస్త తగ్గాయని చేలకు వెళ్లి చూడగా పత్తి మొక్కలన్నీ కుళ్లిపోయిఉన్నాయి. నాటిన విత్తనాలు కూడా వరదపాలయ్యాయి. దీంతో వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడంతా వృధా అయిందని నిరాశ చెందాడు. ఆవేదనతో ఇంటికి వచ్చిన ఆ రైతు...రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాను, పంటంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసి పక్కకు వె ళ్లి పురుగుమందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య, తల్లిదండ్రులు చెబుతూ భోరున విలపించారు. రైతు మృతి వార్తను తెలుసుకున్న తహశీల్దార్ గన్యానాయక్, ఎస్సై అబ్బయ్య పరామర్శించారు. విచారణ తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని కుటుంబసభ్యులకు తెలిపారు.
పంట వరదపాలైందని రైతు ఆత్మహత్య
Published Wed, Aug 7 2013 4:26 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement