కమలాకర్‌రావు (ఫైల్)
గొల్లపల్లి(ధర్మపురి) : వ్యవసాయమే తన కుటుంబానికి జీవనాధారం. తనకున్న నాలుగెకరాలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు బిడ్డలను ఇంటర్ వరకు చదివించి వివాహాలు చేశాడు. కొడుకును డిగ్రీ చదివిస్తున్నాడు. కొన్నేళ్లుగా కాలం కరుణించకపోవడంతో అనుకున్న స్థాయిలో పంట చేతికందడం లేదు. అయినా భగీరథ ప్రయత్నం చేశాడు. అప్పుచేసి బావిలో పూడిక తీయించాడు. ఈ సారిసాగు చేసిన పంట కూడా ఎండిపోయింది. అప్పు తీర్చేదారి కనిపించక తన వ్యవసాయ పొలం వద్దనే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనపర్తి కమలాకర్‌రావు (48)కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహం చేశారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. తనకున్న నాలుగెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఈ సారి నీళ్లు తక్కువగా ఉండడంతో ఎకరంన్నరలో వరి, 30 గుంటల్లో ఆరుతడి పంటలు వేశాడు. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో మూడున్నర లక్షలు అప్పుతెచ్చి తన వ్యవసాయబావిని 12గజాల వరకు తవ్వించాడు.
ఆ నీళ్లు సరిపోకపోవడంతో వరిపొలం ఎండిపోయింది. వ్యవసాయానికి, కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పు రూ. 10లక్షలు దాటింది. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొన్నిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఉదయం 11 అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే కమలాకర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగతజీవిగా పడిఉన్న కమలాకర్‌రావు మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ లక్ష్మిబాబు, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని మాజీ జెడ్పీచైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment