సత్తయ్య(ఫైల్)
రేగొండ(భూపాలపల్లి): అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన రైతు గంటా రఘుపతి(45)కి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత రెండేళ్లుగా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప, మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు కురవక, తెగుళ్లబారినపడి పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే పెట్టుబడుల కోసం రూ.10 లక్షల మేర అప్పులయ్యాయి. ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన రఘుపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గుండెపోటుతో రైతు మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు అందె సత్తయ్య(55) గుండెపోటుతో మృతి చెందాడు. పంటలు సరిగా పండకపోవడం, గల్ఫ్‌లో పనులు లభించక కుమారుడు ఇంటికి తిరిగిరావడం, ఇటీవల ఇద్దరు కూతుళ్ల వివాహం చేయడంతో రూ.5 లక్షల వరకు అప్పు అయింది. అప్పు తీర్చేదారిలేకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment