
ఈ సర్కారుకు బుద్ధి చెప్పాలి: చంద్రబాబునాయుడు
వరద బాధితులను ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
సాక్షి, విశాఖపట్నం: వరద బాధితులను ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. వరదలకు ఇళ్ళల్లో నీరు చేరి, ఇళ్లు కూలిపోయి రోడ్డున పడ్డ పేదలకు కిరణ్ ప్రభుత్వం కేజీ బియ్యం కూడా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు సోమవారం విశాఖ జిల్లాలో మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి, నక్కపల్లి మండలాల్లో ముంపు గ్రామాలను పరిశీలించారు.
మునగపాక మండలం చూచుకొండ గ్రామం మొత్తం వరద ముంపుకు గురవడంతో బోటుపై వెళ్లి గ్రామాన్ని పరిశీలించారు. చంద్రబాబు రాకతో వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరి, చెరకు రైతులు నష్టపోయిన పంటలను తీసుకువచ్చి చూపించారు. కానీ చంద్రబాబు వీరి సమస్యలను వినకపోవడం విశేషం. మొత్తం విశాఖ జిల్లా పర్యటనలో సోమవారం ఎనిమిది చోట్ల చంద్రబాబు ప్రసంగించారు. కేవలం జాతీయ రహదారిపైనే పర్యటిస్తూ ఎక్కడా జనం లేకపోయినా ఎక్కువసేపు ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు, కలెక్టర్‌ల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు.
తక్షణమే వరిని నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేలు, చెరకు రైతులకు హెక్టార్‌కు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వరద ప్రభావానికి గురయినా కేంద్రం పట్టించుకోలేదని ఎంపీలు దద్దమ్మలుగా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ది పనికిమాలిన ప్రభుత్వమని అందుకే ఆ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి తాను పర్యటిస్తున్నానని చెప్పారు. సోమవారం చంద్రబాబు, చిరంజీవి ఒకేరోజు ఒకే ప్రాంతంలో పర్యటించారు. అయితే మునగపాక మండలంలో వీరిద్దరూ కాన్వాయ్‌లు ఎదురుపడడంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు. కాగా, చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం సత్యదేవుని దర్శించుకుని పంపా రిజర్వాయర్‌ను సందర్శిస్తారని, తరువాత తొండంగి మండలంలో పర్యటన కొనసాగుతుందని టీడీపీ నేతలు తెలిపారు.