గోదారంత తిప్పలకు.. గుప్పెడు గింజలూ కరువే
- వరద బాధితుల పట్ల సర్కారు నిర్దయ
- వారంపాటు లంక గ్రామాల వారి పాట్లు
- కనీస సాయానికి నిబంధనల అడ్డంకి
- పస్తులున్న వారికీ జాబితాలో దక్కని చోటు
- 10 వేల కుటుంబాలకు అందని సాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గోదావరి ఉగ్రరూపంతో ఈ నెల రెండో వారంలో జిల్లాలో పలు లంకగ్రామాలు, తీర ప్రాంత గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలు దాదాపు వారం రోజుల పాటు ముంపు నీటిలోనే ముప్పుతిప్పలు పడ్డాయి. ముంపు నుంచి తేరుకుని బయటపడ్డ అలాంటి కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడంలో చంద్రబాబు సర్కారుకు ఇంకా చేతులు రాలేదు. ప్రజల సంక్షేమమే ధ్యేయమని గొప్పలకు పోయే తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో నిబంధనల సాకుతో సాయమందించకుండా ముంపు బాధితులకు మొండిచెయ్యి చూపింది.
వరదతో జిల్లాలో 15 మండలాలు ప్రభావితమయ్యాయి. సుమారు 300 లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. వందల ఇళ్ళలోకి నీరు చేరింది. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లంక గ్రామాలకు చెందిన వేలాదిమంది బడుగు బలహీన వర్గాల వారు ముంపు వల్ల పనులు లేక పస్తులున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రకృతి వైపరీత్యాల బాధితులకు నిబంధనలతో నిమిత్తం లేకుండా తక్షణ సాయంగా కనీసం బియ్యం, కిరోసిన్ అందజేస్తుంది. గత ప్రభుత్వాలు జిల్లాలో వరదలు సంభవించినప్పుడు నిబంధనలు సడలించి బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ చొప్పున అందజేశాయి. గత ఏడాది వరదల్లో అప్పటి కిరణ్ సర్కార్ కూడా ఇదే రీతిలో సాయం అందించింది.
గత సర్కార్లు ఇచ్చిన సాయంలో కోత
అయితే తాజా వరదల్లో బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనల సాకుతో సాయానికి కోత పెట్టింది. గత ప్రభుత్వాలు ఇచ్చిన సాయంలో సగానికి సగం తగ్గించి, ఒక్కో బాధిత కుటుంబానికి 10 కిలోల బియ్యం, ఒక లీటరు కిరోసిన్ ఇవ్వడానికి నిర్ణయించింది. వీటిలో ఇప్పటికి 10 కిలోల బియ్యం మాత్రమే అందజేసింది. ఇస్తానన్న లీటరు కిరోసిన్ కూడా వరదలు వచ్చి ఇన్ని రోజులయ్యాక కూడా ఇవ్వలేకపోయింది. వరద నీరు ఇంట్లోకి వచ్చిన లేదా ఇంటిని చుట్టుముట్టిన కుటుంబాలకు మాత్రమే బియ్యం, కిరోసిన్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టి, రాకపోకలు స్తంభించి, పనులకు వెళ్లే దారిలేక పస్తులతో గడిపిన కుటుంబాలకు పిడికెడు బియ్యం ఇచ్చే ఔదార్యం సర్కారుకు లేకపోయింది.
అన్యాయమన్న అధికార పార్టీ ఎమ్మెల్యే..
పి.గన్నవరం మండలంలో ఊడిమూడిలంక, మునగల్లంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, కె.ఏనుగుపల్లి తదితర 17 లంక గ్రామాలు వరదల్లో ముంపుబారిన పడ్డాయి. ఆ గ్రామాల వారు బాహ్య ప్రపంచంలోకి వెళ్లాలంటే పడవలే దిక్కయ్యాయి. వారం రోజులపాటు వారికి ముంపు తిప్పలు తప్పలేదు. సుమారు రెండువేల కుటుంబాల వారు రాకపోకలే కాదు.. దైనందిన జీవనమూ గడవక ఇబ్బంది పడ్డారు. వీరిలో అత్యధికులు రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయకూలీలే. వారం రోజులపాటు జన జీవనం స్తంభించినా.. నిబంధనల పుణ్యమా అని ఈ మండలం మొత్తం మీద.. నీరు చేరిన, నీరు చుట్టుముట్టిన 420 ఇళ్ల వారిని మాత్రమే బాధితులుగా గుర్తించి 10 కిలోల బియ్యం అందజేశారు.
మిగిలిన కుటుంబాలను బాధితులుగా గుర్తించనేలేదు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి, నాలుగుల్లంక గ్రామాల్లో బాధితులను కూడా సర్కారు సాయానికి దూరం చేసింది. అయినవిల్లి, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఆత్రేయపురం తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బాధితులదీ ఇదే దుస్థితి. ఇలా కోనసీమతో పాటు ఇతర మండలాల్లో వరద పీడిత లంక గ్రామాల్లో సుమారు 10 వేల కుటుంబాలకు పైగా సాయానికి నోచుకోలేదంటున్నారు.
తన నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిబంధనల వల్ల అన్యాయం జరుగుతోందని అధికారపార్టీకే చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధికారులను నిలదీయడం గమనార్హం. దీనిపై ఆయన కలెక్టర్ నీతూప్రసాద్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇకనైనా.. ప్రభుత్వం కనీస కారుణ్యాన్ని కనబరచాలని, చిరుసాయానికి కూడా మోకాలడ్డుతున్న నిబంధనలను సడలించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.